తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ-జనసేన సంయుక్త బహిరంగ సభ సపలం అయినట్లా? విఫలం అయినట్లా? ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్‌లు అర్థవంతమైన ప్రసంగాలు ఎందుకు చేయలేకపోయారు? తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పైన, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైన దూషణలకు దిగడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? చంద్రబాబు నాయుడు టీడీపీని నిప్పుతో అభివర్ణించుకుని పవన్‌కల్యాణ్‌ను గాలితో పోల్చడం, ఇద్దరు కలిసి వైఎస్సార్‌సీపీని బుగ్గి చేస్తామనడం, పవన్‌కల్యాణేమో వైఎస్సార్‌సీపీని పాతాళానికి తొక్కేస్తామని అనడం.. ఇవన్ని చూస్తే ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతామన్నట్లుగా లేదా!
గత కొద్ది రోజులుగా ఈ సభకు టీడీపీ మీడియా వీర హైప్ ఇచ్చింది. రెండు పార్టీలు కలిస్తే లక్షల మంది జనం తరలి వచ్చేస్తారని ఊదరగొట్టింది. ఆరు లక్షల మంది వస్తారని కథనాలు ఇచ్చింది. తీరా చూస్తే సభ ఏర్పాట్లు చేసిందే లక్ష నుంచి రెండు లక్షల మంది పట్టేంత మైదానంలో. కుర్చీలు వేసిందే పదివేల మందికట. అయినా సభ సూపర్ సక్సెస్ అయిందని ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలో ప్రచారం చేసి ప్రజలను మోసం చేయడానికి యత్నించాయి. తాడేపల్లిగూడెం జెండా సభకు బ్రహ్మరథం పట్టారని, జన సమూహం నిండు మనసుతో ఆశీర్వదించారని ఈనాడు పత్రిక రాయడం జనాలను మభ్య పెట్టడం కాక మరేమిటి!
జనం పర్వాలేదని రాస్తే ఏదో సరిపెట్టుకోవచ్చు. అలాకాకుండా అతిశయోక్తులతో రాయడం, వచ్చిన జనం మనసులోకి రామోజీరావు బృందం దూరి చూసినట్లుగా వారంతా నిండుమనసుతో ఆశీర్వదించారని రాశారంటేనే టీడీపీ కరపత్రంగా ఈనాడును ఎలా మార్చింది ఇట్టే తెలిసిపోతుంది. వైఎస్సార్‌సీపీ సిద్ధం సభకు లక్షల మంది వచ్చి హోరెత్తిస్తే, టీడీపీ, జనసేన సభకు అంత కలిపి నలభై.. ఏభై వేల మంది రాకపోయినా, తెలుగుదేశం పత్రికలు ఆహో, ఓహో అంటూ ఊదరగొట్టాయి. సభకు అటంకాలు కల్పించినా జనం తరలివచ్చారని మభ్యపెట్టే యత్నం చేశాయి. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు ఒకరినొకరు పొగుడుకోవడానికి, జెండాలు మార్చుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడం, కేవలం కింద స్థాయిలో కొట్టుకున్నట్లు రెండు పార్టీల నేతలను ఎలాగోలా బుజ్జగించడానికి చేసిన యత్నంగానే కనిపిస్తుంది.
కాకపోతే పవన్‌కల్యాణ్ మాదిరి జనసైనికులంతా చంద్రబాబుకు లొంగిపోతారా? లేదా? అన్నదే చర్చనీయాంశం. పొత్తులపై ఎవరూ సలహాలు ఇవ్వనక్కర్లేదని, యుద్ధం చేసే యువత కావాలని పవన్‌కల్యణ్ చెప్పడం ద్వారా చేగొండి హరిరామజోగయ్య వంటి వృద్దనేతలను అవమానించడానికి కూడా వెనుకాడలేదు. అందుకే జోగయ్య కూడా తమ సలహాలు వినకపోతే పవన్, చంద్రబాబుల ఖర్మ అని వ్యాఖ్యానించడం విశేషం. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను తిట్టడానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. మధ్యలో చంద్రబాబు తన సూపర్ సిక్స్ తో అంతా మారిపోతున్నట్లు కలరింగ్ ఇచ్చారు. ఆయన సంపద సృష్టించి లక్షల కోట్లు పంచుతానని అంటే. జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలన్నమాట.
పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏపాటి సంపద సృష్టించారా? ఎంత పేదలకు ఇచ్చారు? అది నిజమే అయితే ఈపాటికి ఏపీలో పేదరికం ఉండకూడదు కదా! అసలు సూపర్ సిక్స్ అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు నాలుగైదు రెట్లు ఇస్తామని చెప్పారంటేనే చంద్రబాబు వైఫల్యం చెందినట్లు కదా! వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కితేనేమో శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన వీరు ఇప్పుడు ఐదు రెట్లు బటన్‌లు నొక్కుతామని అంటున్నారు. దీనిని జనం విశ్వసిస్తారా? వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోటలు బద్దలు కొడతాం అంటూ కోతలు కోసిన పవన్‌కల్యాణ్ అసలు జనసేనకు బలమే లేదని, అందుకే తెలుగుదేశంపై ఆధారపడి పోటీచేస్తున్నామని చెప్పడం ద్వారా పార్టీ పరువును తీసేశారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద వేల కోట్లు ఉన్నాయట. తన వద్ద ఏమీ లేవట. తానే కదా.. ఒక్క సినిమా తీస్తే వందల కోట్లు వస్తాయని చెప్పింది.. ఆ సంగతి మర్చిపోయారు. పోల్ మేనేజ్ మెంట్ చేయడం తెలియదట. అందుకే టీడీపీపై ఆధారపడ్డారట. అంటే టీడీపీ బాగా డబ్బు ఖర్చు చేస్తుందని, ఆ పార్టీ వద్ద వేల కోట్లు ఉన్నాయని పవన్‌కల్యాణ్ చెప్పకనే చెప్పేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం, పిచ్చి వ్యాఖ్యలు చేయడం, తన మూడు పెళ్లిళ్లు గురించి, పెళ్లాల గురించి మాట్లాడి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన నాలుగో పెళ్లామా అని అసభ్యంగా మాట్లాడడం చూస్తే ఆయన వెర్రి పరాకాష్టకు చేరినట్టలే అనిపిస్తుంది. చంద్రబాబును, లోకేష్‌ను తాను గతంలో ఎలా విమర్శించింది.. అవినీతి ఆరోపణలు చేసింది.. మర్చిపోయి ఇప్పుడు సమర్దిస్తున్న తీరు ఆయన నైజంను తెలియచేస్తుంది.
తన తల్లిని దూషించిన లోకేష్‌ను క్షమించనని చెప్పింది పవన్‌కల్యాణ్ కాదా? చంద్రబాబుకు మనం బానిసలమా? పదో, పరకో సీట్లు పడేస్తే లొంగుతామా? అని చెప్పింది ఆయన కాదా? ఇప్పుడు చంద్రబాబును పొగుడుతున్న తీరు చూస్తే జనసేనకు సీట్లు ఇవ్వకపోయినా, పవన్‌కల్యాణ్‌కు ఏదో బాగానే గిట్టుబాటు అయిందన్న భావన కలగడం లేదా? అమరావతి రాజధానిని కుల రాజధాని అని అన్నది ఆయనే. ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించింది ఆయనే. ఇప్పుడు నవనగరాల సృష్టికర్త అని చంద్రబాబును పొగుడుతున్నది పవన్ కళ్యాణే. ఇదంతా అవకాశవాదం కదా అని జనసైనికులు ఎవరైనా అనుకుంటే దానికి ఏమి సమాధానం దొరుకుతుంది! ఏదో పవర్‌ఫుల్‌గా మాట్లాడానని పవన్‌కల్యాణ్ అనుకోవచ్చేమో కానీ, కేవలం తెలుగుదేశం పార్టీకి బాగా పవర్‌ఫుల్‌గా బాకా ఊదారనే జనం అనుకుంటారు.
ఈ సభకు లోకేష్ ఎందుకు రాలేదో తెలియదు. ఇక చంద్రబాబు ప్రసంగం తీరు చూస్తే.. మరీ అద్వాన్నంగా ఉంది. డెబ్బై నాలుగేళ్ల వయసులో ఆయనలో అధికార దాహం ఎంతగా ఉన్నది తెలిసిపోతుంది. ఎన్ని వీలైతే అన్ని అబద్ధాలు చెప్పడానికి ఆయన వెనుకాడడం లేదు. తానేమో స్వయంగా తన మామ ఎన్‌టీ రామారావును దారుణంగా అవమానించి పదవి నుంచి దించేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాత్రం షర్మిలకు ఏదో అన్యాయం చేశారంటూ పచ్చి మోసపూరిత వ్యాఖ్యలు చేస్తుంటారు. సైకో భాషను వాడుతూ చంద్రబాబు రాష్ట్రం నాశనం అయిందని అంటారు.
రాష్ట్రం నాశనం అవడం అంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుప్పంకు తాగునీరు, సాగునీరు ఇవ్వడమా? కుప్పంతో సహా వేలాది స్కూళ్లను బాగు చేయడమా? ఇంటింటికి డాక్టర్‌ను పంపడమా? కిడ్నీ బాధితులకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టడమా? వారికోసం భారీ నీటి పథకం తేవడమా? పద్నాలుగు మెడికల్ కాలేజీలు తేవడమా? నాలుగు ఓడరేవులు నిర్మించడమా? లక్ష కోట్ల పెట్టుబడులతో కొత్త పరిశ్రమలు తేవడమా? వలంటీర్ల వ్యవస్థను తెచ్చి పాలనను ప్రతి ఇంటికి చేర్చడమా? గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందించడమా? పది ఫిషింగ్ హార్బర్లు నిర్మించడమా? గ్రామాలలో వేలాది భవనాలు నిర్మించడమా? రైతు భరోసా కేంద్రాలు పెట్టడమా? పేద పిల్లలకు ఆంగ్ల మీడియంతో సహా అంతర్జాతీయ కోర్సులు అందించడమా..? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.. వీటిలో ఒక్కదాని గురించి అయినా చంద్రబాబు మాట్లాడే ధైర్యం ఎందుకు చేయడం లేదు!
పైగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన అమ్మ ఒడి తదితర స్కీములను ఇంకా ఎక్కువగా అమలు చేస్తానని ఎందుకు చెబుతున్నారు? కుప్పంకు టాంకర్లతో నీరు తీసుకు వెళ్లి కుప్పం కాల్వలో పోశారని పచ్చి అబద్ధాన్ని చెప్పగలిగారంటేనే ఆయన మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిప్పుతో వైఎస్సార్‌సీపీని తగలపెట్టాలట. దానికి పవన్‌కల్యాణ్ అనే గాలి తోడయిందట. ఇలాంటివి వ్యాఖ్యలు అసూయతోనే చేస్తారు తప్ప ఇంకొకటి కాదు. ఏపీ తగలబడాలన్న ఆలోచన ఉంటే తప్ప ఇలాంటివి ఊహకైనా వస్తాయా? ఏమి చేస్తాం. దురదృష్టం.
చివరిగా ఈ వ్యాఖ్య చూడండి.. మనలో ఒకరు ఎక్కువకాదు.. తక్కువ కాదు.. ఒక పార్టీ వెనుకాల మరో పార్టీ నడవడం లేదు.. రెండు పార్టీలు కలిసి అడుగులు వేస్తున్నాయి.. అని చంద్రబాబు అనడం చూస్తే ఏమనిపిస్తుంది. జనసేనను బకరా చేసి తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నట్లు తేలడం లేదూ! పవన్‌కల్యాణ్‌కు సీఎం సీటు షేరింగ్ ఉంటుందని మాట మాత్రం చెప్పని చంద్రబాబు రెండు పార్టీలు సమానమని అంటున్నారు. అరవై సీట్లు కూడా ఇవ్వకుండా కేవలం 24 సీట్లతో సరిపెట్టి పవన్‌కల్యాణ్ పరువు తీసిన చంద్రబాబు రెండు పార్టీలు కలిసి అడుగులు వేస్తున్నాయని చెబుతున్నారు. పవన్‌కల్యాణ్ చెవిలో పూలుపెట్టవచ్చు.. లేదా ఏదైనా వైఎస్సార్‌సీపీవారు ఆరోపిస్తున్నట్లుగా పవన్‌కల్యాణ్‌కు ప్యాకేజీ ఇచ్చి సంతృప్తి పరచవచ్చేమో కానీ, జనసైనికులను కూడా ఏమార్చగలరా? వారుఅంత తెలివితక్కువవారా!
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment