five arrested
-
ఆరు హత్యల కేసులో ఐదుగురు అరెస్టు
సాక్షి కామారెడ్డి/కామారెడ్డి క్రైం: ఇంటి కోసం ఒకే కుటుంబంలోని ఆరుగురిని దారుణంగా హత్య చేసిన కేసులోని నిందితులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ మంగళవారం మీడియాకు వెల్లడించిన వివరాలిలా.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌కు చెందిన పూనే ప్రసాద్ (36)కు భార్య శాన్విక అలియాస్ రమణి (29), కవల పిల్లలు చైత్రిక (8), చైత్రిక్ (8), తల్లి సుశీల, ఇద్దరు చెల్లెళ్లు స్వప్న (26), శ్రావణి (23) ఉన్నారు. ఓ యువతి ఆత్మహత్య కేసు నేపథ్యంలో ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాక ప్రసాద్ తన కుటుంబంతో కలిసి కామారెడ్డి జిల్లాలోని పాల్వంచకు మకాం మార్చాడు. ఆ కేసు నిమిత్తం డబ్బులు అవసరమై గతంలో తన స్నేహితుడు ప్రశాంత్ నుంచి రూ.3.50 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడు. ఈమధ్యన ప్రశాంత్ తనకు రావాల్సిన డబ్బులను ప్రసాద్‌ను అడగగా స్వగ్రామం మాక్లూర్‌లోని ఇంటిని తాకట్టు పెట్టి చెల్లిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో రూ.25 లక్షలు విలువ చేసే ప్రసాద్ ఇంటిని సొంతం చేసుకోవాలని ప్రశాంత్ పథకం పన్నాడు. ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రేషన్చేసిస్తే లోన్ తీసుకుని తనకివ్వాల్సిన డబ్బులు తీసుకుని మిగిలిన మొత్తం ఇస్తానని ప్రసాద్‌ను నమ్మించాడు. ప్రసాద్ ఇంటిని రిజిస్ట్రేషన్చేసినప్పటికీ రోజులు గడుస్తున్నా ప్రశాంత్ డబ్బులు ఇవ్వకపోగా, చివరికి హత్య చేయాలని భావించాడు. రూ.60 వేలకు సుపారీ.. ప్రసాద్‌ను హత్య చేసేందుకు మాక్లూర్ మండలం దుర్గానగర్ తండాకు చెందిన బానోత్ వంశీ, గుగులోత్ విష్ణులకు రూ.60 వేలు ఇచ్చేందుకు ప్రశాంత్ ఒప్పందం చేసుకున్నా డు. గత నెల 29న మాట్లాడుకుందామని నమ్మించి ప్రశాంత్, వంశీ, విష్ణులతో కలిసి ప్రసాద్‌ను కారులో మదనపల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. మద్యం తాగించి కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. అక్కడే గోతిని తవ్వి పాతి పెట్టారు. ఈనెల 1న పోలీసుల భయంతో ప్రసాద్ ఓ చోట దాక్కున్నాడని, అతను రమ్మన్నాడని చెప్పి భార్య శాన్విక (గర్భవతి), ప్రసాద్ చెల్లెలు శ్రావణిను వెంట తీసుకుని నిజామాబాద్ వెళ్లాడు. శ్రావణిని ఓ చోట ఉంచి శాన్వికను బాసర బ్రిడ్జి సమీపంలోకి తీసుకెళ్లి ఆమె గొంతుకు తాడు బిగించి నిందితులందరూ కలిసి చంపేశారు. ఆమె మృతదేహాన్ని నదిలో పడేశారు. ఆ వెంటనే శ్రావణి దగ్గరకు వెళ్లి ఆమె ను కారులో ఎక్కించుకుని చేగుంట మండలం వడియారం ప్రాంతంలో హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. మళ్లీ పాల్వంచకు వచ్చి ప్రసాద్ తల్లి సుశీల, మరో చెల్లెలు స్వప్న, ఇద్దరు పిల్లలను ఈనెల 4 న అదే కారులో తీసుకువెళ్లి నిజామాబాద్‌లోని ఓ లాడ్జిలో ఉంచారు. ఆ తర్వాత ప్రశాంత్ ఇంటికి వెళ్లి జరిగిందంతా తన తల్లి వడ్డెమ్మతో చెప్పి సహకరించాలని కోరాగా ఆమె ఒప్పుకుంది. తప్పించుకున్న తల్లి ప్రసాద్ పిల్లల్ని చూడాలని అంటున్నాడని సుశీలను, స్వప్నను నమ్మించారు. సుశీల, స్వప్నలను లాడ్జిలోనే ఉంచి ఇద్దరు పిల్లలను ప్రశాంత్, అతని తమ్ముడు తీసుకుని వెళ్లారు. నిర్మల్ వెళ్లే దారిలో ఉండే సోన్ బ్రిడ్జి వద్దకు వెళ్లేలోగా కారులోనే ఇద్దరు పిల్లలను తాడుతో ఉరి బిగించి హత్య చేసి గోనె సంచుల్లో కట్టి వాగులో పడేశారు. ఈ నెల 13న లాడ్డి నుంచి స్వప్నను కారులో తీసుకువెళ్లిన ప్రశాంత్, మై నర్ బాలుడు, వంశీ కలిసి సదాశివనగర్ మండలం భూంపల్లి సమీపంలోని ప్రధాన రహ దారి పక్కన హత్యచేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. నిందితులు ప్రసాద్ తల్లిని కూడా చంపేయాలని ప్లాన్ చేసినా చివరగా ఆమెకు అనుమానం వచ్చి లాడ్జి నుంచి బయటకు వెళ్లిపోయి తప్పించుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుల గుర్తింపు.. భూంపల్లి వద్ద గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని మరుసటి రోజు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పక్షం రోజుల వ్యవధిలోనే ఒకే తరహా హత్యలు చేగుంట, సదాశివనగర్, మెండోరా (సోన్ బ్రిడ్జి) పీఎస్‌ల పరిధిలో వెలుగు చూడటంతో వాటి మధ్య ఏదైనా లింక్ ఉన్నదా అనే కోణంలో విచారించారు. వందల సంఖ్యలో సీసీ కెమెరాలు పరిశీలించారు. సెల్‌ఫోన్ టవర్ డంప్, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని మాక్లూర్ కు చెందిన ప్రశాంత్‌గా గుర్తించారు. మంగళవారం నిందితులంతా కలిసి కారులో ప్రసాద్ తల్లిని వెతుకుతూ పాల్వంచకు వెళ్తుండగా పద్మాజీవాడి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. -
రాజధాని అమరావతి అసైన్డ్ భూముల స్కామ్‌లో ఐదుగురు అరెస్ట్
సాక్షి, విజయవాడ: రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం కేసులో ఐదుగురిని సీఐడీ అరెస్ట్ చేసింది. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయలు, కొట్టి దొరబాబులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. 1100 ఎకరాల అసైన్డ్‌భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని అభియోగం. ఇందులో 169.27 ఎకరాలకు సంబంధించి విచారణకు సంబంధించి ఐదుగురిని సీఐడీ అరెస్టు చేసింది. కేసులో ప్రధాన నిందితుడు టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ.. బంధువులు, పరిచయస్తుల పేరుతో బినామీ లావాదేవీలు జరిపినట్టుగా అభియోగాలు ఉన్నాయి. చదవండి: అరుదైన రికార్డ్.. ఆ విషయంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్ అనంతవరం, కృష్ణాయపాలెం, కూరగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంటకపాలెం గ్రామాల్లో వేర్వేరు సర్వే నంబర్లలో సుమారు 89.8 ఎకరాల భూమిని మాజీ మంత్రి నారాయణ తన బంధువులు, పరిచయస్తుల పేరుతో అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. రామకృష్ణా హౌసింగ్ డైరెక్టర్ ఖాతాల ద్వారా పేమెంట్లు చేసి ఈ వ్యవహారాలు చేశారని నిర్ధారణ అయ్యింది.ఈకేసులో ఇతర నిందితులు వారి తరఫు మనుషులు మరో 79.45 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్‌ను అక్రమంగా కొనుగోలు చేశారని వెల్లడైంది.ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి నారాయణ – రామకృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య రూ.15 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. -
విశాఖలో డ్రగ్స్ అమ్ముతున్న ఐదుగురు అరెస్ట్
అల్లిపురం (విశాఖ దక్షిణం): స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గోవా నుంచి (లైసెర్జిక్ యాసిడ్ డైథైల్ అమైడ్) ఎల్ఎస్డీ బ్లాట్స్ నగరానికి తీసుకువచ్చి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో నాలుగో పట్టణ పోలీసులు, యాంటీ నార్కోటిక్ సెల్, సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఐదుగురు నిందితులను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ విలేకరులతో మాట్లాడారు. నగరానికి చెందిన పాంగి రవికుమార్ అనే వ్యక్తి గంజాయి తీసుకుని వెళ్లి గోవాలో దిలీప్ అనే వ్యక్తికి ఇచ్చి, అతని వద్ద నుంచి నార్కోటిక్ డ్రగ్స్ తీసుకువచ్చి నగరంలో అమ్ముతున్నట్లు గుర్తించామని తెలిపారు. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ గ్రూపుల ద్వారా డార్క్ వెబ్సైట్ ఉపయోగించుకుని క్రిప్టోకరెన్సీ, యూపీఐ పేమెంట్స్ చేస్తూ పోస్టల్, ప్రైవేట్ కొరియర్స్ ద్వారా డ్రగ్స్ రవాణా జరుగుతున్నాయని తెలిపారు. ఈ వ్యవహారం అంతా ఆన్లైన్లో జరుగుతోందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. -
జైషే మహ్మద్ కుట్ర భగ్నం
శ్రీనగర్/న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున విధ్వంసం సృష్టించేందుకు జైషే మహ్మద్ పన్నిన కుట్రను శ్రీనగర్ పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు ఉగ్రవాద సానుభూతిపరుల నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గోండనా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ గజ ఉగ్రవాదిని దోడా జిల్లాలో మట్టుబెట్టామని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్సింగ్ తెలిపారు. కాగా, ఉగ్రవాదులను తరలిస్తూ పట్టుబడిన డీఎస్పీ దావిందర్‌సింగ్ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ జరపనుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఆయనకు అందజేసిన శౌర్య పతకాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా ఉండగా, చొరబాట్ల కోసం, కేడర్‌ను బలోపేతం చేయడానికి ఉగ్ర సంస్థలు రహస్య సమాచార వ్యవస్థను, వాయిస్ ఆన్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (Vౌఐ్క)ను ఉపయోగిస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. అన్ని డివిజన్లలో బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాలను అత్యవసర సేవలు అందించే బ్యాంకులు, ఆసుపత్రులు లాంటి సంస్థలకు మాత్రమే పునరుద్ధరించాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మంగళవారం ఆదేశించిన విషయం తెలిసిందే. ఒమర్ అబ్దుల్లా నివాసం తరలింపు జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను అధికారిక నివాసానికి సమీపంలో ఉన్న మరో ఇంటికి తరలించనున్నారు.ఆర్టికల్ 370 రద్దుతో జరిగిన పరిణామాల నేపథ్యంలో అప్పటినుంచి ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారు. -
ఆత్మహత్య కాదు..హత్యే
చీరాలటౌన్: కోడలిపై అనుమానం పెంచుకున్న మామ, భర్త మరికొందరు కలిసి విచక్షణ మరచి దారుణంగా హత్య చేసి తర్వాత సాధారణ మరణంగా చిత్రీకరించారు. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే వివాహితురాలిది సాధారణ మరణం కాదని, హత్య చేసి ఆత్మహత్యగా నమ్మించే యత్నం చేసిన వారిని కటకటాల వెనుకకు పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పేరాల హైస్కూల్ రోడ్డులో గత నెల 20న దామర్ల రమ్య అనే వివాహితను భర్త, కుటుంబ సభ్యులు హత్య చేసి ఆత్మహత్యగా నమ్మ బలికించారు. ఎవరికీ తెలియనీయకుండా మృతురాలి మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని పుట్టినిల్లు అయిన తాడేపల్లి గూడెం తరలించి దహనం చేశారు. అయితే మాస్టర్ వీవర్ కోడలిని కుటుంబ సభ్యులే దారుణంగా హత్య చేశారని ఫిర్యాదు అందడంతో పేరాల వీఆర్వో జోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేరాల హైస్కూల్ రోడ్డులో నివాసముంటున్న దామర్ల శ్రీనుకు తాడేపల్లిగూడెంకు చెందిన రమ్యలకు 8ఏళ్ల క్రితం వివాహమైంది. రమ్యకు పిల్లలు పుట్టలేదని కొంత కాలంగా భర్తతో పాటు మామయ్య, బావ వేధింపులకు గురిచేశారు. గొడ్రాలివి అంటూ సూటిపోటి మాటలతో చిత్రహింసలు చేయడంతో పాటు రమ్యను దారుణంగా హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించి మృతురాలి పుట్టింటికి తీసుకెళ్లి మృతదేహాన్ని అప్పగించారు. అయితే రమ్య మరణం సాధారణమైంది కాదని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు అందగా వీఆర్వో జోషి తన విచారణలో వచ్చిన అంశాలతో రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రమ్యను భర్త, ఇతర కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. చేనేత వస్త్ర వ్యాపారి కుమారుడితో పాటు అతనికి సహకరించిన మరో ఐదుగురిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా 15 రోజులు రిమాండ్ విధించారు. -
కోడి పందేల ముఠా అరెస్ట్
విశాఖ క్రైం: నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుట్టుగా కోడి పందేలు నిర్వహిస్తున్న ముఠాని టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్సు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తాటిచెట్లపాలెం దరి లెప్రసీ కాలనీలోని బహిరంగ ప్రదేశంలో ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారంతో టాస్క్ఫోర్సు పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో నిర్వాహకుడు ఆనంద్ పరారయ్యాడు. అక్కడ ఉన్న మిగిలిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే 18 పందెం కోళ్లు, రూ.5వేలు, మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ చిట్టిబాబు మాట్లాడుతూ కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారంతో దాడులు చేశామన్నారు. దాడుల్లో ఎస్ఐలు సతీష్, మూర్తి సిబ్బంది పాల్గొన్నారు. -
విశాఖ యోగా గురువు హత్య కేసు: ఐదుగురు అరెస్ట్
-
రిటైర్డ్ టీచర్ కిడ్నాప్ కేసులో ఐదుగురి అరెస్ట్
వాల్మీకిపురం: కలకడ మండలంలో రిటైర్డ్ టీచర్ కిడ్నాప్ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్టు డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ శ్రీధర్‌నాయుడు తెలిపారు. వారు శనివారం వాల్మీకిపురం సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. కడప జిల్లా చిన్నమండెం మండలం వండాడి తూర్పుపల్లెకు చెంది న ప్రతాప్‌రెడ్డి (26), సంబేపల్లె మండలం చిన్నపాపిరెడ్డిగారిపల్లెకు చెందిన ఆనందరెడ్డి (26), చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం దోర్నకంబాల గ్రామానికి చెందిన యశ్వంత్ (20), తెలం గాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పూలకల్లు మండలం కొరంపల్లెకు చెందిన బాలరాజు (24), కలకడ మండలం కోన గ్రామానికి వెంగన్నగారిపల్లి హరిజనవాడకు చెందిన క్రిష్ణయ్య కుమారుడు రామాంజులు (25) ముఠాగా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించాలని భావించారు. కలకడ మండలం కోన గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ గుడ్ల రాజన్నను ఈ నెల 4వ తేదీన కిడ్నాప్ చేశారు. మదనపల్లిలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న రాజన్న కుమారుడు కాశీనాథ్‌కు ఫోన్ చేసి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాశీ నాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐ శ్రీధర్‌నాయుడు కిడ్నాపర్లు వాడిన సెల్‌ఫోన్ ఈఎంఐ నెంబర్లు ఆధారంగా శుక్రవారం తలకోనలో పట్టుకున్నారు. వారు వాడిన ఇండికా కారును, సెల్ఫోన్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం డీఎస్పీ సమక్షంలో అరెస్ట్ చూపించి రిమాండ్‌కు తరలించారు. ఎస్ ఐలు వెంకటేష్, చాన్‌బాషాను డీఎస్పీ చిదానందరెడ్డి అభినందించారు. -
గంజాయి రవాణా.. ఐదుగురి అరెస్టు
200 కిలోల గంజాయి, రెండు కార్లు స్వాధీనం హైదరాబాద్: గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు యువకులను నార్సింగి పోలీసులు, మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితులైన సినీ నిర్మాత వి.రమేశ్‌తోపాటు మరొక నిందితుడు శేఖర్ పరారీలో ఉన్నట్లు డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో రూ.37 లక్షల విలువ చేసే 200 కిలోల గంజాయి, రెండు కార్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ శనివారం తెలిపారు. నల్లగొండ జిల్లాకు చెందిన రామకృష్ణ(23), రవి(27), వెంకన్న(42) క్యాబ్ డ్రైవర్లుగా పనిచేశారు. ఆదాయం లేకపోవడంతో వాహనాలను అమ్మేసి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. పనికోసం వెంకన్న మామ దుర్గయ్యను సంప్రదించారు. దుర్గయ్య కొత్తగూడెం ప్రాంతానికి చెందిన వి.రమేశ్‌ను పరిచయం చేయగా.. ఆయన ద్వారా వైజాగ్‌కు చెందిన శేఖర్ పరిచయమయ్యాడు. ఈ ముగ్గురూ శేఖర్‌ను కలసి గంజాయిని ముంబైకి తరలించేందుకు ఒప్పుకున్నారు. వీరికి ఈసారి నిర్మాత రమేశ్ కూడా జతకలిశాడు. ఈ ముగ్గురితోపాటు డ్రైవర్లు నరేశ్(25), మధు(24)ను కూడా తీసుకుని కార్లలో ముంబైకి బయలుదేరారు. సమాచారం అందుకున్న నగర టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ, నార్సింగి పోలీసులు పుప్పాలగూడ ఓఆర్ఆర్ వద్ద వర్ణా కారును ఆపి సోదా చేశారు. వెనుక వర్ణాకారు రాకపోవడంతో నిస్సాన్ కారులోని వ్యక్తులు ఫోన్ చేయడంతో పోలీసులు కారు మరమ్మతుకు గురైందని చెప్పి వారిని రప్పించారు. దీంతో రెండు కార్లు, 200 కిలోల గంజాయితోపాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఐదుగురి పట్టివేత
మిర్యాలగూడ రూరల్: మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఐదుగురు వ్యక్తులను మిర్యాలగూడ రూరల్ పోలీసులు సోమవారం రాత్రి పట్టుకున్నారు. రూరల్ ఎస్సై కుంట శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ– కోదాడ రహదారిపై బదలాపురం వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించారు. వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా ముల్కలకాల్వకు చెందిన కంపసాటి వెంకన్న, రాయినిపాలెం గ్రామానికి చెందిన పిండి లలిందర్ రెడ్డి, బదలాపురానికి చెందిన దాసరి శ్రీను మద్యం తాగి పట్టుబడ్డారు. అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై గూడూరు శివారులో తనిఖీ చేయగా గూడూరుకు చెందిన సాయికృష్ణ, బి.రాజు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినట్లు రూరల్ ఎస్సై తెలిపారు. -
ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్టు
లేపాక్షి : మండల కేంద్రంలోని కంచిసముద్రం రోడ్డు పక్కన మట్కా ఆడుతున్న ఐదుగురు మట్కారాయుళ్లను శనివారం సాయంత్రం అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. మట్కా ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అయితే ఐదుగురు మట్కారాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.2,040 స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకుని వారిని సోమవారం హిందూపురం కోర్టులో హాజరు పరచనున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో కలకలం
-
గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద కలకలం
విజయవాడ: గన్నవరం విమానాశ్రయం వద్ద శుక్రవారం మధ్యాహ్నం కలకలం రేగింది. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న అయిదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు విచారిస్తున్నారు. దీంతో పాటు గన్నవరం విమానాశ్రయంలో బాంబు, డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీ చేపట్టింది. పట్టుబడిన అయిదుగురిని జమ్ముకాశ్మీర్ నుంచి వచ్చిన జావెద్ అహ్మద్, జావెద్ అక్బర్, అమిరాహ్ పాల్, సనలాహ్ భట్, బషీర్ అహ్మద్ షేక్ గా నిఘా అధికారులు గుర్తించారు. -
రూ.1.34 కోట్ల కొత్త నోట్లు పట్టివేత
సాక్షి, చెన్నై: కరెన్సీ నోట్ల మార్పిడికి ప్రయత్నించిన ఓ ముఠాను గురువారం చెన్నైలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు పట్టుకున్నాయి. వారి నుంచి రూ.1.34 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో గురువారం ఇంటెలిజెన్స్ వర్గాలు చెన్నై మీనంబాక్కం ఎయిర్పోర్ట్ కి సమీపంలోని పోలీసుల సహకారంతో వాహనాల తనిఖీ చేపట్టాయి. ఆ సమయంలో ఓ కారు ఆగకుండా ముందుకు దూసుకెళ్లింది. దీంతో ఆ కారును వెంబడించి ∙పల్లావరం వద్ద కారులో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కారులో రూ.1.34 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు బయట పడ్డాయి. పట్టుబడ్డ వారిలో చెన్నైకు చెందిన రిజ్వాన్, ముక్దర్, సమీఅహ్మద్‌తో పాటు మరో ఇద్దరున్నారు. -
విదేశీ కరెన్సీతో ఐదుగురి పట్టివేత
హైదరాబాద్ : చెలామణీలో లేని విదేశీ కరెన్సీని అమాయకులకు అంటగట్టి సొమ్ము చేసుకునేందుకు యత్నించిన ఐదుగుర్ని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమమండల డీసీపీ వెంకటేశ్వర రావు తెలిపిన వివరాలివీ.. వరంగల్ జిల్లాకు చెందిన రామసాగర్ (34) కారుడ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఓసారి అతడు గోవాకు వెళ్లిన సమయంలో అక్కడ కేరళకు చెందిన జావిద్ పరిచయమయ్యాడు. అతని వద్ద చెలామణీలో లేని వెనుజులా దేశ కరెన్సీ ఉంది. ఆ దేశంలో 2008లోనే బ్యాన్ చేసిన కరెన్సీ మన రూపాయల్లో 11 లక్షల పైచిలుకు ఉంటుందని దాన్ని కేవలం లక్షన్నరకే ఇస్తానని నమ్మ బలికాడు. దీంతో రామసాగర్ తన భార్య నగలు అమ్మి మరీ వాటిని కొనుగోలు చేశాడు. ఇతని స్నేహితులు సైదాబాద్‌కు చెందిన కె.కరుణాకర్ (43), పద్మారావు నగర్‌కి చెందిన జి.రంజిత్ కుమార్ (33), సైదాబాద్‌కు చెందిన ఎం.రవిచంద్ర (43), గుంటూరు జిల్లాకు చెందిన ఎన్. నాగమల్లేశ్వర్ రావు (30) లతో కలిసి పలువుర్ని మోసం చేసి వాటిని అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సోమవారం ఉదయం అమీర్‌పేట బిగ్‌బజార్ వద్ద వీరు అనుమానాస్పదంగా తిరుగుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సదరు నగదును ఓ వ్యక్తికి రూ.5 లక్షలకు అమ్మేందుకు యత్నిస్తున్నట్లు వారు విచారణంలో ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరికి కరెన్సీ సరఫరా చేసిన జావిద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఉద్యోగాలు ఇప్పిస్తామని టోకరా : ఐదుగురు అరెస్ట్
అనంతపురం: ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను ఘరానా మోసం చేసిన ఓ ముఠా సభ్యులను అనంతపురం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్లితే..అనంతపురంలో కొందరు కౌన్సిల్ ఫర్ ఆగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ (సీఏఈఎఫ్‌ఎం) అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు చెందిన ఎన్ జ్యోతి ప్రసాద్‌రెడ్డి (ఛైర్మన్), సాధీక్వలీ (జీఎం), ఎం. కృష్ణ (సీఈఓ) కలిసి పంగల్రోడ్డుని టీటీడీసీలో 2015 జనవరిలో మరో సంస్థను స్థాపించారు. అప్పట్లో సుమారు 324 మంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు జరిపి వారి నుండి ఒక్కొక్కరితో రూ. 25 వేల నుండి రూ. 60 వేల వరకు రూ. 2 కోట్లకు పైగా వసూళ్లు చేశారు. కొంతమందికి శిక్షణ ఇచ్చి గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి ఉద్యోగులతో రైతులకు అవగాహన కార్యక్రమాలను రెండు నెలల పాటు నిర్వహించారు. తరువాత ఆ సంస్థలోని ఉద్యోగులు వేతనాలు చెల్లించాలంటూ సంస్థ యజమాన్యంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆరు నెలలు తరువాత మోసపోయిన బాధితులు మూడవ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసుల ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకొన్నప్పటికి ఈ మోసగాళ్లు వెనుక అధికారపార్టీ నాయకులు ఉండడంతో పోలీసులను దర్యాప్తుపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయితే మోసపోయిన నిరుద్యోగులు పోలీసులను నిలదీయడంతో ఆ సంస్థలో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఎవరూ జ్యోతిప్రసాద్ రెడ్డి... చిత్తూరు జిల్లాకు చెందిన జ్యోతిప్రసాద్రెడ్డికి అనంతపురం జిల్లాకు చెందిన ఓ మంత్రి కుటుంబ సభ్యులతో దగ్గర సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. జ్యోతిప్రసాద్రెడ్డి ఇప్పటికే ముగ్గురిని వివాహాం చేసుకుని నిత్యం మోసాలకు పాల్పడుతూ.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఓ మంత్రి వద్ద తలదాచుకుంటున్నట్టు బాధితులు చెప్పుతున్నారు. అయితే పోలీసులు అసలు ముద్దాయిలను వదిలిపెట్టి ఉద్యోగులను అదుపులోకి తీసుకోవడంపై పలు విమర్శలకు దారితీస్తోంది. -
100 కేజీల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం గుడుగుపల్లి వద్ద ఎక్సైజ్ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించి... వారిపై కేసు నమోదు చేశారు. -
విద్యార్థిని ప్రసవం.. అదుపులో ఐదుగురు
పుట్లూరు: అనంతపురం జిల్లా పుట్లూరులోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినిని తల్లిని చేసిన కేసులో పోలీసులు గురువారం ఐదుగురిని అరెస్ట్ చేశారు. పదో తరగతి చదివే ఓ విద్యార్థిని గత నెల 28న ఓ శిశువును ప్రసవించిన విషయం తెలిసిందే. తనపై కొందరు అత్యాచారం చేసినట్టు బాధిత విద్యార్థిని విచారణలో తెలపడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
ఆంధ్రాబ్యాంకుకు టోపీ.. ఐదుగురి అరెస్టు
నకిలీ డాక్యుమెంట్లతో ఆంధ్రాబ్యాంకును రూ. 10 లక్షల మేర మోసం చేసిన ఐదుగురు వ్యక్తులను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లలో భార్యాభర్తలు కూడా ఉన్నారు. ప్రభుత్వ రబ్బరు స్టాంపులకు నకిలీలు తయారుచేయించి, వాటితో అగ్రిమెంట్లు రూపొందించి, వాటి ఆధారంగా బ్యాంకులో గృహరుణం తీసుకున్నారు. ఇలా బ్యాంకును మోసం చేసినవాళ్లలో ప్రశాంత్ భాగ్వే, ప్రతిజ్ఞా భాగ్వే, అజయ్ ఆంగ్రే, సంకేత్ కాంబ్లే, రవి పాటిల్ ఉన్నారు. వీళ్లలో ప్రశాంత్ భాగ్వే అనే వ్యక్తి తాను థానెలోని డొంబివాలి ప్రాంతంలో పాటిల్ నుంచి వీనస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఓ ఫ్లాట్ కొన్నట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు. వాటి ద్వారానే గృహరుణం తీసుకున్నాడు. దీంతోపాటు సంజయ్ అఖాడే అనే వ్యక్తిని మోసం చేసి అతడివద్ద నుంచి రూ. 60 వేల మొత్తం తీసుకున్నారు. దాంతో వీళ్ల మోసం మొత్తం విలువ రూ. 10.60 లక్షలకు చేరింది. దీనిపై ఫిర్యాదు అందడంతో ప్రశాంత్ భాగ్వేను అరెస్టు చేశారు. నిందితులపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. -
ఐదుగురు దొంగలు.. క్లూ ఒక్కటి
కరీంనగర్: వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆ ఐదుగురూ కలసి నేరాలు చేశారు. ఒకే డివిజన్లో వీరిపై 10 కేసులు నమోదయ్యాయి. దొంగిలించిన బైక్‌పై తిరుగుతున్న వీరిని ఓ స్థానికుడు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. ఆ ఒక్క ఆధారమే వారిని కటకటాలపాలు చేసింది. వివరాలు.. కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలానికి చెందిన చితారి శ్రీనివాస్, కొండపల్లి పర్శరాములు, నూనె పర్శరాములు, నిజామాబాద్ జిల్లా బిర్కూర్‌కు చెందిన కదమంచి పాపయ్య, శంకర్ కలసి దొంగతనాలు చేసేందుకు ముఠాగా ఏర్పడ్డారు. వారంతా జగిత్యాల డివిజన్లోని ఐదు మండలాల్లో ఏడాది కాలంలో 9 చైన్‌స్నాచింగ్‌లు, ఒక దోపిడీకి పాల్పడి పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నారు. ఇటీవల వారు ఒక చోట బైక్‌ను తస్కరించి, దానిపై సంచరిస్తున్నారు. వీటిపై అందిన ఫిర్యాదుల మేరకు ప్రత్యేక బృందంగా ఏర్పడిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక వ్యక్తి ఇచ్చిన చిన్న ఆధారం వారికి కీలకంగా మారింది. అదే వారు దొంగిలించిన బైక్..! ఆ వాహనం రూపురేఖల ఆధారంగా మంగళవారం మెట్పల్లి సమీపంలో తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన నిందితులు పోలీసులకు దొరికిపోయారు. వారిని ప్రశ్నించటంతో బండారం అంతా బట్టబయలైంది. వారి నుంచి రూ.5.27 లక్షల విలువైన బంగారం, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. క్లూ అందించిన వ్యక్తికి పోలీసు శాఖ తరఫున రూ.10వేలు బహుమానం అందించారు. -
గంజాయి తరలిస్తున్న ఐదుగురు అరెస్టు
విశాఖపట్టణం: విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో మరోసారి పెద్ద ఎత్తున గంజాయి దుండగులను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులు చింతపల్లి, సీలేరు తదితర ప్రాంతాల నుంచి 65 కిలోల గంజాయిని వాహనాల్లో తరలిస్తుండగా రోలుగుంట మండలం పెద్దపేట కూడలి వద్ద బుధవారం తెల్లవారుజామున పోలీసుల తనిఖీల్లో వెలుగు చూసింది. ఈ సందర్భంగా బీహార్‌కు చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 65 కిలోల గంజాయి, వ్యాను, కారు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రూ.2.35లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను పోలీసులు బుధవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. (రోలుగుంట) -
బ్యాంకును మోసగించిన ఐదుగురి అరెస్టు
వైఎస్సార్ జిల్లా: నకిలీ ఆస్తి పత్రాలను సృష్టించి బ్యాంకు నుంచి రూ. కోటికి పైగా అప్పుగా తీసుకున్న మోసగాళ్లను, సహకరించిన బ్యాంకు ఉద్యోగిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. కడపకు చెందిన మోడెం శ్రీనివాసులు, అతని తమ్ముడు రమేశ్, బావ బొల్లా నర్సింహులు, స్నేహితుడు వడ్డేపల్లి వెంకట సుబ్బయ్య నకిలీ ఆస్తి పత్రాలను తయారు చేశారు. వాటితో వైఎస్సార్ జిల్లా కడపలోని ఎస్బీఐ ప్రధాన శాఖ నుంచి రూ. కోటి 12 లక్షల 63 వేలను తీసుకున్నారు. వీరికి బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ కృష్ణమోహన్ సాయం చేశాడు. 2012-13 కాలంలో వీరు ఏడు విడతలుగా రుణం తీసుకున్నారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు 24వతేదీ రాత్రి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వేకోడూరు (వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం సమతానగర్‌లో ఆదివారం సాయంత్రం పోలీసులు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రూ.11.86 లక్షల విలువైన 24 దుంగలను స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. సమతానగర్ సమీపంలోని వంతెన కింద నిందితులు వీటిని దాచి ఉంచారని ఎస్సై రామచంద్ర తెలిపారు. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
అల్వాల్ (మల్కాజ్ గిరి): హైదరాబాద్ నగరంలో ఇండింపెండెంట్ ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచార గృహం నడుపుతున్న నిర్వాహకురాలిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. కేరళకు చెందిన రోజీ అనే మహిళ అల్వాల్‌లోని సాయినగర్ కాలనీలో ఒక ఇండిపెండెంట్ ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచార గృహం నడిపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ గృహంపై ఆదివానం దాడిచేసి ముగ్గురు మహిళలను, ఇద్దరు విటులను, నిర్వాహకురాలు రోజీని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ఇద్దరు హైదరాబాద్‌కు, ఒకరు సిద్ధిపేటకు చెందిన వారని పోలీసులు తెలిపారు. కాగా, వీరందరు 30 ఏళ్లలోపు వారేనని పోలీసులు చెప్పారు. వీరితో పాటు విటులు వెంకటరెడ్డి(50), యాదగిరి(30)లను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. -
వ్యభిచారం కేసులో ఐదుగురి అరెస్ట్
గుంటూరు: గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా వ్యవహారాన్ని పోలీసులు రట్టు చేశారు. ఈ సంఘటన గుంటూరు హౌసింగ్‌బోర్డు కాలనీలోని శ్రీపూజ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 103లో జరిగింది. వివరాల్లోకెళ్తే... భార్య భర్తలమని చెప్పి అద్దెకు దిగిన సానికొమ్ము వెంకట కొండారెడ్డి, కుమారి.. దొంగచాటుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి వెళ్లి చూసేసరికి బయటి నుంచి సంప్రదాయబద్ధంగా కనిపించే ఇంట్లో వేరు వేరు ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి ఈ రాకెట్ నిర్వహిస్తున్నట్టు తేలింది. గురువారం అర్ధరాత్రి సమయంలో దాడి చేసిన పోలీసులు వెంకట కొండారెడ్డి, కుమారితో పాటు ఓ యువతిని ఇద్దరు విటులను అదుపులో తీసుకున్నారు. -
సోషల్ మీడియాలో తప్పుడు వీడియో.. ఐదుగురు అరెస్ట్
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న నెపంతో రూథ్ ఛల్తన్ సౌమి అనే యువతితోపాటు మరో నలుగురిని మిజోరాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక యువతిని కొంతమంది దుండగులు సామూహిక అత్యారాచం చేసి హత్య చేశారని, ప్రస్తుతం ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని ఒక వీడియో పోస్ట్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అది తప్పుడు వీడియోగా ధ్రువీకరించి సంబంధిత వీడియోను పోస్ట్ చేసిన ఛల్తన్ సౌమిని, ఆమె నలుగురు స్నేహితులను అరెస్ట్ చేశారు. వీరిపై ఐటీ చట్టం సెక్షన్ 66, సెక్షన్ 203 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కేవలం18 లక్షలకే... కేజీ బంగారం
ఏలూరు: రూ. లక్ష ఇవ్వండి రూ. 3 లక్షలు తీసుకోండి... కిలో బంగారం కేవలం రూ. 18 లక్షలే అంటూ జనాన్ని చీటింగ్ చేస్తున్న ఓ ముఠా గుట్టును పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీసులు మంగళవారం రట్టు చేశారు. ముఠాకు చెందిన అయిదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నకిలీ బంగారంతోపాటు అధిక మొత్తంలో నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముఠా సభ్యులను పట్టణంలోని పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తక్కువ నగదు ఇస్తే... అధిక మొత్తంలో నగదు ఇస్తామంటూ గత కొంత కాలంగా జిల్లాలో ఓ ముఠా మోసగిస్తుంది. ఇటీవల కాలంలో ఆ ముఠా ఆగడాలు అధికమైనాయి. దాంతో జల్లాలోని పలు ప్రాంతాల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దాంతో జిల్లావ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులు నిఘాను అధికం చేశారు. ఆ క్రమంలో సదరు ముఠా గుట్టును పోలీసులు మంగళవారం రట్టు చేశారు. -
‘కత్తి’పై దాడులు
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళ సంఘాల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొంటున్న ‘కత్తి’ సినిమా విడుదల సందర్భంగా రాష్ట్రంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సినిమాను ప్రదర్శించనున్న థియేటర్లపై దాడులు చేసి ధ్వంసానికి పాల్పడ్డారు. చిత్రం విడుదల చేస్తే మరింత ఆందోళన తప్పదని ఆయా సంఘాలు హెచ్చరించినప్పటికీ బుధవారం కత్తి సినిమా విడుదలకు సిద్ధమైంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్, సమంత హీరో, హీరోయిన్లుగా నిర్మించిన చిత్రం కత్తి. ప్రసిద్ధ ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. లైకా మొబైల్స్ సంస్థ అధినేత సుభాష్కరన్ అల్లిరాజాకు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే వ్యాపార భాగస్వామి అని తమిళ సంఘాల నేతలు చెబుతున్నారు. శ్రీలంక యుద్ధ సమయంలో వేలాది తమిళులను ఊచకోత కోసిన రాజపక్సే సన్నిహితుడు నిర్మించిన కత్తి సినిమాను రాష్ట్రంలో ప్రదర్శించేందుకు అనుమతించబోమని సుమారు 60 తమిళ సంఘాలు కొంతకాలంగా హెచ్చరిస్తున్నాయి. కత్తి సినిమా షూటింగ్ దశలోనే అనేక బహిరంగ ప్రకటనలు కూడా చేశాయి. ఈ నెల 22న రాష్ట్రంలోని 450 థియేటర్లలో కత్తి సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు ప్రారంభించారు. నిరసన కారులను ఒప్పించేందుకు ఈ నెల 20న నిర్మాతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ అనే పేరును చిత్రం నుంచి తొలగించాలని సంఘాలు పట్టుబట్టగా, ఈ డిమాండ్‌కు నిర్మాతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. అడ్డంకులన్నీ తొలగిపోయి ప్రశాంత వాతావరణంలో చిత్రం విడుదలకు సిద్ధమైందని అందరూ భావించారు. అర్ధరాత్రి ఆకస్మిక దాడులు కత్తి విడుదలను వ్యతిరేకిస్తూ కొందరు దుండగులు సోమవారం అర్ధరాత్రి వేళ ఆకస్మికంగా రాష్ట్రంలో స్వైర విహారం చేశారు. చెన్నై, కడలూరు, నామక్కల్, తిరుచ్చి తదితర జిల్లాల్లో కత్తి సినిమా ప్రదర్శనకు సిద్ధమైన థియేటర్ల వద్ద విధ్వంసాలు సృష్టించారు. హీరో విజయ్ బ్యానర్లను చించివేశారు. నాలుగు ఆటోలు, రెండు కార్లలో సుమారు 50 మంది దుండగులు చెన్నై అన్నాశాలై సమీపంలోని సత్యం థియేటర్ల సముదాయం వద్దకు చేరుకుని పెట్రో బాంబులు విసిరారు. ఆ బాంబులు పెద్ద శబ్దంతో పేలడంతో థియేటర్ ముందు భాగంలోని అద్దాలు పగలిపోయాయి. బుకింగ్ కౌంటర్ల వద్దనున్న అద్దాలపై దుడ్డకర్రలు, రాళ్లతో దాడులు చేశారు. థియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకులు పేలుళ్ల శబ్దాలకు భయపడి వెలుపలకు పరుగులు తీశారు. థియేటర్ సిబ్బంది ప్రేక్షకుల వాహనాలను వెనుకవైపు నుంచి పంపించేశారు. రాయపేటలోని ఉడ్‌ల్యాండ్స్ థియేటర్‌పై కూడా రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. విధ్వంసాలకు పాల్పడిన వారు తందెపైరియార్ ద్రావిడ కళగం కార్యకర్తలుగా సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. అప్పు (32), జయ్వికాష్ (32), వాసుదేవన్ (28), జయకుమార్ (25), కృష్ణన్ (20) అనే యువకులను అరెస్ట్ చేశారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. అడ్డంకులు తొలిగాయి : హీరో విజయ్ కత్తి చిత్రం విడుదలపై తమిళ సంఘాలతో నెలకొన్న విబేధాలు, అడ్డకుంలు తొలగిపోయాయని హీరో విజయ్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లైకా ప్రొడక్షన్స్ అనే పేరును తొలగించమని సంఘాలు కోరగా, నిర్మాతలు అంగీకరించడంతో వివాదం సమసిపోయిందని ఆయన చెప్పారు. సమస్య పరిష్కారానికి సహకరించిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, పోలీస్‌శాఖ, తమిళనాడు థియేటర్ల యాజమాన్యాలకు, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. కత్తిరూ.ని అడ్డుకుంటాం చర్చల పేరుతో తమిళ సంఘాల వారిని పిలిచి మోసగించారని తమిళర్ వాళ్వురిమై కూట్టమైప్పు అధ్యక్షులు వేల్మురుగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు తాము వేచివుండేలా చేసిన నిర్మాతలు, ఆ తరువాత చర్చలు ఫలప్రదమైనట్లు ప్రచారం చేశారని ఆయన అన్నారు. సంఘాల డిమాండ్లు నెరవేరితేగానీ కత్తి చిత్రాన్ని ప్రదర్శించబోమని, థియేటర్ల యజమానులు కూడా తమకు సంఘీభావం తెలిపినట్లు ఆయన చెప్పారు. బుధవారం విడుదల కానున్న కత్తి సినిమాను అడ్డుకుని తీరుతామని ఆయన హెచ్చరించారు. -
భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం
నెల్లూరు: శ్రీ పోట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయ మండలం వెంకటరామరాజుపేట సమీపంలో పోలీసులు మంగళవారం భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎర్రచందనం దుంగలతోపాటు వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. అందుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి... స్టేషన్‌కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 6 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. -
టూరిజం గెస్ట్‌హౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు
నాగార్జున సాగర్ : టూరిజం అతిథి గృహాలు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయి. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ టూరిజం గెస్ట్‌హౌస్ విజయ్ విహార్‌లో వ్యభిచారానికి పాల్పడుతున్న ఇద్దరు యువతులు, ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మహిళలు హైదరాబాద్‌కు చెందిన వారిగా ... యువకులను ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కాగా పట్టుబడినవారు వేరువేరు సమయాల్లో రూంలు పొందినట్టు నిర్వాహకులు తెలియజేశారు. పోలీసులకు అనుమానం రాకుడదనే పర్యాటక అతిథి గృహాలను ఎంచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు నిర్వాహకులు సైతం సహకరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.