
మంగళవారం అర్ధరాత్రి బండి సంజయ్‌ను అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ / కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లో మంగళవారం హైడ్రామా చోటు చేసుకుంది. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్న నగర పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య భారీ తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. టెన్త్ పేపర్ల లీకేజీకి సంబంధించి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా సంజయ్‌ను హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ అదనపు డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఏసీపీలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్‌రావు , సీఐలు నటేష్, లక్ష్మీబాబు, దామోదర్‌రెడ్డి దాదాపు 50 మందికి పైగా పోలీసులు అర్ధరాత్రి సమయంలో బండి సంజయ్ ఇంటి వద్దకు చేరుకున్నారు. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని సహకరించాలని కోరారు. తన అరెస్టుకు కారణంగా చూపించాలని, తనకు వారెంటు చూపాలంటూ పోలీసులతో సంజయ్ వాగ్వాదానికి దిగారు. మరో వైపు బండి సంజయ్‌పే అరెస్టు చేస్తున్నారనే ప్రచారంతో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో సంజయ్‌ను పోలీసులు ఇంటి నుండి బలవంతంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసుల ప్రయత్నాన్ని కార్యకర్తలు ప్రతిఘటించారు. పోలీసుల జులుం నశించాలని నినాదాలు చేస్తూ ఆయన అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బలవంతంగా సంజయ్‌ను వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.
ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలంటూ కార్యకర్తలు, అనుచరులు కోరినా పట్టించుకోకుండా అరెస్టు చేసి తీçసుకెళ్ళారు. తిమ్మాపూర్ మీదుగా సంజయ్‌ను తీసుకెళ్తుండగా వాహనం మొరాయించడంతో మరో వాహనంలో సంజయ్‌ను తీసుకెళ్లారు. అయితే పోలీసు వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్లాయి. బుధవారం బండి సంజయ్ అత్త ( సంజయ్ భార్య తల్లి) మరణించి తొమ్మిది రోజులు అవుతుండటంతో సంజయ్ కరీంనగర్‌కు వచ్చారు.
బుధవారం ఉదయం టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు ఆకస్మికంగా అరెస్టు చేయడం గమనార్హం. కాగా సంజయ్ అరెస్టును బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోందని, అరెస్టుకు కారణం చెప్పకుండా అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి అరెస్టు చేస్తారా? అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్‌కు మూడిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment