ఆంధ్రప్రదేశ్ లో ఎంతలో ఎంత మార్పు చూడండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టకముందే ఆ పార్టీకి చెందిన కొన్ని అరాచక శక్తులు విజృంభిస్తున్న వైనం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని చోట్ల ఇళ్లలోకి చొరబడి మరీ కత్తులతో నరకడం, వైఎస్సార్‌సీపీ జెండానే కనిపించకూడదని బెదిరించడం ఇవన్నీ ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తాయి. ప్రజాస్వామ్యంతో సంబంధం లేదని, తాము అనుకున్నది చేస్తామని అనుకుంటే అది మరింత ఉద్రిక్తతలకు దారి తీస్తుంది.
పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇంత సడన్ గా నిర్వీర్యం అయిందో అర్థం కావడం లేదు. కొన్ని చోట్ల వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపైకి దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. అసలు ఈ ఎన్నిక ఫలితాలు ఇలా ఉన్నాయేమిటి? ఏమైనా గోల్ మాల్ జరిగిందా అనే అనుమానాలు ఒక వైపు వ్యక్తం అవుతుంటే, మరో వైపు టీడీపీ, జనసేనలకు చెందినవారు చేస్తున్న అరాచకాలతో అట్టుడికే పరిస్థితి ఏర్పడుతుంది. చంద్రబాబు నాయుడు కానీ, ఆయన కుమారుడు లోకేష్ కానీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కానీ ఒక్కసారి కూడా ఇలాంటివాటిని ఖండించినట్లు కనబడలేదు. దాంతో వారు కూడా ఇలాంటి గొడవలను ప్రోత్సహిస్తున్నారని జనం అనుకునే అవకాశం ఉంటుంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఒక చిన్న ఘటన ఏమైనా జరిగినా, వ్యక్తిగత కారణాలతో ఘర్షణలు జరిగినా, వైఎస్సార్‌సీపీకి పులిమి నానా హడావుడి చేసిన టీడీపీ మద్దతు మీడియా ఇప్పుడు ఎక్కడా నోరుమెదపుతున్నట్లు లేదు. ప్రస్తుతం జరుగుతున్న హింసాకాండ వారి దృష్టిలో ప్రజాస్వామ్యబద్దంగా, రాజ్యాంగబద్దంగా జరుగుతున్నదని అనుకుంటున్నారేమో తెలియదు. టీడీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి రకరకాల రూపాలలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి యత్నాలు సాగాయి. కాస్త గట్టిగా ఉండే అధికారులను మార్చేయడం, టీడీపీ వైపు నుంచి జరిగే ఘర్షణలను పట్టించుకోకపోవడం, వైఎస్సార్‌సీపీ నుంచి ఏమి జరిగినా వెంటనే స్పందించడం, తీవ్రమైన చర్యలు తీసుకోవడం కనిపించింది.
కొన్ని ఏరియాలలో టీడీపీ రిగ్గింగ్ అవకాశం ఉన్నచోట్ల పోలీసులను చాలా తక్కువ సంఖ్యలో పెట్టారట. తద్వారా యథేచ్చగా రిగ్గింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారన్నమాట. అదే వైఎస్సార్‌సీపీ వారు రిగ్గింగు చేసే చాన్స్ ఉందని అనుకున్నచోట మొత్తం బలగాలన్నిటినీ కేంద్రీకరించారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. పోలింగ్ మరుసటి రోజు మాచర్ల, తాడిపత్రి, తిరుపతి మొదలైన చోట్ల టీడీపీ వారు దాడులు చేసి గందరగోళాలు సృష్టించారు. విచిత్రం ఏమిటంటే పోలీసులే తాడిపత్రి అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలోకి వెళ్లి సిసిటీవీని, కెమెరాలను పగులకొట్టి విద్వంసానికి పాల్పడడం, అయినా వారిపై ఏమి చర్య తీసుకున్నది తెలియదు.
వీటిలో అత్యధికం తెలుగుదేశం గూండాలు చేసినవేనని వైఎస్సార్‌సీపీ చెబుతోంది. అది నిజమే అని దృవీకరించే విధంగా కౌంటింగ్ తర్వాత రచ్చ సాగుతోంది. వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ విజయవాడలో ఒక హోటల్ లో టిఫిన్ చేస్తుంటే వచ్చి దాడి చేశారు. లోకేష్ ను విమర్శించే స్థాయి నీదా అని బూతులు తిడుతూ రెచ్చిపోయారు. పలువురు వైఎస్సార్‌సీపీ నేతలకు, వారిని సమర్ధించినవారికి ఫోన్ లు చేసి టీడీపీ మద్దతుదారులు బూతులు తిడుతున్నారు. అసభ్యకర మెస్సేజ్ లు పెడుతున్నారు. టీడీపీ వేధింపులకు తాళలేక ఏలూరు సమీపంలోని విజయరాయి వద్ద ప్రవీణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడుకు చెందిన కళ్యాణ మండపంపై దాడి చేశారు. మాజీ మంత్రి విడదల రజనీ ఆఫీస్ లో విధ్వంసం సృష్టించారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కొండూరు తదితర చోట్ల వైఎస్సార్‌సీపీ వారి ఇళ్లపై కర్రలు, కత్తులతో దాడి చేశారు. వైఎస్సార్‌సీపీవారు ఊళ్లలో ఉండడానికి వీలు లేదని హెచ్చరికలు జారీ చేసి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాజీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పల్నాడులో ఒక యూట్యూబ్ చానల్ నడిపే వైఎస్సార్‌సీపీ అభిమాని ఇంటిపైకి వెళ్లి కత్తితో దాడిచేస్తే, అతని వృద్ద తల్లిదండ్రులు తల్లడిల్లుతూ ఏడుస్తున్న వీడియో వైరల్ అయింది.
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆఫీస్ పై దాడులు చేశారు. ఈ గొడవలలో టీడీపీతో పాటు, బీజేపీ, జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద రాళ్లతో వీరంగం సృష్టించారు. రాయచోటి మండలం యండపల్లి అనేచోట మాజీ ఎంపీ పోల సుబ్బారెడ్డి ఇంటిపై పడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. గుంటూరులో ఒక హాస్టల్ పేరు చివరలో రెడ్డి అని ఉన్నందుకు హాస్టల్ యజమానితో కాళ్లు పట్టించుకున్నారట. కళ్యాణ దుర్గంలో వైఎస్సార్‌సీపీ నేత ఉమామహేశ్వరనాయుడు ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసి కారు, ప్రచార రథం ధ్వంసం చేశారు.
ఇలా వివిధ జిల్లాలలో సాగుతున్న ఈ అరాచకాలను పోలీసులు ఎప్పటికి అరికడతారో తెలియదు కానీ, దీనివల్ల సమాజంలో మరింత అన్ రెస్ట్ పెరిగిపోతుంది. ఈ దాడులకు ప్రతిగా వైఎస్సార్‌సీపీవారు కూడా ఏదో రకంగా తిప్పికొట్టడానికి యత్నించే అవకాశం ఉంటుంది. దానిని నివారించడం చాలా అవసరం. అధికారం వచ్చిన తర్వాత చాలా బాధ్యతగా ఉంటామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు అనేప్పటికీ, పోలీసులకు ఈ ఘర్షణలపై గట్టి చర్యలు తీసుకోవాలని ఎందుకు సూచించలేదో తెలియదు. లోకేష్ తాము అధికారంలోకి వచ్చాక బదులు తీర్చుకుంటామని అనేమాటలను జనం గుర్తు చేసుకుంటున్నారు. దానికి తగినట్లే ప్రస్తుతం దాడులు సాగుతున్నాయి.
గతంలో ఏవో జరిగాయని ప్రతీకారంతో రగిలిపోతున్నారని, అందుకే ఇలా చేస్తున్నారని టీడీపీకి మద్దతు ఇచ్చేవారు, వారి మీడియా ప్రచారం చేయవచ్చు. అందులో ఎంత నిజం ఉందన్నది వేరే విషయం. అధికారంలోకి వచ్చినవారు అన్నిటిని సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగాలి. అంతేకానీ కక్షపూరితంగా మరింత రెచ్చగూడదని చెప్పక తప్పదు. కానీ అప్పట్లో అరాచక పాలన అని ప్రచారం చేసినవారు ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి జరుగుతున్న అరాచకాలను ఎలా సమర్ధిస్తారు? ఈ దౌర్జన్యాలు, దాడుల ద్వారా టీడీపీ కూటమి ఇకపై ఇంకెంత అరాచకానికి పాల్పడుతుందో అని జనం భయపడుతున్నారు.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment