తెలుగుదేశం పార్టీలో ఏదో అంతర్మథనం ఆరంభమైనట్లుగా ఉంది. శాసనసభ ఎన్నికలలో వచ్చే ఫలితాలపై టీడీపీలో టెన్షన్ ఏర్పడిన నేపథ్యంలో కౌంటింగ్ తర్వాత పార్టీలో ఏమి జరిగే అవకాశం ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న ఒక ప్రకటనలో నారా లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలలో గెలుస్తామని చెబుతూనే ఆయన ఈ వ్యాఖ్య చేయడంతో పార్టీ క్యాడర్‌లో కన్ప్యూజన్ ఏర్పడింది. టీడీపీ గెలిచే అవకాశం ఉంటే లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేయవలసిన వెంకన్న ఇలా అనడంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. వెంకన్న ప్రకటనకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నా, ఇది అంత చిన్న విషయం కాదన్న భావన ఉంది.
చంద్రబాబు జాతీయ అద్యక్షుడు అని చెప్పుకుంటున్నా, అది నామమాత్రమే అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా కింజారపు అచ్చన్నాయుడు ఉన్నారు. ఆయన పట్ల లోకేష్‌కు అంత సదభిప్రాయం లేదు. అచ్చెన్నను తప్పించాలని గతంలో కూడా ఆలోచన చేశారు. దానిని దృష్టిలో ఉంచుకుని ఏమైనా మాట్లాడారా? అనే సంశయం వస్తుంది. చంద్రబాబు వయసు రీత్యా ఇక పార్టీ అధ్యక్ష బాధ్యతలను కుమారుడికి అప్పగించాలని ఏమైనా అనుకుంటున్నారా? ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే చంద్రబాబుపై పార్టీలో నమ్మకం బాగా తగ్గుతుంది. అలాగని లోకేష్ నాయకత్వ పటిమపై కూడా క్యాడర్‌లో ఇంకా విశ్వాసం ఏర్పడలేదు.
ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిను ఎదుర్కోగల సత్తా లోకేష్ కు ఉందా అనే సంశయం ఉంది. లోకేష్ స్వయం ప్రకాశిత నేత కాదు. తండ్రిచాటు బిడ్డగానే రాజకీయంలోకి వచ్చారు. అలాగే ఇప్పటికీ కొనసాగుతున్నారు., అప్పడప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తున్నా, వాటికి గ్యారంటీ లేదని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కొన్నిచోట్ల చంద్రబాబు నాయుడు కొందరికి టిక్కెట్ హామీ ఇస్తే, లోకేష్ మరికొందరికి టిక్కెట్ హామీ ఇచ్చారట. వారి నుంచి డిపాజిట్ కూడా తీసుకున్నారని చెబుతారు. కానీ టిక్కెట్ పొందలేకపోయిన వారికి కొందరికి లోకేష్ డబ్బు తిరిగి ఇవ్వలేదని ప్రచారం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధికారంలోకి రాలేకపోతే ఇవి గొడవలుగా మారే అవకాశం ఉంటుంది.
లోకేష్ ప్రసంగాలలోకానీ, పార్టీ నిర్వహణలో కానీ అంత సమర్థత చూపలేకపోతున్నారని చెబుతారు. అందుకే చంద్రబాబు ఇప్పటికీ పార్టీ పగ్గాలు వదలి పెట్టలేకపోతున్నారన్నది వారి అభిప్రాయం. మరో సంగతి ఏమిటంటే పోలవరం కాంట్రాక్టర్‌గా గతంలో వ్యవహరించిన రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు ఒక ఆరోపణ చేస్తూ చంద్రబాబు, లోకేష్ లు తమ వద్ద పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారని అనేవారు. దీనిపై ఇంతవరకు వీరు నోరు విప్పలేదు. డబ్బు లావాదేవీల సంగతి పక్కనబెడితే లోకేష్ గట్టివాడైతే 2014 ఎన్నికలలో పోటీచేసి ఉండేవారు. అప్పట్లో అధికారం రావడంతో పెత్తనం చేయడం ఆరంభించారు. తదుపరి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిల ద్వారా తండ్రి చంద్రబాబుపై ఒత్తిడి చేసి ఎమ్మెల్సీ పొంది, ఆ వెంటనే మంత్రి కూడా అయిపోయారు. అయినా తన శాఖలను నిర్వహణలో అంత పేరు తెచ్చుకోలేకపోయారు.
కానీ అన్నీ శాఖలపై ఆధిపత్యాన్ని చెలాయించడం వివాదాస్పదం అయింది. చంద్రబాబు కూడా ఆయా సందర్భాలలో లోకేష్ ను కలిసి వచ్చారా అని అడిగేవారట. అంటే దాని అర్ధం ఏమిటో తెలుసు కదా! అంత అధికారం ఎంజాయ్ చేసినా, 2019 శాసనసభ ఎన్నికలలో ఆయన ఓటమి చెందడం బాగా అప్రతిష్ట అయింది. అయినా ఎమ్మెల్సీగా ఉండడంతో కౌన్సిల్ లో కొన్నిసార్లు అనుచితంగా ప్రవర్తించడం ద్వారా ప్రజల దృష్టి ఆకర్షించాలని ప్రయత్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియావారు ఆయనకు భారీ ఎలివేషన్ ఇచ్చి ప్రచారం చేశారు. అయినా ఆశించిన రీతిలో పార్టీలో నమ్మకం కలిగించలేకపోయారు.
ఉపన్యాసాలలో తడబడడం, భాష సరిగా రాకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇవేమీ పెద్ద సమస్యలు కావు. కానీ ఒక విధానం లేకపోవడం, తండ్రి మాదిరి అబద్ధాలు చెప్పడం, అధికారులను బెదిరించడం, రెడ్ బుక్ అంటూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం, కార్యకర్తలు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పోస్టు ఇస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వంటివి చేయడంతో ఈయనలో నాయకత్వ లక్షణాలు కొరవడ్డాయన్న భావన ఏర్పడింది. తన తండ్రి చంద్రబాబు బాటలోనే నడిచి అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం, తానేదో చాలా గొప్పనాడిని అయిపోయినట్లు మాట్లాడడం చేస్తుడడంతో విశ్వసనీయత తెచ్చుకోలేకపోయారు. యువగళం పేరుతో పాదయాత్ర చేసినా, అందులో ఒక చిత్తశుద్ది కనిపించలేదు. పేద ప్రజలతో పూర్తిగా కలవలేకపోయారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో పోల్చి చూస్తే ఈయన దరిదాపులో కనిపించలేకపోయారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్వయం ప్రకాశిత నేతగా ఎదిగితే, లోకేష్ ఏమో ఇంకా చంద్రబాబు కుట్ర రాజకీయాలపైనే ఆధారపడవలసి వస్తోంది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అండతోనే రాజకీయాలలోకి వచ్చినా, ఆ తర్వాతకాలంలో ఒంటరిగా ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కున్నారు. పోరాటాలు చేశారు. సోనియాగాంధీ, చంద్రబాబుల కుట్రలను ఎదుర్కున్నారు. 2014 ఎన్నికలలో పార్టీ అధికారంలోకి రాకపోయినా, 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. జనంలోకి వెళ్లి పాదయాత్ర చేసి, పేద ప్రజలకు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తానో చెప్పడానికి ప్రాధాన్యత ఇచ్చారు.
చంద్రబాబు, లోకేష్ లు మాత్రం ఎంతసేపు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిను దూషించడం, అసభ్య భాష వాడడం చేశారు. ఆ తేడాను జనం గమనించి 2019 ఎన్నికలలో టీడీపీని ఘోరంగా ఓడించారు. లోకేష్ మంగళగిరిలోనే ఓటమిచెందారు. ఆ తర్వాత ఆయన అక్కడ కేంద్రీకరించి భారీ వ్యయం చేస్తూ, ఈసారి ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు రాయలసీమకు చెందినవారు. ఆయన చంద్రగిరి వదలి కుప్పం నుంచి గత మూడున్నర దశాబ్దాలుగా పోటీచేస్తున్నారు. లోకేష్ ధైర్యవంతుడు అయి ఉంటే తన తండ్రి పుట్టిన ప్రాంతమైన చంద్రగిరి నుంచి పోటీచేసి ఉంటే ఆయనపై టీడీపీలో విశ్వాసం పెరిగేది. కానీ ఆ పని చేయలేకపోయారు.
ఈ పరిస్థితిలో లోకేష్ పార్టీ అధ్యక్షుడు కావాలని వెంకన్న వంటివారు కోరుకున్నారంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఇంకా అర్హత సంపాదించలేకపోయారని అనుకోవాలా? యూపీలో సమాజవాది పార్టీ నేత మూలాయం సింగ్ జీవించి ఉన్న రోజులలో ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ సైకిల్ యాత్ర చేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఆ ఎన్నికలలో అఖిలేష్ యాదవే ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేలంతా ఓపెన్ గానే చెప్పారు. ఆ స్థితి లోకేష్ కు లేకపోవడం ఒక బలహీనతగా కనిపిస్తుంది.
టీడీపీలో 2009 లో జూనియర్ ఎన్.టీ.ఆర్ సేవలను చంద్రబాబు వాడుకుని ఆ తర్వాత వదిలివేశారు. ఆయనను కనీసం మహానాడుకు కూడా ఆహ్వానించలేదు. జూనియర్ ఎన్.టీ.ఆర్ పార్టీలో ఉంటే లోకేష్ అవకాశాలు పోతాయని చంద్రబాబు భయపడ్డారు. నిజానికి లోకేష్ రాజకీయాలలోకి వస్తారా అని అంతకుముందు రోజుల్లో ఎవరైనా చంద్రబాబును అడిగితే ఆ ప్రశ్న వేసినవారిపై రుసరుసలాడేవారు. ఆ దశ నుంచి ఇప్పుడు కుమారుడిని జాకీలుపెట్టి లేపే పనిలో చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా యజమానులు పడ్డారు. పార్టీని నడపడం తప్పుకాదు. ఆ స్థాయికి ఎదగాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ రాజకీయాలను ఒక స్టాండర్డ్‌లో చేయలేకపోతే ప్రజలలో విశ్వసనీయత రాదు. ఇప్పుడు అదే సమస్యను లోకేష్ ఎదుర్కుంటున్నారు.
ఏతావాతా చెప్పేదేమిటంటే వెంకన్న వంటివారికి టీడీపీ గెలుపు మీద సంశయాలు ఉండి ఉండాలి. అంతేకాక లోకేష్ సమర్థత మీద అనుమానాలు ఉండాలి. అందుకే ఆయనను పార్టీకి పరిమితం చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు. కానీ లోకేష్‌ను ఒక్కసారి పార్టీ అధ్యక్షుడిగా చేస్తే పార్టీలో ఎలాంటి పరిణామాలు వస్తాయో చెప్పలేం. అప్పుడు కూడా చంద్రబాబు చాటు మనిషిగానే ఉంటే పెద్ద ఉపయోగం ఉండదు. స్వతంత్రంగా పనిచేసేంత శక్తి ఉందా అనే భయం పార్టీలో ఉంది. పార్టీ అధికారంలోకి వస్తే ఒకరకంగా, రాకపోతే మరోరకంగా ఈ పరిణామాలు ఉంటాయి. వివిధ సర్వేలను గమనిస్తే టీడీపీ శాసనసభ ఎన్నికలలో గెలిచే అవకాశం కనిపించడం లేదు. అందువల్ల ఫలితాల తర్వాత టీడీపీ సంక్షోభంలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment