తాజాగా బయట పడిన వీడియో ఆధారంగా.. పోలింగ్ మరుసటి రోజు పల్నాడు జిల్లా కారంపూడి వీధుల్లో మారణాయుధాలతో దాడులు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న టీడీపీ గూండాలు
పోలింగ్ రోజు, ఆ తర్వాత టీడీపీ గూండాల స్వైర విహారం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓట్లేయనీయకుండా దాడులు
వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారనే కారణంతో విధ్వంసాలు
పల్నాడులో పచ్చ మూకల దాడులపై వీడియోలు తీసిన ప్రజలు
ఒక్కొక్కటిగా బయటపడుతున్న టీడీపీ హింసాత్మక చర్యలు
దుకాణాలపై రాళ్లు, బైక్‌ల ధ్వంసాలు, దహనాలు, లూటీలు..
పట్టపగలు విధ్వంసకాండను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్న జనం
టీడీపీ దారుణాలు కళ్లెదుటే కనిపిస్తున్నా పట్టించుకోని పోలీసులు
హత్యాయత్నం, అట్రాసిటీ కేసులున్నప్పటికీ చూసీచూడనట్లు వ్యవహారం
చిన్న చిన్న సాకులతో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై మాత్రం జులుం
వెంటాడి కేసుల నమోదు.. భయభ్రాంతులకు గురిచేస్తూ దండనలు
ఇంకోవైపు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఈసీ
బడుగు, బలహీన వర్గాల బాధితుల వేదన అరణ్య రోదనగా మారిన వైనం
రాష్ట్రంలో టీడీపీ గూండాలు సాగిస్తున్న విధ్వంసకాండ గురించి పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్న వీడియోలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మనం ఉంటున్నది ప్రజాస్వామ్య దేశంలోనేనా లేక ఆటవిక రాజ్యంలో ఉంటున్నామా.. అనే అనుమానం కలుగుతోంది. గుంపులు గుంపులుగా తోడేళ్ల మందలా వచ్చి దుకాణాలు, ఇళ్లపై పడుతున్నారు. కుర్చీలు, బల్లలు, మోటార్ సైకిళ్లను లాక్కొచ్చి రోడ్లపై పడేస్తున్నారు. లావుపాటి కర్రలు, ఇనుప రాడ్లతో వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఆయిల్ ట్యాంక్ పగులగొట్టి నిప్పంటిస్తున్నారు. నిర్భయంగా వచ్చిన దారినే కేకలు వేసుకుంటూ వెళ్లిపోతున్నారు.
ఆ దృశ్యాలు చూస్తుంటే సినిమాల్లో సీన్లు కళ్ల ముందు మెదులుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించక పోవడం విస్తుగొలుపుతోంది. పైగా ఎక్కడ, ఏ చిన్న గొడవ జరిగినా.. దాన్ని వైఎస్సార్‌సీపీకి అంటగడుతూ ఎల్లో మీడియా, ఎల్లో బ్యాచ్ దుష్ప్రచారం సాగిస్తోంది. బాధితుల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, అటు ఈసీ, ఇటు పోలీసులు.. టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం దారుణం.
సాక్షి, నరసరావుపేట: రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా టీడీపీ గూండాలు, రౌడీలు పేట్రేగిపోయారు. యథేచ్ఛగా రిగ్గింగ్ చేస్తూ అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులను దారుణంగా చితకబాదారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు వైఎస్సార్‌సీపీకి ఓటేయనీయకుండా వారిపై అత్యంత పాశవికంగా దాడులకు తెగబడ్డారు. కొన్నిచోట్ల ఈ వర్గాలు తమకు ఓట్లేయలేదని వారి ఇళ్లను ధ్వంసం చేశారు. దుకాణాలను లూఠీ చేశారు. ఇదేంటని అడ్డుకోవడానికి ప్రయత్నించినవారిని చావ బాదారు. స్వగ్రామాలను వదిలేసి బిక్కుబిక్కుమంటూ వేరే ఊళ్లలో తల దాచుకునేలా టీడీపీ మూకలు స్వైర విహారం సాగించాయి. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు టీడీపీ గూండాలకే కొమ్ముకాశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తమను కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేసినా ఏ ఒక్క పోలీసూ పట్టించుకోలేదు. రాష్ట్రంలో పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా చంద్రగిరి, తదితర ప్రాంతాల్లో టీడీపీ గూండాల దాడిని పోలీసులు చేష్టలుడిగి వేడుకలా చూశారు. మే 13న పోలింగ్ ముగిసిననాటి నుంచి వెలుగు చూస్తున్న వీడియోలు టీడీపీ మూకలు అరాచకాలు, విధ్వంస కాండను కళ్లకు కట్టినట్టు చూపుతున్నా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటే ఒట్టు.
మాచర్ల ప్రాంతంలో పచ్చ మూక విధ్వంసం గురించి పదుల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతున్నా, వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అటు ఈసీ, ఇటు పోలీసులు టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. అదే మాచర్లలో ఒక్క వీడియోను సాకుగా చూపిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులను మాత్రం వెంటాడి వేధిస్తున్నారు. హత్యాయత్నం కేసులు, అట్రాసిటీ కేసులు నమోదు చేస్తూ ‘పచ్చ’పాతం చూపుతున్నారు.
పోలీసుల మద్దతుతోనే టీడీపీ మూక దాడులు
ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారన్న అక్కసుతో టీడీపీ మూక పల్నాడు జిల్లాలో చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పౌర సమాజం భయభ్రాంతులకు గురయ్యేలా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై అత్యంత పాశవికంగా టీడీపీ గూండాలు జరిపిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పోలీసుల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతమని ముందే తెలిసినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
టీడీపీ చేసిన దాడికి కొంత మంది పోలీసుల మద్దతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ మరుసటి రోజు మే 14న కారంపూడిలో బుడగ జంగాలు, దళితులు, ముస్లింలపై టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. ఆ రోజు వందలాది మంది టీడీపీ రౌడీల దారుణ కాండను కొంత మంది ప్రజలు ఇళ్ల మీద నుంచి సెల్‌ఫోన్లలో వీడియోలు తీశారు. అందులో బడుగు, బలహీనవర్గాలకు చెందిన దుకాణాలు, ఇళ్లు, వాహనాలను టీడీపీ మూక ధ్వంసం చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి.
వాటిలో వీడియో తీస్తున్న కుటుంబ సభ్యులు.. ఇంతవరకు ఇక్కడే ఉన్న పోలీసులు లేకుండా ఎటుపోయారని ఒకటికి రెండుసార్లు అనుకోవడం ఆ వీడియోలో రికార్డు అయ్యింది. ఆ సమయంలో టీడీపీ గూండాలు మారణాయుధాలతో చేస్తున్న స్వైరవిహారం చూసి భయపడిన కూతురు ఇంట్లోకి వెళ్లి తాళాలు వేసుకుందామని అనగా.. ఇంకో వీడియో తీస్తున్న వ్యక్తి.. ‘దాడి చేస్తున్నవారు మన టీడీపీ వాళ్లు.. మనల్ని ఏం చేయరు’ అని భరోసానివ్వడం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టీడీపీ మూకలపై చర్యలేవి?
టీడీపీ రౌడీలు, గూండాలు మారణాయుధాలతో విధ్వంస కాండకు దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము ఇంతగా వీడియోల ద్వారా ఆధారాలు అందిస్తున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ మూక దాడుల బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు, సమాచారం ఇచ్చేందుకు జిల్లా పోలీసులెవరూ ముందుకు రావడం లేదు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వివరాలు వెల్లడించలేమంటున్నారు.
కారంపూడి ఘటనలో వందలాది మంది టీడీపీ గూండాలు విధ్వంస కాండకు దిగారు. ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు, ఎందరిపై కేసు నమోదు చేశారనేది తెలియనీయడం లేదు. ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఓ ఉన్నతాధికారి కేసుల నమోదు, ఇతరత్రా వివరాలేవీ తనకు తెలియకుండా బయటకు వెళ్లనివ్వొద్దని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఏ సమాచారం బయటకు రానివ్వడం లేదు.
వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కేసుల నమోదుకు ఉత్సాహం..
వందలాది వీడియోల రూపంలో ఆధారాలు ఉన్నా టీడీపీ మూకలపై చర్యలు తీసుకోని పోలీసులు.. మరోవైపు మాచర్ల, నరసరావుపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లాంటి వారిపైన మాత్రం కేసుల నమోదుకు ఎక్కడలేని ఉత్సాహం చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లు, ఆస్పత్రిని విధ్వంసం చేయడంతోపాటు వైఎస్సార్‌సీపీ ఎస్సీ నేతలపై హత్యాయత్నం కేసుల్లో నిందితుడైన టీడీపీ నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు, ఆయన అనుచరులను అరెస్ట్ చేయడంలో పోలీసులు నిలువెత్తు నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పల్నాడులో 144 సెక్షన్ అమలవుతున్న నేపథ్యంలో శాంతియుతంగా ఉండాల్సిన చదలవాడ అరవింద్‌బాబు ఇంట్లోనే నిరసన దీక్షలు పేరిట మీడియాకు వీడియోలు, ఫొటోలు పంపి రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు మర్రి రాజశేఖర్, రావెల కిషోర్ బాబు తదితరులు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకి శనివారం వినతిపత్రం అందజేశారు. ఎన్నికల కౌంటింగ్ దగ్గరపడుతున్నందున మళ్లీ టీడీపీ మూకలు హింసకు పాల్పడకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ‘పచ్చ’పాతాన్ని మానుకోవాలని విన్నవిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment