దమ్ముంటే మా సవాల్ స్వీకరించండి: వైఎస్ జగన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపిస్తే మంత్రి నారాయణ పాత్ర బయటకు వస్తుందని ఆయన అన్నారు. దమ్ముంటే తమ సవాల్‌ను స్వీకరించాలని వైఎస్ జగన్ అన్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా వాదించి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.
పేపర్ లీక్‌కు కారకులైన వారి విషయం ప్రస్తావించకుండా...లీక్ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సాక్షి విలేకరి గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సాక్షి తరఫున తమ పూర్తి సహకారం ఉంటుందని వైఎస్ జగన్ తెలిపారు. తమ వద్ద ఉన్న ఆధారాలు సీబీఐకి అందిస్తామని తెలిపారు. పేపర్ లీక్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు.
జంబ్లింగ్ విధానంపై ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. తామే జంబ్లింగ్ విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెడుతున్నామని సీఎం చెబుతున్నారని, 1978 నుంచే జంబ్లింగ్ విధానం అమల్లో ఉందన్నారు. నెల్లూరులో ఈ నెల 25న పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయితే... ప్రభుత్వం తీరిగ్గా 28న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందన్నారు.
అదేవిధంగా కదిరిలోనూ హిందీ పేపర్ లీక్ అయ్యిందని, నారాయణ విద్యాసంస్థల సిబ్బందే స్వయంగా విద్యార్థులకు స్లిప్‌లు అందిస్తూ దొరికిపోయారన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయన్నారు. దీనిపై ఏం చర్య తీసుకుంటారని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.