ప్రతి కార్యకర్తకూ 'తోడుగా ఉందాం': వైఎస్‌ జగన్‌ | YS Jagan Direction To YSRCP MP And MLA Candidates, More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రతి కార్యకర్తకూ 'తోడుగా ఉందాం': వైఎస్‌ జగన్‌

Published Fri, Jun 21 2024 3:04 AM | Last Updated on Fri, Jun 21 2024 1:47 PM

గురువారం తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో మాట్లాడుతున్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

గురువారం తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో మాట్లాడుతున్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం

‘స్థానిక’ సంస్థల్లో నాలుగేళ్ల దాకా అవిశ్వాసం కుదరదు.. చట్టం నిరోధిస్తుంది 

చట్టాన్ని మార్చి ఏదో చేయాలనుకుంటే కోర్టులు ఒప్పుకోవు.. మన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను బెదిరించే యత్నాలు సాగవు

ఎవరూ ఆందోళన చెందొద్దని మనవాళ్లకు వివరించండి.. మన సంఖ్యాబలం తక్కువే కాబట్టి అసెంబ్లీలో చేయగలిగేదీ తక్కువే

స్పీకర్‌ పదవి చేపట్టనున్న వ్యక్తి ఎలా మాట్లాడారో అందరూ చూశారు

జగన్‌ ఓడిపోయాడు కానీ.. చనిపోలేదు.. చచ్చేదాకా కొట్టాలన్న వ్యక్తిని స్పీకర్‌గా చేస్తున్నారు

ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేయగలుగుతామనే నమ్మకం లేదు

మన జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరినీ కాపాడుకోవాలి

మనల్ని నమ్ముకుని కొన్ని కోట్ల మంది ఉన్నారు.. ఏ ఒక్కరూ నష్టపోకూడదు

ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశకు చోటివ్వద్దు 

మన అడుగులు ముందుకు వేయాల్సిందే 

ప్రతి అభిమాని, కార్యకర్తకూ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనదే.. ఇప్పుడిది ఇంటర్వెల్‌ మాత్రమే.. శకుని పాచికల ఘట్టం శ్రీకృష్ణుడు తోడు ఉన్నా.. పాండవులూ ఓడారు.. అంతిమంగా ధర్మం, విశ్వసనీయత, నిజాయితీ గెలుస్తాయి

ఎన్నికల ఫలితాలపై చాలామంది ఫీడ్‌ బ్యాక్‌ ఇస్తున్నారు.. మనం చేసిన మంచి ఇవ్వాళ్టికీ ప్రతి ఇంట్లోనూ ఉంది

శిశుపాలుడిలా చంద్రబాబు పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలసి పోరాడదాం

ప్రభుత్వ కార్యాలయాల్లో మేనిఫెస్టో కనిపించిన పాలన మనదైతే.. ఇప్పుడు రెడ్‌ బుక్‌  హోర్డింగ్‌లు పెడుతున్నారు. ఏ అధికారిపై కక్ష సాధించాలి? ఎవరిపై దాడులు చేయాలి? ఎవరిని నాశనం చేయాలి? ఎవరిపై కక్ష సాధించాలి? అని అందులో ఏకంగా పేర్లు రాసుకుంటున్నారు. వాళ్లను కొడతాం, చంపుతామంటూ నిస్సిగ్గుగా దౌర్జన్యం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. శిశుపాలుడి పాపాల మాదిరిగా ఈ ప్రభుత్వం పాపాలు వేగంగా పండుతున్నాయి.  
– వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: ‘‘మన కార్యకర్తలు కష్టాల్లోనూ, నష్టాల్లోనూ మనతోనే నిలబడ్డారు. జెండాలు మోసి కష్టపడ్డారు. మనకు ఓట్లు వేసి దెబ్బలు కూడా తిన్నారు. ప్రతి కార్యకర్తకూ తోడుగా నిలిచి భరోసా ఇద్దాం’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ఎన్నికల్లో శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో గురువారం తాడేపల్లి­లోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. సోషల్‌ మీడియా కార్య­కర్తలను, మనకోసం నిలబడ్డ వలంటీర్లను కాపాడు­కోవాలని పిలుపునిచ్చారు. 

గ్రామస్ధాయిలో మన పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరినీ కాపాడు­కోవాలని, వారికి తోడుగా ఉండాలని ఆదేశించారు. ‘‘రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూడని రీతిలో మన కార్యకర్తలు, సానుభూతిపరులమీద దాడులు చేస్తున్నారు. మనకు ఓటు వేసిన వారి మీద దాడులు చేస్తున్నారు. తీవ్రంగా అవమానించడంతోపాటు ఆస్తులకు నష్టం చేకూరుస్తున్నారు. ప్రాణాలు కోల్పోవడం కూడా కొన్ని చోట్ల చూశాం’’ అని పేర్కొన్నారు. ‘‘మీ అందరికీ ఒక్కటే చెబుతున్నా.. మీ నియోజక వర్గాలలో కార్యకర్తలకు తోడుగా ఉంటూ పరామర్శించి భరోసా కల్పించండి. సోషల్‌ మీడియా కార్యకర్తలు, మనకోసం నిలబడ్డ వలంటీర్లకు తోడుగా నిలవాలి. 

ఇప్పటికే పార్టీ తరఫున ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నాం. పార్టీ ఇచ్చే సహాయాన్ని మీరు స్వయంగా అందచేయండి’’ అని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ‘‘రాబోయే రోజుల్లో నేను కార్యకర్తలను కలుస్తా. నష్టపోయిన ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లి కలసి భరోసానిచ్చే కార్యక్రమం చేస్తా. మా ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి మా వద్దకు రాలేదనే మాట అనిపించుకోవద్దు. ప్రతి కార్యకర్తకూ భరోసా కల్పిద్దాం. ఇది అవసరం’’ అని సూచించారు. ‘‘మనల్ని నమ్ముకుని కొన్ని కోట్ల మంది ఉన్నారు. మనం పక్కకు తప్పుకుంటే వారంతా నష్టపోతారు. లక్షల మంది కార్యకర్తలు, వేలమంది నాయకులు, వందల మంది పోటీచేసిన అభ్యర్థులు కూడా నష్టపోతారు. 
 


మనల్ని నమ్ముకున్న ప్రజలు, నాయకులు అంతా నష్టపోతారు. నిరాశకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వకూడదు. ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలి’ అని ధైర్యం చెప్పారు. ప్రతి అభిమానికీ, ప్రతి కార్యకర్తకూ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనదేనని స్పష్టం చేశారు. ‘‘ఇప్పుడిది కేవలం ఇంటర్వెల్‌ మాత్రమే. శ్రీకృష్ణుడు తోడుగా ఉన్నా పాండవులకు ఓటమి తప్పలేదు. చివరకు ధర్మం, విశ్వసనీయత, నిజాయితీ తప్పకుండా. మనం ధర్మం వైపే ఉన్నాం. విశ్వసనీయతతో రాజకీయాలు చేశాం. తలెత్తుకునేలా రాజకీయాలు చేశాం. ప్రతి ఒక్కరూ అర్జునుడి మాదిరిగా తిరిగి విజయం సాధిస్తారు. పైన దేవుడున్నాడు. ఆయనే మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రజలను, దేవుడ్ని నమ్ముకున్నాం. ధైర్యంగా అడుగులు వేద్దాం’’ అంటూ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

మేనిఫెస్టో అజెండాగా పాలన..
ఈ రోజు నేను మీ అందరితో నా మనసు నుంచి వచ్చిన విషయాలను పంచుకుంటున్నా. ఈ ఎన్నికల్లో మీరంతా గట్టి పోరాటం చేశారు. ఎన్నికల ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయన్నది ఇవ్వాళ్టికీ ఆశ్చర్యకరం. ఎందుకంటే ఎప్పుడూ ఊహించని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా, మనలో ప్రతి ఒక్కరూ తలెత్తుకునేలా పాలన చేశాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టో హామీలను 99 శాతం అమలు చేశాం. ప్రతి ఇంటికీ మేనిఫెస్టోతో వెళ్లి ఆశీస్సులు తీసుకుని ఎన్నికలకు వెళ్లాం. ప్రతి గడపకూ తిరిగాం. 

రాష్ట్ర చరిత్రలో మేనిఫెస్టోను ఇంత సీరియస్‌గా ఎవరూ, ఎప్పుడూ తీసుకోలేదు. ఎన్నికల్లో పెద్ద పెద్ద మాటలు చెప్పి, పెద్ద పెద్ద పుస్తకాలు ముద్రించి ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పరిస్థితులను మనం చూశాం. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టర్‌ కార్యాలయాల వరకూ మేనిఫెస్టోలు పెట్టి అమలు చేశాం. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో హెచ్‌ఓడీల కార్యాలయాల్లో మన మేనిఫెస్టో పెట్టి అదే అజెండాగా పాలన చేశాం. వారందరినీ మొట్ట మొదటి రోజు నుంచి సమాయాత్తం చేసి అమలు చేసుకుంటూ ముందుకు వెళ్లాం.

సంస్కరణలతో విప్లవాత్మక మార్పులు..
ఎప్పుడూ జరగని విధంగా పేదవాడిని ఆ పేదరికం నుంచి బయటకు తెస్తూ మన అడుగులు పడ్డాయి. క్వాలిటీ చదువుల వల్లే ఇది సాధ్యమని భావించి విద్యారంగంలో సమూల సంస్కరణలు తెచ్చాం. మూడో తరగతి పిల్లలకు టోఫెల్‌ పీరియడ్, ఇంగ్లీషు మీడియం బడులు, ఆరో తరగతి నుంచే ఐఎఫ్‌పీలు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు.. ఇలా ఎన్నో మార్పులు తెచ్చాం. వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చాం. ఆరోగ్యశ్రీ కింద ఏకంగా రూ.25 లక్షల వరకూ వైద్యం ఉచితంగా అందించాం. ఆరోగ్య ఆసరా నుంచి గ్రామ స్ధాయిలో విలేజ్‌ క్లినిక్‌ ద్వారా ప్రతి పేదవాడికి తోడుగా ఉన్నాం. ఏకంగా 54 వేలమంది డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని నియమించాం. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి ఆర్బీకేల ద్వారా రైతన్నలకు తోడుగా నిలిచాం.

గ్రామ స్వరాజ్యానికి నిర్వచనం..
విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, సుపరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మొట్టమొదటిసారిగా గ్రామ స్ధాయిలో ఎన్నో మార్పులతో గ్రామ స్వరాజ్యానికి అర్థం తీసుకొచ్చాం. లంచాలు, వివక్ష లేని పాలన కచ్చితంగా సాధ్యమేనని గత ఐదేళ్లలో నిరూపించాం. ప్రతి పథకాన్ని డోర్‌ డెలివరీ చేశాం. మహిళా సాధికారితకు ఏం చేయవచ్చో అన్నీ చేశాం. అక్కచెల్లెమ్మలు ధైర్యంగా బయటకు వెళ్లే పరిస్ధితి కల్పించాం. దిశ యాప్‌ ద్వారా మహిళల భద్రతకు గట్టి చర్యలు తీసుకున్నాం. గ్రామంలోనే మహిళా పోలీసుల సేవలను తీసుకొచ్చాం.

చేసిన మంచే శ్రీరామరక్ష..
ఇంత జరిగిన తర్వాత కూడా ఏకంగా 40 శాతం ఓటు షేర్‌తో మనం ప్రతిపక్షంలో ఉన్నాం. 2019లో మనకు 50 శాతం ఓట్లు వచ్చాయి. ఈసారి 10 శాతం ఓట్లు తగ్గాయి. ఇదే ప్రజలు మళ్లీ 2029 వచ్చేసరికి చంద్రబాబు మోసాలను గుర్తించి రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ మనల్ని తెచ్చుకుంటారు. ఇవ్వాళ్టికి కూడా మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదు. ఈరోజు కూడా ప్రతి గడపలోనూ మనం చేసిన మంచి కనిపిస్తుంది. ప్రతి కుటుంబానికీ, ప్రతి ఇంటికీ మనం చేసిన మంచేమిటో తెలుసు. మనం చేసిన మంచే ఎప్పటికీ మనకు శ్రీరామరక్షే. విశ్వసనీయతకు మన పార్టీ చిరునామా. జగన్‌ మాట తప్పడు, మాట మీద నిలబడతాడు, మాట తప్పని పాలన ఇచ్చాడని విశ్వసనీయతకు అర్ధం చెబుతూ మనం అందించిన పాలనను ప్రజలు మరిచిపోరు. 

చంద్రబాబు సింగిల్‌ డిజిట్‌ చూస్తారు..
ఈరోజుకీ జగన్‌ అబద్ధాలు చెప్పడు, మోసం చేయడని గర్వంగా చెబుతున్నా. చంద్రబాబు కన్నా మనం ఎక్కువ హామీలిచ్చి ఉంటే బాగుండేదని చాలా మందికి అనిపించవచ్చు కూడా! రాజకీయాల్లో జగన్‌ ఇంత నిజాయితీగా ఉండడం అవసరమా? అనుకునే వాళ్లూ  ఉండొచ్చు! కానీ ఒక్కటే చెబుతున్నా... ఓడిపోయినా ఫర్వాలేదు. అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం.. ధర్మం, న్యాయం కాదనే జగన్‌ ఎప్పుడూ నమ్ముతాడు. 2014లో కూడా ఇదే నమ్మా. సాధ్యం కానిది సాధ్యం కాదనే చెప్పాను. చంద్రబాబు వ్యవసాయ రుణాల మాఫీ దగ్గర నుంచి అన్నీ చేస్తానని చెప్పి 2019 నాటికీ  చేయకపోవడం వల్ల నాడు ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో మనల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మనకు గొప్ప విజయంతో అధికారం ఇచ్చారు. ప్రజలు మళ్లీ అదే చేస్తారు. ప్రజలు మనల్ని ఏ స్థాయిలో ఆశీర్వదిస్తారంటే.. చంద్రబాబు నాయుడికి సింగిల్‌ డిజిట్‌ వచ్చే పరిస్థితులు కూడా చూస్తాం. ఇది వాస్తవం.

ప్రజలతో కలసి పోరాటాలు చేద్దాం..
మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదు. విశ్వసనీ­యతతో మనం చేసిన రాజకీయాలు ఎక్కడికీ పో­లేదు. ఈ రోజు నేను చెబుతున్నా.. జగన్‌కు వయసు­తోపాటు సత్తువ కూడా ఉంది. చంద్రబాబు పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలసి చేసే పోరా­టాల్లో వైఎస్సార్‌సీపీకి, జగన్‌కు ఎవరూ సాటిరారు. ప్రజలకు మళ్లీ దగ్గరయ్యే కార్యక్రమాలు, వారికి తోడుగా ఉంటూ వారి తరపున పోరాటం చేసే కార్య­క్రమాలు జరుగుతాయి. మన సంఖ్యాబలం తక్కువే కాబట్టి అసెంబ్లీలో మనం చేయగలిగేది తక్కువే. స్పీకర్‌ పదవి చేపట్టనున్న వ్యక్తి మాట్లాడుతున్న మాటలను మనం సోషల్‌ మీడియాలో చూస్తున్నాం. ఒకరేమో జగన్‌ ఓడిపోయాడు కానీ.. చనిపోలేదు అని అంటారు. చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకరు అంటారు. ఆ వ్యక్తిని ఇప్పుడు స్పీకర్‌ పదవిలోకి తీసుకెళ్తున్నారు. 

ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేయగలుగుతామనే నమ్మకం లేదు. కానీ చంద్రబాబు పాపాలు పండేకొద్దీ ప్రజలతో కలిసి, ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఊపందుకుంటాయి. శిశుపాలుడి పాపాలు పండినట్టుగా చంద్రబాబు నాయుడు పాపాలు వేగంగా పండుతున్నాయి. కులం, మతం, ప్రాంతం చూడకుండా, చివరకు ఏ పార్టీకి ఓటు వేశారని కూడా చూడకుండా ప్రతి పథకాన్ని మనం డోర్‌ డెలివరీ చేశాం. కానీ ఇవాళ వారి పార్టీకి ఓటు వేయలేదన్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా మనుషులపై దాడులు చేస్తున్నారు, అవమానిస్తున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారంటే శిశుపాలుడి పాపాలు చాలా వేగంగా పండుతున్నాయి. 

ప్రతి ఇంటికీ తలెత్తుకుని వెళ్లగలం..
ఓడిపోయామన్న భావనను మీ మనసులో నుంచి తీసేయండి. మనం చేసిన మంచి ప్రజల్లో ఉంది. ప్రతి ఇంట్లో కూడా మనం చేసిన మంచి ఉంది. ప్రతి ఇంటికీ మనం తలెత్తుకుని వెళ్లగలం. చెప్పినవన్నీ చేశాం కాబట్టి ప్రజల మధ్యకు గౌరవంగా వెళ్లగ­లుగుతాం. చంద్రబాబు ప్రలోభాల వల్ల మోసపో­యిన పరిస్ధితులతో మనకు అంతో ఇంతో అప­జయం జరిగింది. ఆ మోసాలు ఎప్పుడైతే తేటతెల్లం అవుతాయో.. కాలం గడుస్తున్న కొద్దీ చంద్రబాబుపై ప్రజాగ్రహం, మన పట్ల అభిమానం వ్యక్తం అవుతుంది. మనం మళ్లీ రికార్డు మెజార్టీలతో గెలుస్తాం.

బాధ అనిపించింది..
గతంలో ఎప్పుడూ ఇలాంటి మార్పులు జరగలేదు. ఇన్ని చేశాక వచ్చిన ఫలితాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇవేవీ చేయకపోయి ఉంటే... చేయలేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చుంటున్నామనే దానికి అర్ధం ఉండేది. ఇంత బాధ కూడా ఉండేది కాదు. కానీ ఇన్ని చేసిన తర్వాత, ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఫలితాలు చూసిన తర్వాత బాధ అనిపించింది. ఫలితాలు చూసిన తర్వాత శకుని, పాచికల కథ గుర్తుకొచ్చింది. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేం.

నాలుగేళ్లు అవిశ్వాసానికి ఆస్కారం లేదు
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు భరోసా కల్పించాలన్న వైఎస్‌ జగన్‌
మన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరితో మాట్లాడి భరోసా ఇవ్వండి. వారిని బెదిరించే కార్యక్రమాలు, ప్రలోభాలు జోరుగా జరుగుతున్నాయి. రాజీనామాలు చేయాలని వారిని  బెదిరిస్తున్నారు. మీ నియోజకవర్గాల్లో కార్యకర్తలను, నాయకులను పిలిచి చెప్పండి. స్థానిక సంస్థలకు సంబంధించి వారిపై నాలుగేళ్ల వరకూ కూడా అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. చట్టం దీన్ని నిరోధిస్తుంది. ఆ చట్టాన్ని మార్చి ఏదో చేయాలనుకుంటే ఏమీ చేయలేరు. కోర్టులు దీనికి ఒప్పుకోవు. అందువల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  ఈ విషయాలన్నీ మనవాళ్లకు విడమరచి చెప్పాలి. వారికి తోడుగా ఉన్నామనే ధీమా కల్పించాలి. అప్పుడు వారిలో భరోసా కలుగుతుంది. మీరంతా ఈ కార్యక్రమాన్ని కచ్చితంగా చేయాలి.

హోదా అడగకపోవడం శిశుపాలుడి పాపాల్లో ఒకటి..
కేంద్రంలో మెజారిటీ కోసం 272 స్థానాలు అవసరం కాగా బీజేపీ 240 దగ్గర ఆగిపోయింది. చంద్రబాబుకు 16 ఎంపీ స్థానాలున్నాయి. తాను ఎన్‌డీఏలో చక్రం తిప్పుతున్నట్టుగా ప్రధాని మోదీ పక్కన కూర్చుని కనిపిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను అడగకపోవడం, అడిగి సాధించుకునే దిశగా అడుగులు వేయకపోవడం శిశుపాలుడి పాపాల్లో ఒకటి. అలా అడగలేని మనిషి రాష్ట్రా­నికి, యువతకు ఏం సమాధానం చెబుతాడు?

హనీమూన్‌ ముగుస్తుంది..
ఇవాళ వైఎస్సార్‌సీపీ పాలన, జగన్‌ ఉండి ఉంటే ఈపాటికే విద్యాదీవెన ఇచ్చేవాళ్లం. ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన వసతి దీవెన బటన్‌ నొక్కేవాళ్లం. ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. రైతు భరోసా పెండింగ్, అమ్మ ఒడి పెండింగ్, చివరకు చిన్న అమౌంట్‌ అయిన మత్స్యకార భరోసా కూడా పెండింగ్‌లోనే పెట్టారు. ఒక్క జగన్‌ తప్పుకోవడంతో, వైఎస్సార్‌సీపీ పాలన లేకపోవడంతో ఏమీ రావడం లేదని ప్రజలు గమనిస్తున్నారు. ఏపీలో 4.12 కోట్ల మంది ఓటర్లున్నారు. దాదాపు సగానికిపైగా అక్కచెల్లెమ్మలే ఉన్నారు. 

రూ.1,500 ప్రతి ఒక్కరికీ ఇస్తానని చంద్రబాబు చెప్పాడు. ఇందులో పెన్షన్లు తీసుకునే వాళ్లని పక్కనపెట్టినా మిగిలిన 1.8 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. రూ.20 వేల పెట్టుబడి సహాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. దాదాపు కోటి మంది పిల్లలు అమ్మ ఒడి కింద వచ్చే డబ్బులు కోసం నిరీక్షిస్తున్నారు. వీరి కోసం అడుగులు ఏవీ ముందుకు పడని పరిస్థితి నెలకొంది. కాలం గడుస్తున్న కొద్దీ హనీమూన్‌ పీరియడ్‌ ముగుస్తుంది.

ఆ ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయో?
ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి తలెత్తుకుని సగర్వంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగాం.  కానీ ఫలితాలు చూస్తే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా రూ.2.7 లక్షల కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా నేరుగా అందచేశాం. ఏ పథకం ఏ నెలలో ఇస్తామో ముందే క్యాలెండర్‌ ప్రకటించి తేదీల వారీగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. ఇలా ఎప్పుడూ ఇలా జరగలేదు. మరి ఆ ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయి? అని ఒక్కోసారి అనిపిస్తుంది. మనం అధికారంలోకి రావడానికి రెండు నెలల ముందు వరకు పెన్షన్‌ కేవలం రూ.వెయ్యి మాత్రమే ఇచ్చిన పరిస్థితి ఉంటే మనం ఏకంగా రూ.3 వేలకు పెంచాం. 

అప్పట్లో 39 లక్షల మంత్రి మాత్రమే పెన్షనర్లు ఉంటే మనం వచ్చాక ఏకంగా 66 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తూ పింఛన్లు ఇంటి వద్దే వారి చేతికే అందించాం. వాళ్ల ఆశీస్సులు తీసుకున్నాం. మరి ఆ 66 లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మల ఆప్యాయతలు,  ప్రేమ­లు ఏమయ్యాయి? 54 లక్షల మంది తల్లు­లకు అమ్మ ఒడి అందించాం. పిల్లలు గొప్పగా చద­వాలి, వారికి మంచి భవిష్యత్‌ ఉండాలనే తప­నతో అమ్మఒడి ఇచ్చాం. వాళ్ల ప్రేమలు, ఆప్యా­య­తలు ఏమయ్యాయో తెలి­యదు. 

ఏకంగా 53.58 లక్షల మంది రైతన్నలకు పెట్టుబడి సహా­యం కింద రైతు భరోసా ఇచ్చాం. వ్యవసాయ రంగంలో ఇవి ఎప్పుడూ చూడని విప్లవాత్మక మార్పులు. మరి వారి ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియదు. ఏకంగా 1.5 కోట్ల మందికి పైగా అక్క చెల్లెమ్మలకు సున్నావడ్డీ ఇచ్చాం. 79 లక్షలమంది అక్క చెల్లెమ్మలు అప్పులతో కుదేలైన పరిస్థితుల్లో వారికి అండగా ఉంటూ ఆసరా ఇచ్చాం. 27 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు చేయూ­త క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఇచ్చాం. 

30 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ విద్యా దీవెన, వసతి దీవెన వారి తల్లులకే ఇ­చ్చాం. 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టా­లిచ్చాం. గతంలో ఎప్పుడూ చూడని విధం­గా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. 3.60 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు కాపు నేస్తం, 4.96 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం, 82 వేల మందికి నేతన్న నేస్తం, 2.76 లక్షల మందికి వాహనమిత్ర, 16 లక్షల మందిని తోడు కార్య­క్రమం ద్వారా ఆదు­కున్నాం. 3.38 లక్షల మందికి చేదోడు, 1.10 లక్షల మంది మత్స్యకారులకు మత్స్యకార భరోసా క్రమం తప్పకుండా ఇచ్చాం. కోవిడ్‌ లాంటి సంక్షోభ పరిస్థితులున్నా సాకులు చెప్పకుండా మంచి చేశాం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement