
కేవలం18 లక్షలకే... కేజీ బంగారం
ఏలూరు: రూ. లక్ష ఇవ్వండి రూ. 3 లక్షలు తీసుకోండి... కిలో బంగారం కేవలం రూ. 18 లక్షలే అంటూ జనాన్ని చీటింగ్ చేస్తున్న ఓ ముఠా గుట్టును పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీసులు మంగళవారం రట్టు చేశారు. ముఠాకు చెందిన అయిదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నకిలీ బంగారంతోపాటు అధిక మొత్తంలో నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముఠా సభ్యులను పట్టణంలోని పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తక్కువ నగదు ఇస్తే... అధిక మొత్తంలో నగదు ఇస్తామంటూ గత కొంత కాలంగా జిల్లాలో ఓ ముఠా మోసగిస్తుంది. ఇటీవల కాలంలో ఆ ముఠా ఆగడాలు అధికమైనాయి. దాంతో జల్లాలోని పలు ప్రాంతాల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దాంతో జిల్లావ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులు నిఘాను అధికం చేశారు. ఆ క్రమంలో సదరు ముఠా గుట్టును పోలీసులు మంగళవారం రట్టు చేశారు.