అది దట్టమైన అటవీ ప్రాంతం... పక్షుల కిలకిలారావాలు... జలపాతాల గలగల ధ్వనులు ... ఆ అరణ్యంలోని చెట్టుపుట్టగుట్ట అన్నీ శివనామస్మరణ చేస్తున్నట్లుగా భాసిస్తుంది... అణువణువూ ఆ మహాశివుని దివ్యస్వరూపంగానే దర్శనమిస్తుంది... ఈ ప్రాంతం వైఎస్సార్ జిల్లా గోపవరం మండలం మల్లెంకొండ.ఆలయానికి పైకప్పు లేకపోవడం ఇక్కడి ప్రత్యేకత. వైఎస్సార్, నెల్లూరు జిల్లా సరిహద్దుగా ఈ మల్లెంకొండ ఉంది.
ఆలయ విశేషాలు
పరమశివుడు మల్లెం కొండేశ్వరుడిగా ఇక్కడ వెలిశాడని భక్తుల విశ్వాసం. ఇక్కడి కొండలోని గుండాలలో స్నానం చేస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి సత్సంతానం కలుగుతుందని చెబుతారు.
పూలమాల ఆకృతి
ఈ గిరి శిఖరం పూలమాల ఆకారంలో ఉండటం విశేషం. ఈ శిఖరానికి మాల్యాద్రి శిఖరం అని పేరు. ఈ శిఖరం మీద కాశీవిశ్వనాథుడు, మల్లెం కొండేశ్వరుల ఆలయాలు కనువిందు చేస్తాయి. ఆలయం నుంచి మరో 2 కిలోమీటర్లు నడిచి వెళితే... రామసరి జలపాతం మార్గాయాసాన్ని మర్చిపోయేలా చేస్తుంది.
కాకులు కనిపించని కానలు
సాధారణంగా అడవుల్లో జంతువులు, క్రూరమృగాలు, పక్షులు నివసిస్తాయి. కాని ఈ ప్రాంతంలో మాత్రం కాకి కాని, పులి కాని కనిపించదు. అడవుల్లో ఎక్కువగా పెరిగే ఏపి చెట్లు కూడా కనిపించవు. ఇందుకు సంబంధించిన స్థానిక కథనం ఇలా ఉంది... కొండమీద వెలసిన శివుడు, మల్లెం కొండయ్య, అంకమ్మలకు కొన్ని శతాబ్దాల క్రితం పరిసర గ్రామపెద్దలు ఆలయాన్ని నిర్మించాలని నిశ్చయించారట. అంతవరకు మొండి గోడల మధ్యన కొలువుతీరిన ఈ దేవతామూర్తులు ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా ఉండేలా, పైకప్పు నిర్మాణం ప్రారంభించారు. అయితే, పై కప్పు వేసిన మరుసటి రోజే ఆ కప్పు కూలిపోతుండటంతో ఇది ఎలా జరుగుతోందో తెలుసుకుందామని కాపు కాశారట. అర్ధరాత్రప్పుడు ఓ యువకుడు గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చి ఆ కప్పును కూల్చేయడం కనిపించింది. దాంతో గ్రామస్తులు ఆగ్రహంతో అతన్ని పట్టుకుని, ఏపి చెట్ల నారతో చేసిన తాళ్లతో బంధించారట. తాను మల్లెం కొండేశ్వరుడినని, తనకు కానీ ఇక్కడున్న శివుడికి కానీ ఆలయానికి పై కప్పు వేయరాదని చెప్పాడట. అంతేకాకుండా తనను కట్టి వేయడానికి సహకరించిన ఏపి చెట్లు ఈ అడవుల్లో కనిపించకూడదని శపించాడట. మల్లెం కొండయ్యను బంధించినప్పుడు ఓ కాకి ఆయన కళ్లను పొడవబోయిందట. దాంతో ఆ అరణ్యంలో కాకి కానరాకూడదని శపించాడట.
పులి కనిపించని అడవి
ఈ పర్వత ప్రాంతంలో నివసించే ఒక గిరిజన భక్తుడు తన గోవులను మేపుకోవడానికి అడవికి వచ్చేవాడట. అక్కడ సంచరించే పులులు అదను చూసి గోవులపై దాడి చేశాయట. ఆ గిరిజనుడు శివునితో తన గోడు చెప్పుకున్నాడట. శివుడు ఈ అరణ్యంలో పులులు సంచరించరాదని ఆఙ్ఞాపించాడట. అందుకే ఈ అరణ్యంలో నేటికీ పులి కనిపించదు.
రాముడు సైతం...
శ్రీరామచంద్రుడు రావణసంహారం అనంతరం సీతతో కలసి ఈ మాల్యవంత పర్వత ప్రాంతానికి వచ్చాడట. ఇక్కడి ప్రకృతి రమణీయతకు పరవశించి కొంతకాలం ఇక్కడే ఉండిపోయాడట. అప్పుడే మల్లెంకొండలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం. ఈ క్షేత్రానికి ఎనిమిది దిక్కుల్లోనూ నీటి గుండాలను ఏర్పాటు చేశారట.
కొండమీద మల్లెంకొండేశ్వరుని ఆలయం చేరుకోవాలంటే 10 కిలోమీటర్లు దట్టమైన అటవీప్రాంతంలో కొండకోనలు దాటుకుంటూ వెళ్లాలి. కాలినడక తప్ప మరో మార్గం లేదు. దాంతో సంవత్సరంలో ఒక్కశివరాత్రి రోజే.. భక్తులు ఈ ఆలయానికి వెళ్లేవారట. దశాబ్దం క్రితం సుబ్బరాజు అనే భక్తుడు ఆలయ జీర్ణోద్ధరణతో పాటు అక్కడ వసతి, తాగునీరు, సోలార్‌లైట్లు, వంటసామగ్రి ఏర్పాటు చేయడంతో భక్తులు ప్రతివారం వెళుతున్నారు.
ఎలా వెళ్లాలంటే...
నెల్లూరు–కడప జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉంది. కడప జిల్లా బద్వేల్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో బ్రాహ్మణపల్లె గ్రామం నుంచి కొండకు నడిచి వెళ్లాలి. కడప నుంచి బద్వేల్‌కు, బద్వేల్ నుంచి బ్రాహ్మణపల్లెకు బస్సు సౌకర్యం ఉంది. కడప నుంచి 60 కిలోమీటర్లు. నెల్లూరు నుంచి 100 కిలోమీటర్లు. నెల్లూరు నుంచి బద్వేల్ వెళ్లే బస్సులో పి.పి.కుంట వరకు వెళ్లి, అక్కడ నుంచి బ్రాహ్మణపల్లెకు మరో బస్సులో వెళ్లాలి.
– మల్లు విశ్వనాథరెడ్డి సాక్షి, అమరావతి బ్యూరో
Comments
Please login to add a commentAdd a comment