
కరీంనగర్ జైలుకు తరలిస్తున్న సందర్భంగా హనుమకొండలో సంజయ్ అభివాదం
సాక్షిప్రతినిధి, వరంగల్: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్, కాపీ కుట్ర కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మరో ముగ్గురికి హనుమకొండ మొదటి సెషన్స్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇందులో బండి సంజయ్‌ను కరీంనగర్ జైలుకు, మిగతా ముగ్గురిని ఖమ్మం జైలుకు తరలించాలని ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు వారిని జైళ్లకు తరలించారు.
అటూ ఇటూ తిప్పి కోర్టుకు.. : మంగళవారం కమలాపూర్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం బయటికి వచ్చిన కేసులో పోలీసులు బండి సంజయ్‌తోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనను అర్ధరాత్రి తర్వాత యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. బుధవారం ఉదయం అక్కడి నుంచి బయలుదేరి జనగామ జిల్లా పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.
సాయంత్రం నాలుగు గంటల సమయంలో హనుమకొండలోని నాలుగో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్‌చార్జి జడ్జి రాపోలు అనిత ఎదుట హాజరుపర్చారు. తన అరెస్టు సందర్భంగా పోలీసులు దురుసుగా వ్యవహరించారని, తనకు గాయాలు అయ్యాయని జడ్జికి సంజయ్ విన్నవించారు. దానిపై స్పందించిన న్యాయమూర్తి.. కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, కమలాపూర్ సీఐ సంజీవ్‌లను పిలిపించుకుని విచారించారు. తర్వాత బండి సంజయ్, ఇతర నిందితులను రిమాండ్ చేయాలంటూ పోలీసులు ఇచ్చిన రిపోర్టుపై న్యాయమూర్తి విచారణ చేపట్టారు.
నిందితుల అభ్యంతరాలను తిరస్కరించి..
విచారణ సందర్భంగా బండి సంజయ్‌పై కేసు నమోదు, అరెస్టు తీరుపై ఆయన తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఆర్‌పీసీ 41ఏ ప్రకారం నిందితులకు నోటీసులు ఇచ్చాకే అరెస్టు చేయాలని.. ఈ కేసులో అలా చేయలేదని, రిమాండ్‌ను తిరస్కరించాలని పిటిషన్ వేశారు. వాదనలు విన్న జడ్జి.. నిందితుల అభ్యర్థనను తిరస్కరించి, పోలీసుల రిమాండ్ రిపోర్టును అంగీకరించారు. బండి సంజయ్‌తోపాటు బూర ప్రశాంత్ (మాజీ జర్నలిస్టు), గుండెబోయిన మహేశ్ (కేఎంసీలో ల్యాబ్ అసిస్టెంట్), మౌటం శివగణేశ్ (డ్రైవర్)లకు 14 రోజులు రిమాండ్ విధించారు.
సంజయ్‌కు హాని ఉందనడంతో..
అయితే బండి సంజయ్‌కు ప్రాణహాని ఉందని, ఆహారంలో విష ప్రయోగం చేసి చంపే అవకాశం ఉందని న్యాయవాదులు కోర్టులో ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో సంజయ్‌కు ఇచ్చే ఆహారాన్ని పరీక్షించిన మీదటే అందజేయాలని జడ్జి ఆదేశించారు. ఇక వరంగల్ కోర్టు పరిధిలోని నిందితులను రిమాండ్ నిమిత్తం ఖమ్మం జైలుకు తరలిస్తారు. కానీ సంజయ్ తరఫు న్యాయవాదులు ఆయనను కరీంనగర్ జైలుకు తరలించాలని కోరగా న్యాయమూర్తి అంగీకరించారు. ఈ మేరకు బండి సంజయ్‌ను భారీ బందోబస్తు మధ్య కరీంనగర్ జైలుకు తీసుకెళ్లారు. మిగతా నిందితులను ఖమ్మం జైలుకు తరలించారు.
కరీంనగర్‌లో హైఅలర్ట్
కరీంనగర్ క్రైం: పోలీసులు బండి సంజయ్‌ను బుధవారం రాత్రి 10 గంటలకు కరీంనగర్ జైలుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కరీంనగర్ పట్టణంలో హైఅలర్ట్ ప్రకటించారు. మానేరు బ్రిడ్జి నుంచి బస్టాండ్ వరకు, జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంజయ్ కుటుంబ సభ్యులు జైలు వద్దకు చేరుకుని ఆయనను కలిసేందుకు ప్రయత్నించినా ఒకే చెప్పలేదు. బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బాస సత్యనారాయణను మాత్రమే జైలు వద్దకు అనుమతించారు.
దౌర్జన్యంగా లాక్కెళ్లారు: సంజయ్ భార్య అపర్ణ
పోలీసులు తన భర్తను దౌర్జన్యంగా లాక్కెళ్లారని బండి సంజయ్ సతీమణి అపర్ణ బుధవారం ఆరోపించారు. మంగళవారం అర్ధరాత్రి తమ ఇంటికి వచ్చిన పోలీసులు.. సంజయ్ భోజనం చేసిన తర్వాత గుండెకు సంబంధించిన మందులు వేసుకోవాల్సి ఉందని చెప్పినా వినకుండా దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. వారెంట్ చూపించాలని అడిగితే ఎలాంటి సమాధానం ఇవ్వలేదని చెప్పారు. పోలీసుల తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
నిందితులపై పెట్టిన సెక్షన్లు ఇవీ..
బండి సంజయ్, ఇతర నిందితులపై కమలాపూర్ పోలీసులు 4ఏ, 6 రెడ్‌విత్ 8 ఆఫ్ తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్–1997; సెక్షన్ 66డి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)యాక్ట్‌లతోపాటు ఐపీసీ సెక్షన్లు 120బీ,420, 447, 505 కింద కేసు నమోదు చేశారు.
► ఇందులో ప్రధాన నిందితుడి (ఏ1)గా బండి సంజయ్‌ను, ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్, ఏ6గా పోగు సుభాష్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శ్రామిక్, ఏ10గా పోతబోయిన వర్షిత్ పేర్లను చేర్చారు.
► మొత్తం పది మందిపై కేసు నమోదు చేయగా.. మొదట నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment