ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామనలేదా?
ఇప్పుడు కేవలం ఒక్కరికే ఇస్తామనడం తల్లికి వందనమా.. తల్లికి మోసమా?
సీఎం చంద్రబాబు, కూటమి నేతలను ప్రశ్నించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు
కష్టమైనా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు వైఎస్ జగన్
ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు చంద్రబాబు
బాబు మోసాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి
సాక్షి, అమరావతి: పిల్లలను బడులకు పంపించడానికి పేదరికం అడ్డు కాకూడదని, బడి ఈడు పిల్లలు పనులకు పోకూడదన్న మంచి సంకల్పంతో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన అమ్మఒడి పథకాన్ని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తూ తల్లిదండ్రులను మోసగిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చదువుకునే పిల్లలున్న తల్లులకు ఏటా రూ.15 వేలు ఇవ్వడం ద్వారా పేదరికంలో ఉన్న వాళ్లకు వైఎస్ జగన్ మేలు చేశారని చెప్పారు.
ప్రపంచంలో ఎక్కడా ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు చేయనటువంటి వినూత్న ఆలోచనను చేసిన నేత ఒక్క జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ ఒక్క పథకానికే ఏకంగా రూ.26 వేల కోట్లు తల్లుల ఖాతాల్లోకి జమ చేశారన్నారు. ఐదేళ్ల తమ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని తెలుగుదేశం కూటమి కాపీ కొట్టడమేకాక, మాట నిలుపుకోలేదని ధ్వజమెత్తారు. ‘ఇంటిలో ఎంత మంది చదువుకున్నా జగన్ ఒక్కరికే రూ.15 వేలు ఇస్తున్నారు.
మమ్నల్ని అధికారంలోకి తీసుకొస్తే ఒకరైతే రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురు పిల్లలుంటే రూ.60 వేలు అందజేస్తామని ప్రకటిస్తే ప్రజలు ఆకర్షితులై ఓట్లేసి గెలిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబునాయుడికి ఉందా? లేదా?’ అని నిలదీశారు. ఇదే విషయాన్ని ప్రతి బహిరంగ సభలో కూడా చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్‌తో పాటు కూటమి నేతలంతా ప్రచారం చేశారని చెప్పారు. వారి ప్రచారానికి సంబంధించిన వీడియోలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు.
తల్లికి వందనం కాదు.. మోసం
తల్లికి వందనం పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని చదివితే చాలా అనుమానాలు కలుగుతున్నాయని అంబటి అన్నారు. ఈ జీవో ప్రకారం ప్రతి ఏడాది తల్లికి వందనం కింద రూ.15 వేలు అందిస్తామని ఉందని చెప్పారు. ఎంత మంది పిల్లలను స్కూల్‌కి పంపినా రూ.15 వేలు మాత్రమే ఇస్తామని దాని అర్థం అన్నారు. ఇది సూపర్ సిక్స్ కాదని.. సూపర్ మోసమని అభివరి్ణంచారు. ఇది తల్లికి వందనం కాదని.. తల్లికి మోసమని నిప్పులు చెరిగారు. ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు జగన్ అయితే, ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు చంద్రబాబు అని చెప్పారు. బాబు మోసంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారు?
జగన్ వద్దని, చంద్రబాబే కావాలని ఓట్లేసిన తల్లులు, కుటుంబాలు తాము ఎంత దారుణమైన మోసాలు చేసే వ్యక్తికి ఓట్లేశామో గుర్తించాలని అంబటి సూచించారు. ఇదే జగన్ ఉన్నట్లయితే జూన్ ఆఖరుకు ప్రతి తల్లి ఖాతాలో అమ్మఒడి జమ అయి ఉండేదని, ఇవాళ జూలై వచ్చినా ఆ డబ్బులు రాలేదన్నారు. ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారో చెప్పాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను మార్చి ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున డబ్బులు ఇచ్చి తీరాల్సిందేనన్నారు.
వాగ్దానాలు నెరవేర్చకపోతే వైఎస్సార్‌సీపీ మీ వెంట పడుతుందని హెచ్చరించారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఇప్పుడు చంద్రబాబు చెప్పడం దారుణం అని, ఆ విషయం హామీలు ఇచ్చే ముందు తెలియదా అని నిలదీశారు. వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుని ఉంటే బావుండేదని రాష్ట్ర ప్రజలు అనుకునే రోజులు ప్రారంభమయ్యాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment