పేదల గొంతుకై నిలుస్తాం: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Comments After Election Results | Sakshi
Sakshi News home page

పేదల గొంతుకై నిలుస్తాం: వైఎస్‌ జగన్‌

Published Wed, Jun 5 2024 5:01 AM | Last Updated on Wed, Jun 5 2024 9:27 AM

YS Jagan Mohan Reddy Comments After Election Results

ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి.. ప్రతిపక్షం.. పోరాటం.. కొత్తేమీ కాదు

ఢిల్లీలో సైతం శాసించగల కూటమి ఇది

ఎవరో మోసం చేశారు, అన్యాయం చేశారని అనొచ్చు

అయితే ఆధారాలు లేవు.. ఏం జరిగిందో దేవుడికి తెలుసు 

ప్రజల తీర్పును స్వీకరిస్తాం.. వారి కోసం పోరాడతాం

ప్రభుత్వంలోకి వచ్చిన వారికి అభినందనలు

నాకు తోడుగా నిలిచిన నేతలు, కార్యకర్తలు, వలంటీర్లు, నా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు కృతజ్ఞతలు

విలేకరుల సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అనంతరం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా

ఏం జరిగిందో తెలియదు కానీ, ఏం చేసినా, ఎంత చేసినా ఇంకా 40 శాతం ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. కచ్చితంగా గుండె ధైర్యంతో నిలబడి మళ్లీ ఇక్కడి నుంచి లేస్తాం. ప్రతిపక్షంలో ఉండటం కొత్తకాదు. పోరాటాలు చేయడం అంతకన్నా కొత్తకాదు. ఈ ఐదు సంవత్సరాలు తప్ప నా రాజకీయ జీవితమంతా ప్రతిపక్షంలోనే గడిపాను. రాజకీయ జీవితంలో ఎవ్వరూ చూడని కష్టాలు అనుభవించాను. ఇప్పుడు అంతకన్నా కష్టాలు పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం. ఎదుర్కొంటాం. ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్లకు ఆల్‌ ది వెరీ బెస్ట్‌. 

ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు.. అని అనొచ్చు. కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేనైతే చేయగలిగిందేమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాను. మంచి చేయడానికి మాత్రం కచ్చితంగా ప్రజలకు తోడుగా ఉంటాం. వాయిస్‌ ఆఫ్‌ ది వాయిస్‌లెస్‌ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ పేదవాడికి తోడుగా ఉంటూ గళం విప్పుతుంది. పెద్దపెద్ద వాళ్ల కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితులు ఉన్న కూటమి ఇది. ఈ కూటమిలో ఉన్న బీజేపీ, చంద్రబాబుకు, పవన్‌ కళ్యాణ్‌కు, అందరికీ కూడా వాళ్ల గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా, నా ప్రతి కష్టంలో తోడుగా, అండగా నిలబడిన ప్రతి నాయకుడికీ, ప్రతి కార్యకర్తకూ, ప్రతి వలంటీర్‌కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చి స్టార్‌ క్యాంపెయినర్‌గా నాకు తోడుగా నిలబడిన నా అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని సంక్షేమ పథకాలు, ఎక్కడా ఏ పేదవాడికీ దక్కని ప్రయోజనాలు.. అవినీతికి తావు లేకుండా, నేరుగా వారి గుమ్మం వద్దకే తీసుకువెళ్లే వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ ఎందుకిలా జరిగిందో తెలియడం లేదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఫలితాలన్నీ దాదాపుగా కొలిక్కి వస్తున్నాయి. 

జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇలా జరుగుతుందని, ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదు. పిల్లలు బాగుండాలని, వాళ్ల చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ.. అమ్మ ఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేశాం. వారికి మంచి చేయాలనే తపనతో అడుగులు వేశాం. 31 లక్షల ఇంటి పట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో ఇచ్చాం. వాటిలో 22 లక్షల ఇళ్లు కట్టిస్తున్నాం. మరి ఆ అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు’ అన్నారు. ‘66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు గతంలో ఎన్నడూ జరగని విధంగా మంచి చేశాం. 



వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే సంక్షేమాన్ని పంపించే వ్యవస్థను సైతం తీసుకువచ్చాం. గతంలో మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇస్తున్న చాలీచాలని పెన్షన్‌ నుంచి.. ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

‘దాదాపు కోటీ 5 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ, వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాటా తప్పకుండా అన్ని రకాలుగా వాళ్లకు అండగా ఉంటూ.. ఆసరా, చేయూతతో తోడున్నాం. సున్నా వడ్డీతో సైతం అండగా నిలిచాం. మరి ఆ కోటీ ఐదు లక్షల అక్కచెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్కచెల్లెమ్మల ఆప్యాయత ఏమైందో తెలియదు’ అని అన్నారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

పిల్లల చదువుల కోసం పరితపించాం 
‘పిల్లల చదువుల కోసం ఏ తల్లీ, తండ్రీ ఇబ్బంది పడకూడదని మొట్టమొదటి సారిగా పూర్తి ఫీజు ఇస్తూ అండగా నిలవడం ద్వారా చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. ఏటా దాదాపుæ 12 లక్షల మందికి మంచి చేశాం. ఆ పిల్లలు, తల్లుల అభిమానం ఏమయ్యిందో తెలియదు. 54 లక్షల మంది రైతలన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా పెట్టుబడికి సహాయం అందించే కార్యక్రమం మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగింది. 

అంతగా రైతన్నకు తోడుగా ఉంటూ, రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం గానీ, సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఉచిత ఇన్సూ్యరెన్స్, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చే కార్యక్రమం చేశాం. మరి ఆ అరకోటి మంది రైతుల ప్రేమ ఏమైందో తెలియదు. ఆటోలు, టాక్సీలు నడుపుకుంటున్న వాళ్లు ఇబ్బంది పడకూడదని వారికి అండగా నిలుస్తూ వాహనమిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ నేతన్న నేస్తం, మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా ఇచ్చాం. 

పుట్‌పాత్‌ల మీద చిన్న చిన్న ఇడ్లీ దుకాణాలు, వ్యాపారాలు చేసుకుంటున్న నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు మంచి జరగాలని ఆరాపడుతూ వాళ్లకు తోడుగా నిలిచాం. నా రజకులకు, నాయీ బ్రాహ్మణులకు, టైలర్లకు అండగా ఉంటూ చేదోడు ఇచ్చాం. ఇన్ని కోట్ల మందికి మంచి చేసి, ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టో అంటే చెత్త బుట్టలో పడేసే డాక్యుమెంట్‌ కాదు, మేనిఫెస్టో అంటే ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత అని మొట్టమెదటి రోజు నుంచీ భావిస్తూ.. ఏకంగా 99 శాతం వాగ్దానాలు అమలు చేశాం. చిత్తశుద్ధితో మేనిఫెస్టోను అక్కచెల్లెమ్మల ఇళ్లకు తీసుకెళ్లి చూపించి మీరే టిక్‌ పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా పని చేశాం. 

ఇంటి వద్దకే సేవలు 
ఎప్పుడూ జరగని విధంగా, పేదరికం పోవాలంటే.. పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్‌ అవసరం అని ఇంగ్లిష్‌ మీడియంను వ్యతిరేకిస్తున్న పెత్తందార్లతో సైతం యుద్ధం చేసి పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం తీసుకురావడమే కాకుండా, ఆ పేద పిల్లలకు అండగా నిలబడాలని, తోడుగా ఉండాలని, వారి చరిత్రను కూడా మార్చాలని టోఫెల్, ఐబీ లాంటి కలలు కన్నాం. ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్థాయిలోనే సచివాలయం, వలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చి.. వివక్ష, కరప్షన్‌ లేకుండా ప్రతి ఇంటికీ సేవలందించాం. దాదాపు రూ.2.70 లక్షల కోట్లు ఇంటి వద్దకే అందించగలిగాం. 

ఎప్పుడూ చూడని మార్పులను తీసుకు రావడమే కాకుండా విద్య, వ్యవసాయం, వైద్య రంగంలో ఏ పేదవాడు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదని, ఊహించని మార్పులు తీసుకొస్తూ పేదవాడికి అండగా నిలబడగలిగాం. మహిళా సాధికారత అంటే ఇదీ అని, సామాజిక న్యాయం అంటే ఇదీ అని ప్రపంచానికి చూపించగలిగాం. ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి చేసిన తర్వాత ఆ అభిమానం ఏమయ్యిందో, ఆ ఆప్యాయత ఏమైందో తెలియదు’ అంటూ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్‌ తన స్పందనను ముగించారు. అనంతరం సీఎం పదవికి రాజీనామా చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement