
చీరాలటౌన్: కోడలిపై అనుమానం పెంచుకున్న మామ, భర్త మరికొందరు కలిసి విచక్షణ మరచి దారుణంగా హత్య చేసి తర్వాత సాధారణ మరణంగా చిత్రీకరించారు. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే వివాహితురాలిది సాధారణ మరణం కాదని, హత్య చేసి ఆత్మహత్యగా నమ్మించే యత్నం చేసిన వారిని కటకటాల వెనుకకు పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పేరాల హైస్కూల్ రోడ్డులో గత నెల 20న దామర్ల రమ్య అనే వివాహితను భర్త, కుటుంబ సభ్యులు హత్య చేసి ఆత్మహత్యగా నమ్మ బలికించారు. ఎవరికీ తెలియనీయకుండా మృతురాలి మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని పుట్టినిల్లు అయిన తాడేపల్లి గూడెం తరలించి దహనం చేశారు.
అయితే మాస్టర్ వీవర్ కోడలిని కుటుంబ సభ్యులే దారుణంగా హత్య చేశారని ఫిర్యాదు అందడంతో పేరాల వీఆర్వో జోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేరాల హైస్కూల్ రోడ్డులో నివాసముంటున్న దామర్ల శ్రీనుకు తాడేపల్లిగూడెంకు చెందిన రమ్యలకు 8ఏళ్ల క్రితం వివాహమైంది. రమ్యకు పిల్లలు పుట్టలేదని కొంత కాలంగా భర్తతో పాటు మామయ్య, బావ వేధింపులకు గురిచేశారు. గొడ్రాలివి అంటూ సూటిపోటి మాటలతో చిత్రహింసలు చేయడంతో పాటు రమ్యను దారుణంగా హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించి మృతురాలి పుట్టింటికి తీసుకెళ్లి మృతదేహాన్ని అప్పగించారు.
అయితే రమ్య మరణం సాధారణమైంది కాదని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు అందగా వీఆర్వో జోషి తన విచారణలో వచ్చిన అంశాలతో రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రమ్యను భర్త, ఇతర కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. చేనేత వస్త్ర వ్యాపారి కుమారుడితో పాటు అతనికి సహకరించిన మరో ఐదుగురిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా 15 రోజులు రిమాండ్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment