Modi-CBN: దొందూ దొందే! | Mutual Criticism Between Chandrababu Naidu And Narendra Modi In 2019 Elections, More Details Inside | Sakshi
Sakshi News home page

మోదీ-సీబీఎన్‌.. దొందూ దొందే!

Published Tue, May 7 2024 8:25 AM | Last Updated on Tue, May 7 2024 9:36 AM

Mutual Criticism Between Chandrababu Naidu And Narendra Modi In 2019 Elections

బాబుకు ఏటీఎం పోలవరం: మోదీ

కరుడు గట్టిన ఉగ్రవాది మోదీ: బాబు

2019 ఎన్నికల్లో పరస్పర విమర్శలు..

తిట్టుకున్న గతం మరిచి నేడు ఇద్దరూ చెట్టాపట్టాల్‌

అసహజ కూటమి మాటున మోదీ–బాబుల అనాలోచిత వ్యాఖ్యలు..

సాక్షి, అమరావతి: అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు.. ఇదీ చంద్రబాబు నైజం.. అయిదేళ్ల కిందట ప్రధాని మోదీని ఇష్టానుసారం తిట్టారు... ఆయన కుటుంబం గురించీ వ్యక్తిగత విమర్శలు చేశారు.. ప్రధాని మోదీ సైతం చంద్రబాబు వైఖరికి భిన్నం కాదని ఇప్పుడు నిరూపించుకున్నారు.. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని రాజమండ్రిలో తన హావభావ విన్యాసాలతో కాస్త వ్యంగాన్ని జోడించి నాడు ఎగతాళి చేశారు.. ఎద్దేవా చేశారు.. చంద్రబాబు అక్రమాలకు అంతులేదన్నారు. 

చంద్రబాబు అవినీతిని మోదీ దుమ్మెత్తి పోస్తే.. మోదీపై టెర్రరిస్టు ముద్ర వేసి, అలాంటి వ్యక్తిని ఇంకా అరెస్టు చేయకుండా ఎందుకు వదిలేశారని... చంద్రబాబు గతంలో తెగ రంకెలేశారు. కట్‌ చేస్తే.. ఇప్పుడు 2024 ఎన్నికల సమయం.. వీరిద్దరూ కలిసిపోయారు.. గతాన్ని మరిచిపోయారు.. లేక మరిచిపోయినట్లు నటిస్తున్నారు కాబోలు. చంద్రబాబు స్క్రిప్టులో ఓ ముక్కను మోదీ నోట పలికిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు జాప్యానికి చంద్రబాబే కారణమని తెలిసినా.. అదే రాజమండ్రి వేదికగా జనం నవ్వుకునేలా ఆ నెపాన్ని ప్రధాని మోదీ జగన్‌ ప్రభుత్వంపై వేయడం హాస్యాస్పదం.

      ఐదేళ్ల వెనక్కి వెళ్తే.. రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్న  చంద్రబాబును ఉద్దేశించి ప్రధాని మోదీ తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు.  2014–19 మధ్య ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న కాలంలో అమరావతి నుంచి పోలవరం వరకు ఆయా కార్యక్రమాలను కేవలం తన ఆస్తులు పెంచుకోవడానికి కోసం ప్రయతి్నంచారని బాబును మోదీ దుమ్మెత్తిపోశారు.... ప్రతిగా చంద్రబాబు సైతం మోదీపై ఇప్పటి దాకా దేశంలో మరే రాజకీయ పార్టీ సైతం చేయనంతగా వ్యక్తిగత స్థాయిలో విమర్శలకు దిగారు.

2018లో చంద్రబాబు ఏన్డీఏ నుంచి ని్రష్కమించాక ప్రధాని మోదీ అప్పట్లో రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి వస్తే,  చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండీ తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో నల్ల చొక్కాలు వేయించి, గో బ్యాక్‌ నినాదాలు చేయించారు. ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ  అప్పట్లో టీడీపీ నేతలు నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసనలు తెలిపారు.

ఆ సందర్భంగానే మోదీ  చంద్రబాబును ఉద్దేశించి చేసిన ప్రసంగాల వీడియోలు సోషల్‌మీడియాలో ఇప్పుడు వైరల్‌ అవుతూ వారిద్దరి ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేస్తున్నాయి.  చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. వ్యక్తిగత అభివృద్ధిలో బిజీ అయిపోయారనీ అప్పట్లో ప్రధాని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియను తమకు కావాల్సినప్పుడు డబ్బులు డ్రా చేసిపెట్టే ఏటీఎం లాగానే  చంద్రబాబు ఉపయోగించుకున్నారని ప్రధాని ఆరోపించారు.

ప్రధాని నరేంద్ర మోదీ వివిధ సందర్భాల్లో చంద్రబాబుపై చేసిన విమర్శలు, ఆరోపణలు.. 
‘లోకేష్‌ తండ్రి చంద్రబాబు నాకు సంపదను సృష్టించడం తెలియదని అన్నారు. అవును నిజమే. నాకు సొంత ఆస్తులు పెంచుకోవడం రాదు. అమరావతి నుంచి పోలవరం వరకు తన ఆస్తులు పెంచుకోవడానికి చంద్రబాబు ప్రయతి్నస్తున్నారు. సొంత ఆస్తులు పెంచుకునే ఆశ నాకు లేదు. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి (చంద్రబాబును ఉద్దేశించి) వాస్తవాలను వదిలిపెట్టి అసత్యాలు మాట్లాడుతున్నారంటే ఆయన ప్రజల మద్దతు కోల్పోయారని అర్ధం. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ వ్యక్తి ఏదో పెద్ద తప్పు చేశారనే అర్ధం...’

‘ప్రజలారా మీరే చెప్పండి.. ఎన్‌టీఆర్‌ వారసత్వాన్ని తీసుకున్నాయన (చంద్రబాబును ఉద్దేశించి) ఎన్‌టీఆర్‌ కలలను సాకారం చేస్తానని మాటిచ్చారా లేదా...? ఎన్‌టీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తామని హామీ ఇచ్చారా లేదా?.. ఈ రోజు ఆయన ఎన్‌టీఆర్‌కు గౌరవమిస్తున్నారా?... సోదర సోదరీమణులారా మీకు ఈ విషయం అర్ధమవుతుంది.  ఆయనలాంటి(బాబు) సీనియర్‌ నాయకుడికి ఎందుకు అర్ధం కావడం లేదు. పార్టీ చరిత్రనే ఆయన మరిచిపోయేంతటి ఒత్తిడి ఏం వచి్చంది. ఇదంతా యువత తెలుసుకోవాల్సిన అవసరముంది.. ఎన్‌టీఆర్‌ ఏపీకి కాంగ్రెస్‌ నుంచి విముక్తి కావాలనుకున్నారు. అందువల్లే తెలుగుదేశం అవిర్భవించింది. ఈ రోజు ఆ వారసత్వపు అహంకారాన్ని ఎదుర్కోవాల్సిన తెలుగుదేశం అధినేత అదే వంశపారంపర్య కుటుంబం ముందు మోకరిల్లారు. అప్పట్లో ఏపీని అవమానించిన కాంగ్రెస్‌ను దుష్టకాంగ్రెస్‌ అని ఎన్‌టీఆర్‌ అన్నారు. ఇప్పుడు  చంద్రబాబు అదే కాంగ్రెస్‌తో దోస్తీ కట్టారు...’

2019 ఫిబ్రవరి 10... గుంటూరు సభలో ప్రధాని మోదీ..
‘చంద్రబాబుకు ఏమైంది. ఆయన నా కంటే చాలా సీనియర్‌నని మళ్లీ మళ్లీ నాకు గుర్తు చేస్తుంటారు. ఇందులో వివాదం ఏముంది. మీరు (చంద్రబాబు) సీనియర్‌. అందువల్లే గౌరవమిచ్చే విషయంలో ఎప్పుడూ తక్కువ చేయలేదు..  అవును మీరు సీనియర్‌ కూటములు మార్చడంలో.. కొత్త కూటములు కట్టడంలో.. మీ సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో.. ఈ రోజు ఎవరినీ తిడతారో.. రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో.. నేనైతే ఈ విషయాల్లో సీనియర్‌ను కానే కాదు...’

‘కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను చేపట్టిన పథకాలపై.. చంద్రబాబు తన స్టిక్కర్‌ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. అద్భుతమైన అమరావతి నిర్మాణమంటూ వ్యక్తిగత అభివృద్ధిలో బిజీ అయిపోయారు. చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. కూలిపోతున్న తన పార్టీ నిర్మాణం...’

2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు మోదీని ఉద్దేశించి వివిధ సందర్భాల్లో చేసిన  తీవ్ర విమర్శలు... 
–మార్చి 29, 2018న అసెంబ్లీలో చంద్రబాబు
బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే ఇంకా 15 సీట్లు వచ్చేవి.. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం ఎన్డీఏ నుండి బయటకు వస్తే.. అది రాజకీయ ప్రయోజనాల కోసం అని మాట్లాడుతున్నారు. నిజంగా నేను రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనుకుని ఆనాడు బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే.. ఇంకో 15 సీట్లు ఎక్కువ వచ్చేవి...’

ఫిబ్రవరి 8, 2019 తన ట్విట్టర్‌లో చంద్రబాబు
‘దేశ రక్షణ రంగంలో అతి పెద్ద కుంభకోణంగా పేర్కొంటున్న రూ. 59,000 కోట్ల  రఫెల్‌ ఒప్పందం, అందుకు సంబంధించిన నివేదికలు, ఇందులో నేరుగా ప్రధాని కార్యాలయ ప్రమేయం ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటుంటే, దానిపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వ విధ్వంసక నిర్ణయాలను తెలియజేస్తుంది. మోదీజీ... మీరు దేశాన్ని మోసం చేస్తే ఆ సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేరు...’ 

–2019 ఫిబ్రవరి 2న అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు..
‘మీకూ, బ్రిటిష్‌ వాళ్లకూ తేడా ఏమిటి? వాళ్లే నయం. కాటన్‌ దొర ఇచి్చన నీళ్లయినా తాగుతున్నాం. మేము మీ బానిసలమా? రాజధానిని 50 ఏళ్లకు నిరి్మస్తారా ? నాలాంటి సీనియర్‌ నాయకుడు నల్ల చొక్కా వేసుకున్నానంటే వీళ్లు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ప్రజలు అర్ధం చేసుకోవాలి. 2002లో మోదీ, నిన్న అమిత్‌షా రాకీయాల్లో వచ్చారు. నేను 1978లోనే నేను ఎమ్మెల్యేనయ్యా. ప్రధాని మోదీని సార్‌ అంటూ గౌరవిస్తే అమరావతికి మట్టి, నీరు ముఖాన కొట్టిపోతారా?..’

  • ‘రాష్ట్రం కోసం 29 సార్లు తలవంచుకుని ఢిల్లీ వెళ్లా. కేంద్రం ముందు చేయి చాచా. ఎలాంటి కనికరం లేదు. ప్రజలుగా మీరు చెప్పండి...’ –2018  జూన్‌ 9న నెల్లూరులో సభలో చంద్రబాబు

  • ‘బీజేపీకి ఒకటే చెబుతున్నా, తెలుగుదేశంతో పెట్టుకుంటే ఖబడ్డార్‌.. మీ కుట్రలు ఏ రాష్ట్రంలోనైనా చెల్లుతాయోమో... ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సాగవు...’ –2018లో శృంగవరపుకోటలో జరిగిన నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు

  • ‘నేను ఎవరికీ భయపడేది లేదు, నరేంద్ర మోదీ, ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బందులు పెడితే భయపడే పిరికి పందను కాను. ఒక్కో రాష్ట్రంలో ఉండే నాయకత్వాన్ని బలహీన పరచడానికి, ఇష్టమొచి్చనట్లు ఆడుకోవడం వీళ్లకు అలవాటైంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలను చూశాను. ఎప్పుడూ భయపడలేదు. భయమనేది నా జీవితంలేదు. –2018లో మార్చి 6 న విజయవాడలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు...’

2019  మార్చి 2వ తేదీన విశాఖపట్నం సభలో ప్రధాని మోదీ..
‘దేశం కోసం మేం గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామంటే మాకెటువంటి బెరుకూ లేదు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే వెనుక ఎవరైనా వచ్చి మా ఫైళ్లు తెరుస్తారనో, అవినీతి ఆరోపణలు చేస్తారనో భయం నాకే మాత్రం లేదు. ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు (చంద్రబాబును ఉద్దేశించి) భయపడాలి. ఎందుకంటే వారు చేసిన అవినీతి వారిని ఎప్పుడూ వెంటాడుతుంది. ఈ విషయం వారికి తెలుసు. అవినీతి చేయడంలో, ముఖ్యమంత్రిగా ఉంటూ తన కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేసి తప్పు చేశారని వారికి తెలుసు...’

ఏప్రిల్‌ 1, 2019న రాజమండ్రిలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో మోదీ..
‘కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందించినప్పటికీ, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే చిత్తశుద్ధి మాత్రం ఈ టీడీపీ ప్రభుత్వానికి లేదు. ఎప్పుటికప్పుడు పోలవరం ప్రాజెక్టు ఖర్చు అంచనాలను పెంచుతూ, ఎక్కువ డబ్బు పొందుతూ  చంద్రబాబుకు ఈ ప్రాజెక్టు ఒక ఏటీఎంలా మారింది. అందులో నుంచి డబ్బులు తీసేసుకోవడమే. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు అంచనాలను పెంచడం ద్వారా ఎవరికి మేలు  చేయాలని యూ టర్న్‌ బాబు అనుకుంటున్నారో మీ అందరికీ తెలుసు. రాష్ట్ర రైతుల క్షేమం కాదు, ఎవరి క్షేమం కోసం ఆయన ఆలోచిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ అర్ధం చేసుకోగలరు.’  

‘యూ టర్న్‌ బాబు (చంద్రబాబును ఉద్దేశించి) పరిస్థితి ఎలా ఉందంటే బాహుబలి సినిమాలో రాజు భల్లాలదేవుడి పాత్ర మాదిరే. తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని తిరిగి దాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలకైనా వెనుకాడడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించేవారైతే.. ఇక్కడి యూ టర్న్‌ బాబు మాత్రం తన కుటుంబం మొదట, ఆ తర్వాత తన అనుయాయులు అన్నట్టు పాలన సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హెరిటేజ్‌ (సంస్కృతి) మంచి పాలనతో రాస్ట్ర ప్రజలందరూ అభివృద్ధి చెందాలన్నదైతే... యూ టర్న్‌ బాబు నైజం మాత్రం తన సొంత హెరిటేజ్‌ (చంద్రబాబు కుటుంబీకుల వ్యాపార సంస్థ పేరు) కంపెనీ బాగుంటే చాలన్న తీరు...’

పోలవరం ఆలస్యానికి బాబే కారణం..
పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి కారణం ముమ్మాటికీ నాటి సీఎం, నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబే. కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు మ్యాన్యువల్‌ను తుంగలో తొక్కి.. వరదను మళ్లించేలా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేయకుండానే– ఈసీఆర్‌ఎఫ్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌) డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌ వాల్‌ను నిరి్మంచారు. గోదావరికి 2019, 2020లలో వచి్చన భారీ వరదలు.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడం వల్ల డయాఫ్రమ్‌ వాల్‌ కోతకు గురై దెబ్బతింది.

ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతం కోతకు గురై విధ్వంసం చోటుచేసుకుంది. పోలవరాన్ని కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారంటూ గత ఎన్నికల ప్రచారంలో 2019, ఏప్రిల్‌ 1న రాజమహేంద్రవరం సభలో ప్రధాని నరేంద్ర మోదీ కన్నెర్ర చేయడం అప్పట్లో సంచలనం రేపింది. పోలవరం జాప్యానికి చంద్రబాబు తప్పిదమే కారణమని ఫిబ్రవరి 6న రాజ్యసభలో కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రకటించారు.

వాస్తవాలు ఇలా ఉంటే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వల్లే పోలవరం పనులు ఆగిపోయాయంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీసత్యసాయిజిల్లా ధర్మవరంలో నిర్వహించిన సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆరోపించారు.  సోమవారం రాజమహేంద్రవరం సభలో ప్రధాని నరేంద్ర మోదీ అదే మాటను వల్లె వేయడం గమనార్హం. అయితే డయాఫ్రమ్‌వాల్‌పై కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను రీయింబర్స్‌ చేయకుండా ఇలా ఆరోపణలు తగవని నీటిపారుదల రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

  • ‘విభజన హామీలను నాలుగు బడ్జెట్‌లలోనూ పట్టించుకోలేదు. చివరి బడ్జెట్‌లోనూ ఏపీ పేరు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రయత్నం చేయలేదు. ఈ రాష్ట్రం ఒకటి ఉందన్న ఆలోచన లేదా?  ఏం ప్రధాని ఓ గంట సమయం ఇవ్వలేరా? మిత్రపక్షంగా రండి. కూర్చుందాం అని అన్నారా...? మీరొక్కరే దేశాన్ని కాపాడతారా. ఏం మీకొక్కరికే దేశభక్తి ఉందా?..’ –2018 మార్చి 7న ఓ సమావేశంలో చంద్రబాబు..

  • ‘భార్యనే చూసుకోని వాడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు?....’ – అసెంబ్లీలో చంద్రబాబు తన ప్రసంగంలో..

  • ‘నరేంద్ర మోదీ కరుడుకట్టిన ఉగ్రవాది. మంచివాడు కాదు...’ – 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం నాయకుల సమావేశంలో చంద్రబాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement