సాక్షి కామారెడ్డి/కామారెడ్డి క్రైం: ఇంటి కోసం ఒకే కుటుంబంలోని ఆరుగురిని దారుణంగా హత్య చేసిన కేసులోని నిందితులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ మంగళవారం మీడియాకు వెల్లడించిన వివరాలిలా.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌కు చెందిన పూనే ప్రసాద్ (36)కు భార్య శాన్విక అలియాస్ రమణి (29), కవల పిల్లలు చైత్రిక (8), చైత్రిక్ (8), తల్లి సుశీల, ఇద్దరు చెల్లెళ్లు స్వప్న (26), శ్రావణి (23) ఉన్నారు. ఓ యువతి ఆత్మహత్య కేసు నేపథ్యంలో ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాక ప్రసాద్ తన కుటుంబంతో కలిసి కామారెడ్డి జిల్లాలోని పాల్వంచకు మకాం మార్చాడు. ఆ కేసు నిమిత్తం డబ్బులు అవసరమై గతంలో తన స్నేహితుడు ప్రశాంత్ నుంచి రూ.3.50 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడు.
ఈమధ్యన ప్రశాంత్ తనకు రావాల్సిన డబ్బులను ప్రసాద్‌ను అడగగా స్వగ్రామం మాక్లూర్‌లోని ఇంటిని తాకట్టు పెట్టి చెల్లిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో రూ.25 లక్షలు విలువ చేసే ప్రసాద్ ఇంటిని సొంతం చేసుకోవాలని ప్రశాంత్ పథకం పన్నాడు. ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రేషన్చేసిస్తే లోన్ తీసుకుని తనకివ్వాల్సిన డబ్బులు తీసుకుని మిగిలిన మొత్తం ఇస్తానని ప్రసాద్‌ను నమ్మించాడు. ప్రసాద్ ఇంటిని రిజిస్ట్రేషన్చేసినప్పటికీ రోజులు గడుస్తున్నా ప్రశాంత్ డబ్బులు ఇవ్వకపోగా, చివరికి హత్య చేయాలని భావించాడు.
రూ.60 వేలకు సుపారీ..
ప్రసాద్‌ను హత్య చేసేందుకు మాక్లూర్ మండలం దుర్గానగర్ తండాకు చెందిన బానోత్ వంశీ, గుగులోత్ విష్ణులకు రూ.60 వేలు ఇచ్చేందుకు ప్రశాంత్ ఒప్పందం చేసుకున్నా డు. గత నెల 29న మాట్లాడుకుందామని నమ్మించి ప్రశాంత్, వంశీ, విష్ణులతో కలిసి ప్రసాద్‌ను కారులో మదనపల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. మద్యం తాగించి కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. అక్కడే గోతిని తవ్వి పాతి పెట్టారు.
ఈనెల 1న పోలీసుల భయంతో ప్రసాద్ ఓ చోట దాక్కున్నాడని, అతను రమ్మన్నాడని చెప్పి భార్య శాన్విక (గర్భవతి), ప్రసాద్ చెల్లెలు శ్రావణిను వెంట తీసుకుని నిజామాబాద్ వెళ్లాడు. శ్రావణిని ఓ చోట ఉంచి శాన్వికను బాసర బ్రిడ్జి సమీపంలోకి తీసుకెళ్లి ఆమె గొంతుకు తాడు బిగించి నిందితులందరూ కలిసి చంపేశారు. ఆమె మృతదేహాన్ని నదిలో పడేశారు.
ఆ వెంటనే శ్రావణి దగ్గరకు వెళ్లి ఆమె ను కారులో ఎక్కించుకుని చేగుంట మండలం వడియారం ప్రాంతంలో హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. మళ్లీ పాల్వంచకు వచ్చి ప్రసాద్ తల్లి సుశీల, మరో చెల్లెలు స్వప్న, ఇద్దరు పిల్లలను ఈనెల 4 న అదే కారులో తీసుకువెళ్లి నిజామాబాద్‌లోని ఓ లాడ్జిలో ఉంచారు. ఆ తర్వాత ప్రశాంత్ ఇంటికి వెళ్లి జరిగిందంతా తన తల్లి వడ్డెమ్మతో చెప్పి సహకరించాలని కోరాగా ఆమె ఒప్పుకుంది.
తప్పించుకున్న తల్లి
ప్రసాద్ పిల్లల్ని చూడాలని అంటున్నాడని సుశీలను, స్వప్నను నమ్మించారు. సుశీల, స్వప్నలను లాడ్జిలోనే ఉంచి ఇద్దరు పిల్లలను ప్రశాంత్, అతని తమ్ముడు తీసుకుని వెళ్లారు. నిర్మల్ వెళ్లే దారిలో ఉండే సోన్ బ్రిడ్జి వద్దకు వెళ్లేలోగా కారులోనే ఇద్దరు పిల్లలను తాడుతో ఉరి బిగించి హత్య చేసి గోనె సంచుల్లో కట్టి వాగులో పడేశారు.
ఈ నెల 13న లాడ్డి నుంచి స్వప్నను కారులో తీసుకువెళ్లిన ప్రశాంత్, మై నర్ బాలుడు, వంశీ కలిసి సదాశివనగర్ మండలం భూంపల్లి సమీపంలోని ప్రధాన రహ దారి పక్కన హత్యచేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. నిందితులు ప్రసాద్ తల్లిని కూడా చంపేయాలని ప్లాన్ చేసినా చివరగా ఆమెకు అనుమానం వచ్చి లాడ్జి నుంచి బయటకు వెళ్లిపోయి తప్పించుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుల గుర్తింపు..
భూంపల్లి వద్ద గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని మరుసటి రోజు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పక్షం రోజుల వ్యవధిలోనే ఒకే తరహా హత్యలు చేగుంట, సదాశివనగర్, మెండోరా (సోన్ బ్రిడ్జి) పీఎస్‌ల పరిధిలో వెలుగు చూడటంతో వాటి మధ్య ఏదైనా లింక్ ఉన్నదా అనే కోణంలో విచారించారు. వందల సంఖ్యలో సీసీ కెమెరాలు పరిశీలించారు.
సెల్‌ఫోన్ టవర్ డంప్, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని మాక్లూర్ కు చెందిన ప్రశాంత్‌గా గుర్తించారు. మంగళవారం నిందితులంతా కలిసి కారులో ప్రసాద్ తల్లిని వెతుకుతూ పాల్వంచకు వెళ్తుండగా పద్మాజీవాడి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment