పుత్తూరులో బుధవారం ఇరుకు సందులో రోడ్ షో నిర్వహిస్తున్న చంద్రబాబు
చంద్రబాబు సభలు, రోడ్ షోలో జాడలేని మిత్రపక్షాలు
అవమానంతో ముఖం చాటేసిన రెండు పార్టీల నేతలు
ఎన్నికల్లో తమ సత్తా చూపుతామంటూ శపథం
చంద్రబాబు స్థాయికి ఇరుకు సందుల్లో సభలా?
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు అంటేనే అవకాశవాద రాజకీయాలకు, కుట్రలు, కుతంత్రాలకు ఆద్యుడు. కేవలం తన అవసరాల కోసమే పొత్తులు, ఎత్తులతో చెత్త రాజకీయాలు చేయడంలో ఆయనదే అగ్రస్థానం. 2014లో తన అవసరాల కోసమే బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని గద్దెనెక్కారు. అధికారంలో భాగస్వామం ఇవ్వాల్సి వస్తుందని వారితో తెగతెంపులు చేసుకున్నారు. 2019లో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. తర్వాత అవినీతి కేసుల్లో 52 రోజులు జైలు జీవితం అనుభవించారు. తాజాగా ఎన్నికల్లో మళ్లీ బీజేపీ వద్ద మోకరిల్లారు. ఢిల్లీలో పడిగాపులు కాసి ఎట్టకేలకు ఎన్డీఏ కూటమిలో బెర్తు సంపాదించారు.
ఈ ఎత్తుగడ అంతా ఎందుకంటే కేసుల నుంచి తప్పించుకునేందుకేనని అందరికీ తెలిసిపోయింది. అయినా యథావిధిగానే చంద్రబాబు తన ప్రసంగాల్లో మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉన్నారు. మరో వైపు తన మార్కు రాజకీయానికి పదును పెట్టారు. ఎన్నికల ప్రచారం నుంచి పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టేశారు. కూటమి పార్టీల్లోని మిత్రపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడంతో మిత్రపక్షాలు రగిలిపోతున్నాయి.
రోడ్ షో సభల్లోనూ అదే తీరు..
పలమనేరు, పుత్తూరు రోడ్ షో సభల్లోనూ చంద్రబాబు తీరులోనూ మార్పులేదు. ఇక్కడ కూడా మిత్రపక్షాల నేతలకు అవకాశం ఇవ్వలేదు. జిల్లాలో బీజేపీతోపాటు జనసేన పార్టీలకు చెప్పుకోదగ్గ నేతలు ఉన్నప్పటికీ వారికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. తన ప్రసంగాల్లో కూడా మిత్రపక్ష నేతల పేర్లుగానీ, వారి భాగస్వామ్యం కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. కూటమి పార్టీలన్నీ టీడీపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని మాత్రం పదేపదే విన్నవించారు.
ఇరుకు సందుల్లో సభలా..
రాజకీయాల్లో 40 ఏళ్లు అనుభవం ఉందంటూ పదే పదే చెప్పుకునే చంద్రబాబు తన స్థాయికి తగిన విధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించటం లేదని సాక్షాత్తూ టీడీపీతోపాటు బీజేపీ, జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. కుప్పంతోపాటు పలమనేరు, పుత్తూరు నిర్వహించిన సభలు చాలా ఇరుకు సందుల్లో నిర్వహించారు. జనం రారనే ఉద్దేశంతోనే చంద్రబాబు ముందస్తు జాగ్రత్తగా పట్టుమని వందమంది నిలబడలేని సందుల్లో సభలు పెట్టడం గమనార్హం. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో జనం రాలేదు. చంద్రబాబు ఎన్నికల ప్రచార వాహనం ముందు చుట్టూ పలుచగా జనం కనిపించడంతో ఏం చేయాలో దిక్కుతోచక తల పట్టుకునే పరిస్థితి ఎదురవుతోంది.
జెండాలు మోయడానికేనా..?
పొత్తు కోసం వెంపర్లాడిన చంద్రబాబు ఆ పొత్తు ధర్మాన్ని ఆచరించటం లేదని బీజేపీ, జనసేన నేతలు లోలోన రగిలిపోతున్నారు. తమకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా అడుగడుగునా అవమానిస్తున్నారని ఆయా పార్టీ నేతలు బాహాటకంగానే చెబుతున్నారు. తమను కేవలం జెండాలు మోయడానికే చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటున్నారని వాపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్నికల్లో తమ సత్తా చూపాలని ఆ రెండు పార్టీల నేతలు భావిస్తున్నారు.
చంద్రబాబు వన్‌మ్యాన్ షో..
చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచి ఆరంభించారు. ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఏకంగా మూడు రోజులు గడిపారు. పార్టీ నేతలు, క్యాడర్‌తో వరుసగా సమావేశాలు నిర్వహించి వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఎన్నికలకు సమాయత్తం కావాలని దిశానిర్దేశం చేశారు. కానీ, పొత్తు ధర్మాన్ని యథావిధిగా పక్కన పెట్టేశారు. తన ప్రసంగంలో సొంత పార్టీ టీడీపీ కేడర్‌కే ప్రాధాన్యత ఇచ్చారు. బీజేపీ, జనసేన మైత్రిని కేవలం కరివేపాకులా ప్రస్తావించారు.
ఎన్నికల ప్రచారాన్ని జిల్లాతోపాటు తన సొంత కుప్పం నుంచే ప్రారంభించిన సందర్భంగా, పొత్తులు ఎందుకు? ఏ కారణం చేత కూటమిగా ఏర్పడాల్సి వచ్చింది? అనే విషయాన్ని వివరించకుండానే లక్ష మెజారిటీతో గెలిపించాలని పదేపదే ప్రాధేయపడ్డారు. కనీసం వేదికలపై మిత్ర పక్షాలు బీజేపీ, జనసేన నేతలను మాట వరుసకు ఊడా పిలవలేదు. వచ్చిన వారికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో కూటమి పార్టీ నేతల్లో తీవ్ర అసహనం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment