వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆ ఐదుగురూ కలసి నేరాలు చేశారు. ఒకే డివిజన్‌లో వీరిపై 10 కేసులు నమోదయ్యాయి.
కరీంనగర్: వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆ ఐదుగురూ కలసి నేరాలు చేశారు. ఒకే డివిజన్‌లో వీరిపై 10 కేసులు నమోదయ్యాయి. దొంగిలించిన బైక్‌పై తిరుగుతున్న వీరిని ఓ స్థానికుడు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. ఆ ఒక్క ఆధారమే వారిని కటకటాలపాలు చేసింది. వివరాలు.. కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలానికి చెందిన చితారి శ్రీనివాస్, కొండపల్లి పర్శరాములు, నూనె పర్శరాములు, నిజామాబాద్ జిల్లా బిర్కూర్‌కు చెందిన కదమంచి పాపయ్య, శంకర్ కలసి దొంగతనాలు చేసేందుకు ముఠాగా ఏర్పడ్డారు.
వారంతా జగిత్యాల డివిజన్‌లోని ఐదు మండలాల్లో ఏడాది కాలంలో 9 చైన్‌స్నాచింగ్‌లు, ఒక దోపిడీకి పాల్పడి పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నారు. ఇటీవల వారు ఒక చోట బైక్‌ను తస్కరించి, దానిపై సంచరిస్తున్నారు. వీటిపై అందిన ఫిర్యాదుల మేరకు ప్రత్యేక బృందంగా ఏర్పడిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక వ్యక్తి ఇచ్చిన చిన్న ఆధారం వారికి కీలకంగా మారింది. అదే వారు దొంగిలించిన బైక్..! ఆ వాహనం రూపురేఖల ఆధారంగా మంగళవారం మెట్‌పల్లి సమీపంలో తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన నిందితులు పోలీసులకు దొరికిపోయారు. వారిని ప్రశ్నించటంతో బండారం అంతా బట్టబయలైంది. వారి నుంచి రూ.5.27 లక్షల విలువైన బంగారం, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. క్లూ అందించిన వ్యక్తికి పోలీసు శాఖ తరఫున రూ.10వేలు బహుమానం అందించారు.