పచ్చమూక అరాచకం.. ఆనవాళ్లివిగో.. | TDP Leaders Attack On SC, ST, BC, Minorities At Palnadu | Sakshi
Sakshi News home page

పచ్చమూక అరాచకం.. ఆనవాళ్లివిగో..

Published Fri, May 24 2024 4:27 AM | Last Updated on Fri, May 24 2024 4:27 AM

కారంపూడిలో  టీడీపీ మూక దాడిలో కాలిపోతున్న బైక్‌లు (ఫైల్‌)

కారంపూడిలో టీడీపీ మూక దాడిలో కాలిపోతున్న బైక్‌లు (ఫైల్‌)

పల్నాట గ్రామాలు వదిలి బయట తలదాచుకుంటున్న బడుగులు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు.. ఆపై రిగ్గింగ్‌కు పాల్పడిన టీడీపీ నేతలు

ఓటింగ్‌ తరువాత కూడా బడుగు, బలహీన వర్గాలపై దాడులు కొనసాగింపు 

వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని కారంపూడి మండలం పేటసన్నెగండ్లలో బేడ బుడగ జంగాలపై దాడి.. రెంటచింతల మండల పరిధిలోని గోలిలో ఎస్టీలపై దాడి 

తొండేపి గ్రామాన్ని వదలి ప్రాణభయంతో బయట తలదాచుకుంటున్న మైనార్టీలు 

చిలకలూరిపేట మండలం కావూరులో ఎస్సీలకు తాగునీరు నిలిపివేత 

కొత్త గణేషునిపాడు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలను వెళ్లగొట్టిన టీడీపీ నేతలు 

చివరకు బాధితులపైనే కేసులు నమోదు  

పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యేలు కాసు, అనిల్‌ కుమార్‌పైనా దాడి 

పట్టించుకోని పోలీసు యంత్రాంగం

సాక్షి, నరసరావుపేట: పోలింగ్‌ రోజు, ఆ తర్వాత టీడీపీ నేతలు పల్నాడులో విధ్వంసం సృష్టించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నారన్న అక్కసుతో వారిపై దాడులకు తెగబడ్డారు. ఎలాగైనా వారిని ఓటింగ్‌కు దూరం చేసి ఏకపక్షంగా రిగ్గింగ్‌కు పాల్పడేందుకు అరాచకాలు సృష్టించారు. ఓటింగ్‌ తరువాత సైతం బడుగు, బలహీన వర్గాలపై ప్రతాపం చూపారు. బలహీన వర్గాలపై సాగిన వరుస దాడులను అడ్డుకోవాల్సిన పోలీసు యంత్రాంగం పట్టించుకున్న పాపానపోలేదని వైఎస్సార్‌సీపీ నేతలు వాపోతున్నారు.  పోలింగ్‌ రోజు, తరువాత పల్నాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడుల పరంపర కొనసాగింది.  

ఓటేసేందుకు వెళ్తున్న ఎస్సీ, ఎస్టీలపై దాడి  
రెంటచింతల మండలం తుమృకోటలో మే 13న ఓటు వేసేందుకు వెళ్తున్న ఎస్సీ, ఎస్టీ మహిళలపై టీడీపీలోని అగ్రకుల నాయకులు విచక్షణారహితంగా దాడి చేశారు. అప్పటికే క్యూలైన్లలో ఉన్న మహిళల్ని కొట్టడంతోపాటు వారిని బయటకు తరిమేసిన టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్లను బయటకు గెంటేశారు. వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తున్న మహిళల తలలు పగులగొట్టారు. దీంతో బాధిత మహిళలు ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీశారు. ఆ ఒక్క కులమే గ్రామంలో బతకాలా.. దళితులకు ఓటు వేసే హక్కులేదా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.  కాగా.. రెంటచింతల మండల పరిధిలోని గోలి గ్రామంలో వైఎస్సార్‌సీపీకి చెందిన మూఢావత్‌ మల్లయ్య నాయక్, కొండానాయక్, ఆర్‌.నాగేశ్వరరావు నాయక్, నాగేశ్వరరావు నాయక్‌లపై టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. 

పాలువాయిగేటు బూత్‌లలో అరాచకం 
పాలువాయిగేటు గ్రామంలో టీడీపీ గూండాలు ఈ నెల 13న ఉదయం 6.30 గంటల సమయంలో ప్రవేశించి గ్రామంలోని 201, 202 పోలింగ్‌ బూత్‌లలో వైఎస్సార్‌సీపీకి చెందిన వారిని ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నంబూరి శేషగిరిరావు బరితెగించి ఓటర్లపై దౌర్జన్యానికి దిగారు. 202 బూత్‌లోకి వెళ్లి ఓటర్లను భయాందోళనకు గురిచేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. 

ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌కు, నియోజకవర్గ రిటరి్నంగ్‌ అధికారికి, ఎస్పీ బిందుమాధవ్, జేసీ శ్యామ్‌ప్రసాద్‌ తదితర ఉన్నతాధికారులకు పిన్నెల్లి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఎవరూ స్పందించలేదు. ఈ సమయంలో టీడీపీ గూండాలు ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో వచ్చి వైఎస్సార్‌సీపీ వర్గీయులపై దాడులకు తెగబడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి, డ్రైవర్‌ అంజిరెడ్డి, శ్రీను, మరికొందరికి గాయాలయ్యాయి. అక్కడితో ఆగకుండా టీడీపీ వర్గీయులు పిన్నెల్లి కాన్వాయ్‌లోని వాహనాన్ని ధ్వసం చేశారు. ఈ దాడిలో ప్రధాన నిందితుడు నంబూరి శేషగిరిరావు. అతనిపై పోలీసులు ఏ1గా కేసు నమోదు చేశారు. అయితే.. ఆయనేదో ప్రజాస్వామ్యాన్ని రక్షించాడంటూ చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించడంపై పాలువాయిగేటు గ్రామ ప్రజలు ఛీదరించుకుంటున్నారు. 

పోలింగ్‌ ముగిశాక బుడగ జంగాలపైనా దాడి 
కారంపూడి మండలం పేటసన్నెగండ్ల శివారు బాలచంద్రనగర్‌ (పోతురాజుగుట్ట)లో నివాసం ఉంటున్న బేడ బుడగ జంగాలు తమకు ఓటు వేయలేదని ఆగ్రహించిన టీడీపీకి చెందిన సుమారు 70 మంది పోలింగ్‌ ముగిశాక వారి ఇళ్లపై దాడి చేశారు. కనిపించిన ప్రతి ఒక్కరినీ కర్రలు, రాళ్లతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. మహిళలు, పిల్లలని కూడా చూడకుండా చావబాదారు. ఇళ్లలోని సామాన్లు, చివరకు ఫ్యాన్లు, బల్బులను కూడా పగులగొట్టారు. 

వైఎస్సార్‌సీపీ నాయకుడు పెల్లూరి కోటయ్యకు చెందిన స్కార్పియో కారును ధ్వంసం చేశారు. గొర్ల సైదులు చేయి, కాలిపై కర్రలతో బాదారు. కత్తెర లక్ష్మి చేయి విరగ్గొట్టారు. రాళ్ల దాడితో పోతురాజుగుట్టలోని వారంతా ప్రాణభయంతో పారిపోయి వేరేచోట తలదాచుకున్నారు. ‘ఏరా.. టీడీపీకి ఓటు వేయకుండా వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేస్తారా. నా కొడకల్లారా..’ అంటూ తీవ్రంగా దూషిస్తూ అరాచపర్వాన్ని కొనసాగించారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక మీ అంతు చూస్తామని బెదిరించారన్నారు. 

ఊరొదిలి పారిపోయిన బడుగు జీవులు 
గురజాల నియోజకవర్గ పరిధిలోని మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకి చెందిన కుటుంబాలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓట్ల వేశారన్న అక్కసుతో యరపతినేని శ్రీనివాస్‌ వర్గీయులు పక్క గ్రామాల నుంచి పెద్దఎత్తున టీడీపీ రౌడీలు, గూండాలను  తీసుకొచ్చి పోలింగ్‌ రోజు రాత్రి దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల్ని లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లపై దాడులకు పాల్పడి ధ్వంసరచన సాగించారు. బైక్‌లు, జేసీబీలు, ఆటోలను, ఇళ్లలోని సామగ్రితోపాటు టీవీలు ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. 

మహిళలు, పిల్లలు అనే కనికరం కూడా లేకుండా బూతులు తిడుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నేతలు పొలాల్లోకి పారిపోయి అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపారు. మహిళలు, చిన్న పిల్లలు, మహిళలు గంగమ్మ గుడిలో తలదాచుకున్నారని తెలిసి రాళ్లు విసురుతూ భయకంపితుల్ని చేశారు. పోలీసులకు విషయం తెలిసినా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి కల్పించారు. 

ఇప్పటికీ ఆ గ్రామానికి చెందిన బాధితులు అజ్ఞాతంలో ఉండగా, వారిపైనే పోలీసులు కేసులు నమోదు చేయడం కొసమెరుపు. బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అనిల్‌కుమార్, కాసు మహేష్‌రెడ్డిపై కూడా టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయంటే వారి అరాచకం ఏ స్థాయిలో ఉందో ఆర్థం చేసుకోవచ్చు. చివరకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి నాయకుల్ని గ్రామాలు దాటించాల్సిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి.  

ముప్పాళ్లలో మైనార్టీలపై దాడులు  
సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ల మండలం తొండపిలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన ముస్లింల ఇళ్లలోకి టీడీపీ సానుభూతిపరులు మూకుమ్మడిగా చొరబడ్డారు. మహిళలను, చిన్నారులను భయబ్రాంతులకు గురిచేస్తూ దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలోని పురుషులంతా ప్రాణాలు కాపాడుకునేందుకు పొలాల్లోకి పరుగులు తీశారు. మహిళలు, చిన్నారులు తలుపులు వేసుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోయారు. ముస్లిం వర్గాలకు చెందిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గ్రామం వదిలి వెళ్లిపోయారు. 

కంభంపాడులో విధ్వంసకాండ 
పెదకూరపాడు నియోజకవర్గం కంభంపాడులో పోలింగ్‌ రోజున వైఎస్సార్‌సీపీకి పట్టున్న ఎస్సీ, బీసీ కాలనీలపై కత్తులు, కర్రలతో టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద వీరంగం వేశారు. మహిళలపైనా దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ నేత, సర్పంచ్‌ ఆర్తిమళ్ల నాగేశ్వరరావు (నాగయ్య), సతీమణి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలు అంజిమ్మ లక్ష్యంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు దాడులకు పాల్పడ్డారు. పలుమార్లు ఎస్సీ, బీసీ కాలనీలకు టీడీపీ రౌడీ మూక వెళ్లి అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. 

ఎస్సీలపై దాష్టీకం  
చిలకలూరిపేట మండలం కావూరు ఎస్సీ కాలనీలో పోలింగ్‌ సందర్భంగా మే 13వ తేదీ రాత్రి వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ నాయకుల దౌర్జన్యం చేశారు. వైఎస్సార్‌సీపీకి ఎస్సీలు ఓటు వేశారన్న అక్కసుతో వారిపై టీడీపీ నేతలు దాడి చేశారు. పోలింగ్‌ మరుసటి రోజు నుంచి కాలనీకి చెందిన ఎస్సీలు గ్రామంలోని ప్లాంట్‌నుంచి మంచినీరు తీసుకువెళ్లకుండా టీడీపీ నేతలు తమ దాష్టీకాన్ని చాటుకున్నారు.  

ఓటేయకుండా అడ్డుకున్నారు  
ఓటేద్దామని పోలింగ్‌ బూత్‌కు వెళితే టీడీపీ నేతలు బెదిరించి అడ్డుకున్నారు. కర్రలతో దాడులు చేస్తుండటంతో ప్రాణభయంతో ఇంటికి పారిపోయా. అధికారులకు చెప్పినా చూస్తూ నిలబడిపోయారు. ప్రాణాలు కాపాడుకోవడం మేలని ఓటేయకుండా తిరిగొచ్చేశా. 
–కర్రా ఏసుపాదం, ఎస్సీ మహిళ, తుమృకోట 

ఓటు వేయలేకపోయా 
ఓటు వేయాలని రెండుసార్లు పోలింగ్‌ బూత్‌కు వెళ్లాను. అక్కడ యుద్ధ వాతావరణం చూసి భయపడి ఇంటికి వచ్చేశా. టీడీపీకి చెందిన వారు దాడులు చేస్తూ బడుగులను భయపెట్టి ఇళ్లకు పంపించారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి నేను చూడలేదు. 
– నందిగం పున్నమ్మ, ఎస్సీ మహిళ, తుమృకోట 

నా భర్తను కొట్టారు  
ఓటు వేయడానికి వెళ్లిన నా భర్త దీపావత్‌ స్వామినాయక్‌ను టీడీపీ గూండాలు దారుణంగా కొట్టారు. నన్ను కూడా ఓటు వేయకుండా బెదిరించారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద దాడులు చేయడంతో మా కాలనీలో ఎవరూ ఓటు వేయలేదు. అధికారులు మాకు రక్షణ కలి్పంచలేకపోవడం వల్ల  ప్రాణ భయంతో ఓటు వేయడానికి వెళ్లలేదు.  
– దీపావత్‌ రమణ, ఎస్టీ మహిళ, తుమృకోట 

ప్రాణభయంతో పరుగులు పెట్టా  
ఓటు వేయవద్దని.. వేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని టీడీపీ నేతలు బెదిరించారు. గ్రామస్తులు లెక్కచేయకపోవడంతో రిగ్గింగ్‌ చేయాలనే తలంపుతో దళితులపై కర్రలు, రాళ్లతో దాడులు చేయడంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు పెట్టా.  
    – కత్తి భూలక్ష్మి, ఎస్సీ మహిళ,  పాలువాయిగేటు, రెంటచింతల మండలం 

వైఎస్సార్‌ సీపీకి ఓటు వేశామని దాడి   
టీడీపీ నేతలు పోలింగ్‌ రోజు మా ఇళ్ల మీద పడి కనపడిన వారిని కనపడినట్టు కొట్టారు. మా ఆస్తులను ధ్వంసం చేశారు. నా చేయి, కాలుపై కర్రలతో కొట్టారు. నాతో మరో నలుగురిని కొట్టారు. ముసలోళ్లమని కూడా చూడలేదు. బీభత్సం చేశారు.  
– గొర్ల సైదులు, జంగాల కాలనీ, పేటసన్నెగండ్ల , కారంపూడి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement