
తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక అమ్మాయిని మహిళల ఫుట్‌బాల్ జట్టుకు అందించిన ఊరు అది. క్రీడలను ఎంతగానో ప్రేమించే ఆ ప్రాంతం ఎందరినో జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పరిచయం చేసి, క్రీడాకారుల కర్మాగారంగా గుర్తింపు సాధించింది. ఆటగాళ్ల ఊరుగా పేరుపొందిన ఆత్మకూరుపై ఈ కథనం..
తిరుమలరావు కరుకోల, సాక్షి విజయవాడ: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజక వర్గంలోని ఆత్మకూరు క్రీడాకారుల కర్మాగారంగా పేరుపొందింది. ఇక్కడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోకి అడుగుపెడితే చాలు, మూడున్నర ఎకరాల మైదానంలో ఏదో ఒక మూల కొందరు విద్యార్థులు క్రీడల్లో సాధన చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఇక్కడ ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్‌తో పాటు పలు వ్యక్తిగత క్రీడాంశాల్లోనూ శిక్షణ ఇస్తారు. ఇక్కడి స్థానికులు కూడా చాలామంది ఏదో ఒక సమయంలో మైదానానికి వస్తుంటారు. వృద్ధులు నడక కోసం వస్తుంటారు. ఉద్యోగార్థులు శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడానికి వస్తుంటారు. ఇక్కడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2015–16 నుంచి క్రీడల్లో సత్తా చాటుకుంటోంది.
ఈ పాఠశాలలో ఒక గది నిండా క్రీడా పోటీల్లో విద్యార్థులు సాధించిన జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు, క్రీడా సామగ్రి కనిపిస్తాయి. ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్, ఖోఖోతో పాటు అథ్లెటిక్స్ విభాగంలో ఏటా ఇక్కడి విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపికవుతూ వస్తున్నారు. క్రీడల పోటీల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు ప్రతిభ చూపుతుండటం విశేషం. ఇక్కడే చదువుతున్న విష్ణు ప్రణవి, అస్మిత, శ్వేత, రియాన్షిక సాయి, కీర్తిలక్ష్మి ఫుట్‌బాల్‌లో రాణిస్తున్నారు. స్థానిక వ్యాయామ ఉపాధ్యాయుడు గోవర్ధన్ సహకారంతో వీరు శిక్షణలో రాటు దేరారు. నిరంతర సాధనతో ఈ ఐదుగురూ అండర్–13 జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు.
2015–16 నుంచి క్రీడా పరంపర
ఈ పాఠశాలలో క్రీడా పరంపర 2015–16 నుంచి మొదలైంది. ఆ ఏడాది పాఠశాల నుంచి జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ముగ్గురు, క్రికెట్‌కు ఒకరు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌కు పదిమంది, క్రికెట్‌కు ఒకరు ఎంపికయ్యారు. దాంతో విద్యార్థుల్లో క్రీడోత్సాహం పెరిగి, ఖాళీ వేళల్లో మైదానం బాటపట్టారు. వారి ఆసక్తిని గుర్తించిన వ్యాయామ ఉపాధ్యాయుడు గోవర్ధన్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ పాఠశాల నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యే విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఈ పాఠశాల నుంచి 2023–24లో ఫుట్‌బాల్ జాతీయ స్థాయి పోటీల్లో ముగ్గురు, రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ముగ్గురు, అథ్లెటిక్స్‌లో ముగ్గురు ఆడారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఈ సంఖ్య ఏ మేరకు పెరుగుతుందో చూడాలి.
మాస్టర్ అథ్లెట్స్‌లోనూ మేటి
ఆత్మకూరులో విద్యార్థులు, యువతే కాదు, నలభై ఏళ్ల వయసుకు పైబడినవారు సైతం మాస్టర్ అథ్లెట్స్‌లో సత్తా చాటుతున్నారు. ఇక్కడి నుంచి యాభయ్యేళ్లు దాటిన నలుగురు జాతీయస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపికయ్యారు. వీరిలో ట్రిపుల్ జంప్, జావెలిన్ త్రోలో జగన్‌మోహన్ రెడ్డి ప్రథమస్థానంలో నిలిచారు. లాంగ్ జంప్‌లో ద్వితీయస్థానం కైవసం చేసుకున్నారు. అలాగే 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో మహమ్మద్ షఫీ మొదటి స్థానంలో నిలిచారు. వీరిద్దరూ క్రీడల కోటాలోనే కొలువులు సాధించారు. ఇక్కడి నుంచి క్రీడల కోటాలో కేంద్ర, రాష్ట్ర శాఖల్లో కొలువులు సాధించిన వారు దాదాపు ముప్పయి మంది వరకు ఉండటం విశేషం.
ఫొటోలు: ముల్లా ఖాసింవలీ, ఆత్మకూరు, అనంతపురం
జాతీయ ఫుట్‌బాల్‌కు ఏకైక తెలుగమ్మాయి
ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి మందల అనూష జాతీయ స్థాయి ఫుట్‌బాల్ జట్టులో చోటు దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైన తొలి అమ్మాయిగా ఆమె అరుదైన ఘనత సాధించింది. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. వారికి ముగ్గురూ ఆడపిల్లలే! అనూష అందరికంటే చిన్నమ్మాయి. ఆమె అక్కలు చందన, రాజేశ్వరి కూడా ఫుట్‌బాల్ ఆడేవారు. వారికి పెళ్లిళ్లు కావడంతో ఆటకు దూరమయ్యారు. అనూష 2017లో జరిగిన మిక్స్‌డ్ జెండర్ ఫుట్‌బాల్ పోటీల్లో ఉత్తమ క్రీడాకారిణిగా పురస్కారాన్ని అందుకుంది.
బెంగళూరులోని రూట్ క్లబ్ తరఫున 2022లోను, కెంప్ ఫుట్‌బాల్ క్లబ్ తరఫున 2024లోను బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లలో జరిగిన టోర్నీలలో పాల్గొంది. అనంతపురంలో 2024 నవంబర్‌లో జరిగిన జాతీయ ఫుట్‌బాల్ టోర్నీలో సత్తా చాటి, అండర్–20 భారత మహిళా ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైంది. బెంగళూరులో 2024 డిసెంబర్‌లో జరిగిన భారత్–మాల్దీవుల ఫుట్‌బాల్ మ్యాచ్‌లో సత్తా చాటుకుంది.
Comments
Please login to add a commentAdd a comment