జనసేనకు చంద్రబాబు వెన్నుపోటు పొడవడం స్టార్ట్‌ చేశారా? | Janasena Chief Pawan Kalyan Made A Sensational Statement | Sakshi
Sakshi News home page

జనసేనకు చంద్రబాబు వెన్నుపోటు పొడవడం స్టార్ట్‌ చేశారా?

Published Sat, Jan 27 2024 2:23 PM | Last Updated on Sun, Feb 4 2024 5:25 PM

Janasena Chief Pawan Kalyan Made A Sensational Statement - Sakshi

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన సంచలన ప్రకటన ఆయనలో రియలైజేషన్‌ను తెలియచేస్తుందా? లేక కొత్త డ్రామాకు తెరదీశారా? అన్నది తెలియడానికి మరికొంత సమయం పడుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మం పాటించకుండా రెండు సీట్లలో తమ అభ్యర్దులను ప్రకటించారని, అందువల్ల తాను కూడా రెండు సీట్లను ప్రకటిస్తామని చెప్పి ఆ నియోజకవర్గాల పేర్లను వెల్లడించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ఉపన్యాసం ఇస్తూ టీడీపీ, జనసేన సంబంధాలపై వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు వింటుంటే ఒకరకంగా జనసేనకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వెన్నుపోటు పొడవడం ఆరంభం అయిందా అనిపిస్తుంది.

దానిని నేరుగా చెప్పలేని పవన్ కల్యాణ్‌ మరికొన్ని విషయాలు చెబుతూ, యధాప్రకారం డిఫెన్సివ్‌గా మాట్లాడిన తీరు అనుమానాలకు తావిస్తుంది. టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకోవడం రెండు పార్టీల ఇష్టం. తప్పు లేదు. కాని అది ఇరు పక్షాలకు గౌరవ ప్రదంగా ఉండాలని ఆ పార్టీలవారు కోరుకుంటారు. కాని ఇప్పుడు కూడా పవన్ కల్యాణ్‌ చెప్పిన అంశాలలో కొన్ని సందేహాలు వస్తాయి.

ఒకవేళ ఇది ఏమైనా చంద్రబాబు, పవన్‌లు ముందస్తుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం చేస్తున్నారా? అన్న భావన కలుగుతుంది. ఎందుకంటే పవన్ వెల్లడించిన రెండు అసెంబ్లీ సీట్లు రాజోలు, రాజానగరం లు ఎటూ జనసేనకే ఇచ్చే అవకాశం ఉంది. రాజోలు అయితే గత ఎన్నికలలో జనసేన గెలిచిన ఏకైక సీటు. ఆ సీటు ఇవ్వడానికి టీడీపీ సిద్దం కాకతప్పదు.

అలాగే రాజానగరంలో కాపు సామాజికవర్గం అధికంగా ఉండడం, గత ఎన్నికలలో కూడా జనసేనకు గణనీయమైన ఓట్లు రావడం వల్ల ఆ సీటు విషయంలో కూడా టీడీపీ అభ్యంతరం చెప్పకపోవచ్చు. బహుశా చంద్రబాబుతో జరిపిన చర్చలలో వచ్చిన జాబితాలో ఈ రెండు సీట్లు ఉండవచ్చు. ఇవి కాకుండా జనసేన సీనియర్ నేత కందుల దుర్గేష్ కోరుకుంటున్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జనసేన పోటీస్తుందని చెప్పి ఉంటే, అప్పుడు పవన్ కల్యాణ్‌ ప్రకటనలో నిజాయితీ ఉందని అనుకోవడానికి అవకాశం ఉండేది. కాని అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఉన్నారు. కచ్చితంగా టీడీపీ ఆ సీటును కోరుకుంటుంది. అదే సమయంలో జనసేన కూడా పట్టుబట్టాలని ఆ పార్టీవారు అభిప్రాయపడుతున్నారు.

గాజువాక, భీమవరంలలో పవన్ కల్యాణ్‌ గత ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయినా, ఆ సీట్లు ప్రకటించకుండా వేరే సీట్లను పవన్ ప్రస్తావించారు. కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పవన్ సవాల్ విసిరారు. అక్కడ నుంచైనా పోటీచేస్తామని ఆయన చెప్పి ఉంటే కొంత నమ్మకం ఉండేది. జనసేన క్యాడర్ తమ ఆత్మగౌరవాన్ని పవన్ తాకట్టు పెడుతున్నారని తీవ్రమైన విమర్శలు చేస్తున్న నేపద్యంలో వారిని బుజ్జగించడానికి పవన్ రాజోలు, రాజానగరంలలో పోటీచేస్తామని ప్రకటించినట్లు అనిపిస్తుంది. చంద్రబాబు కుమారుడు లోకేష్ సీఎం అభ్యర్ధిపై గతంలో చేసిన ప్రకటన గురించి ఇప్పుడు ప్రస్తావించారంటే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

లోకేష్ ప్రకటనతో పవన్ కల్యాణ్‌ గ్రాఫ్ బాగా పడిపోయింది. పవన్ సీఎం అభ్యర్ధిగా పనికిరాడన్నట్లుగా లోకేష్ మాట్లాడడాన్ని జనసేన క్యాడర్ జీర్ణించుకోలేకపోయారు. పైగా పవన్ దానిని ఖండించకపోగా విశాఖలో జరిగిన యువగళం సభకు ఆయన వెళ్లడం మరింత చిన్నతనం అయింది. జనసేన పరువును పవన్ కల్యాణే తీసేస్తున్నారన్న భావన ఏర్పడింది. అంతేకాక పవన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయం కూడా టీడీపీ పాలిట్ బ్యూరోలో చర్చ జరగాలని లోకేష్ అనడం మరింత అప్రతిష్టగా మారింది. దీంతో ఇంతవరకు కాపు సామాజిక వర్గంలో కాస్తో, కూస్తో.. ఉన్న నమ్మకం పటాపంచలు అయింది. జనసేనలో చేరాలని సీనియర్ ముద్రగడ పద్మనాభంను ఆ పార్టీ నేతలు కలిసినప్పుడు కూడా ఈ అంశాలు చర్చకు వచ్చాయట. దానిపై వారెవరూ సమాధానం చెప్పలేకపోయారట.

యాభై నుంచి డబ్బై సీట్లు అడగాలని తనకు కూడా తెలుసునని అంటూనే, గత ఎన్నికలలో తానే గెలవలేకపోయానని అనడం ద్వారా బేలతనాన్ని ప్రదర్శించినట్లయింది. టీడీపీ వారు జనసేనకు పదిహేను నుంచి ఇరవై సీట్లు ఇస్తే సరిపోతుందని అనుకుంటుంటే, జనసేన అభిమానులు జోగయ్య వంటివారు కనీసం అరవై సీట్లు అయినా తీసుకోవాలని అంటున్నారు. దీంతో పార్టీలో ఏర్పడిన గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలను మభ్యపెట్టడానికి పవన్ కల్యాణ్‌ ఇలా రెండు రకాలుగా మాట్లాడారా అనిపిస్తుంది. పైగా ముప్పై ఏళ్లుగా రాజకీయాలలో ఉన్న కుటుంబం నుంచి పుట్టిన లోకేష్ తన గురించి అడ్డగోలుగా మాట్లాడినా పర్వాలేదన్నట్లు పవన్ సరిపెట్టుకోవడం కూడా ఆశ్చర్యమే అనిపిస్తుంది.

స్థూలంగా చూస్తే పొత్తు వ్యవహారం ఒక కొలిక్కి తేవల్సిన ఈ తరుణంలో దీనిని డ్రామాటిక్‌గా మార్చి పార్టీ కాడర్‌లో తానేదో ఎక్కువ సీట్లకు ప్రయత్నిస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడానికి పవన్ చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తుంది. అలాకాకుండా నిజంగానే పవన్ కల్యాణ్‌ కనీసం నలభై నుంచి గరిష్టంగా అరవై సీట్లు పొందగలిగి, ముఖ్యమంత్రి పదవిలో వాటా ఇవ్వడానికి టీడీపీ అంగీకరించినట్లు ప్రకటన ఇప్పించగలిగితే, మిగిలిన వివాదాలు ఎలా ఉన్నా, పవన్‌పై జనసేనలో కొంతపాటి విశ్వాసం అయినా ఏర్పడుతుంది. అలా కాని పక్షంలో ఈయన కేవలం కొంత డ్రామాకు తెరదీశారన్న సంగతిని జనసైనికులు అర్దం చేసుకోవడం కష్టం కాదు.

ఇతర పార్టీలతో పొత్తుల విషయంలో చంద్రబాబు ట్రాక్ రికార్డు బాగోదన్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు 2009లో టీఆర్ఎస్‌తో టీడీపీ జత కట్టినప్పుడు టీఆర్ఎస్‌కు కేటాయించిన కొన్ని సీట్లలో టీడీపీ అభ్యర్దులు పోటీచేయడం, వారికి సైకిల్ గుర్తును చంద్రబాబు కేటాయించడం, ఆ తర్వాత వారిని విత్ డ్రా కండని చెప్పినట్లు నటించడం, అయినప్పటికీ వారు వెనక్కి తగ్గకపోవడం వంటి ఘట్టాలు ఉన్నాయి. ఉదాహరణకు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పెద్దపల్లిలో టీడీపీ నేత విజయరమణరావుకు టీడీపీ బీఫారం ఇచ్చారు. అది టీఆర్ఎస్ కు కేటాయించిన సీటు. మక్తల్‌లో కూడా కొత్తకోట దయాకర్‌రెడ్డి టీడీపీ గుర్తుపైనే టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోటీచేశారు.

దీంతో టీఆర్ఎస్ కూడా కొన్నిచోట్ల పోటీచేసింది. 2014లో బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ, కొన్ని సీట్లకు టీడీపీ లేదా కాంగ్రెస్ నుంచి తన వాళ్లను బీజేపీలో చేర్పించి వారికి టిక్కెట్ వచ్చేలా చంద్రబాబు చేశారు. ఆ రకమైన మ్యాచ్ ఫిక్సింగ్‌లు కూడా జరపడంలో చంద్రబాబు దిట్ట. ఈ నేపధ్యంలో జనసేన, టీడీపీ మధ్య పొత్తు ఏ రకమైన పరిణామాలతో సాగేది ఇప్పుడే చెప్పడం కష్టం. చంద్రబాబు వ్యూహాలనండి.. కుట్రలనండి..! వాటి ముందు పవన్ తను క్యాడర్ ఆశించిన విధంగా సీట్లు సాధించడం అంత తేలికైన విషయం కాదు. అందుకే జనసేన క్యాడర్‌ను టీడీపీకి సరెండర్ చేయడానికి పవన్‌తో చంద్రబాబు ఏమైనా ఈ డ్రామాకు తెరదీశారా అన్న సందేహం సహజంగానే వస్తుంది.

-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement