రవాణా శాఖ అధికారులపై బూతులతో చెలరేగిన జేసీ ప్రభాకరరెడ్డి
అనంతపురం క్రైం: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి అధికారులపై విరుచుకుపడ్డారు. ‘నా కొ..ల్లారా.. ఒక్కొక్కరినీ నరుకుతా’ అంటూ బుధవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే బండబూతులతో చెలరేగిపోయారు. రవాణా శాఖ అధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు తాడిపత్రి మునిసిపల్ అధికారులకు, పోలీసులకు, వైఎస్సార్‌సీపీ నేతలకు బహిరంగంగానే వారి్నంగ్ ఇచ్చారు. ప్రధానంగా గతంలో రవాణా శాఖ కమిషనర్‌గా చేసిన ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులుతో పాటు అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, డీటీసీ శివరాంప్రసాద్, మహిళా అధికారిణి అత్తికానాజ్‌లను దుర్భాషలాడారు.
‘మీరెక్కడ దాక్కున్నా వదలను. గత ప్రభుత్వ హయాంలో నా బస్సులు, లారీలను అన్యాయంగా సీజ్ చేశారు. మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించారు. నన్ను, నా కొడుకును జైలుకు పంపారు. నిబంధనల మేరకే మేము బీఎస్–4 వాహనాలు కొన్నాం. బీఎస్–4 వాహనాలు అమ్మిన వాళ్లదే తప్పు అని సుప్రీం కోర్టు చెప్పింది. పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అమ్మిన వాహనాలను సరెండర్ చేశారు. అక్కడ రిజి్రస్టేషన్ చేసిన అధికారుల ఉద్యోగాలు పోయాయి. ఏపీలో మాత్రం వాహనాలు కొన్న మాపై కేసులు పెట్టారు. జైళ్లకు కూడా పంపారు.
అందరిపై ప్రతీకారం తీర్చుకుంటా. సీజ్ చేసిన మా బస్సులు, లారీలన్నీ తుప్పు పట్టిపోయాయి. వాటిని మీరే (అధికారులే) రిపేరు చేయించి తిరిగి రోడ్డుపైకి తేవాలి. ఇందుకు పది రోజులు గడువిస్తున్నా. లేదంటే భార్య, పిల్లలతో కలసి డీటీసీ, ఎస్పీ కార్యాలయాల ముందు నిరాహార దీక్ష చేస్తా. తాడిపత్రి మునిసిపల్ ఆఫీసులో కూడా చాలా ఇబ్బంది పెట్టారు. రేయ్.. కమిషనర్లూ మిమ్మల్ని వదలను. ‘నా కొ..ల్లారా నరికేస్తా. ఏమవుతుంది మీతో’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అధికారులను దుర్భాషలాడారు. ‘నా ఫ్యామిలీకి 620 ఏళ్ల చరిత్ర ఉంది. నా గడ్డం ఎందుకు వదిలాననుకుంటున్నారు? చంద్రబాబు సీఎం కావాలని వదల్లేదు.
ఒక్కో వెంట్రుకకు ఒక్కో కథ ఉంది. అత్తికానాజ్ ఆడదంట.. ఏమ్మా అన్నా వినలేదు. ఇంట్లో తను ఎలా ఉంటుందో తెలుసా?’ అంటూ రాయలేని భాషలో దూషించారు. వైఎస్సార్‌సీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నానీలను కూడా దూషించారు. బస్సులు, లారీల వ్యవహారం పూర్తిగా తన వ్యక్తిగత సమస్య అని, చంద్రబాబుకు, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు. తాను సొంతంగానే పరిష్కరించుకుంటానన్నారు. అవసరమైతే పార్టీకి కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. తాను ఊ అంటే చాలు తనకున్న జనం మరెవరికీ లేరని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment