Yamadharmaraja
-
యమ రావణ యుద్ధం
రావణుడు తన అన్న కుబేరుడిని తరిమికొట్టి, లంకను వశపరచుకున్నాడు. అతడి పుష్పక విమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంద్రుడు, వరుణుడు సహా దిక్పాలకులను జయించాడు. నవగ్రహాలను తన అదుపాజ్ఞల్లోకి తెచ్చుకున్నాడు. తనకిక తిరుగులేదనే గర్వంతో లంకను పాలిస్తూ, నానా విలాసాలను అనుభవించసాగాడు.ఒకనాడు రావణుడి సభకు నారదుడు వచ్చాడు. రావణుడు నారదుడికి అతిథి మర్యాదలు చేసి, కుశల ప్రశ్నలు వేశాడు. నారదుడు రావణుడి ఘనతను ప్రశంసిస్తూ, ఇలా అన్నాడు: ‘రావణా! నువ్వు ఇంద్రాది దేవతలను జయించావు. భూలోకంలోని మానవమాత్రులెవరూ నీకు సాటిరారు. భూలోకవాసుల మీద నీ ప్రతాపం చూపించడం శోభస్కరం కాదు. నరకాధిపతి యముడిని కూడా జయించావంటే, నీకు ఇంకెక్కడా ఎదురుండదు, మృత్యుభయం కూడా ఉండదు’ అన్నాడు.రావణుడు నారదుడిని సాగనంపిన తర్వాత, మంత్రులతో చర్చించి, సైన్యాన్ని సిద్ధం చేసుకుని నరకంపై యుద్ధానికి బయలుదేరాడు. నరకానికి చేరుకున్న రావణుడు అక్కడ యమభటుల చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్న పాపుల కష్టాలు చూశాడు. యమభటుల చేతిలో హింసలు అనుభవిస్తున్న పాపులు ఆ బాధలకు ఆర్తనాదాలు చేస్తున్నారు. వారు ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. రావణుడికి వారిపై జాలి కలిగింది. యమభటుల చెర నుంచి వారిని విడిపించడం ప్రారంభించాడు. రావణుడు చేస్తున్న పనిని గమనించిన యమభటులు అతడిపైకి ఆయుధాలతో దూసుకొచ్చారు.వారిని చూసి, రావణుడు వెంటనే పుష్పక విమానంలోకి చేరుకున్నాడు. పుష్పకవిమానం పైకెగిరింది. యమభటులు శూలాలు, గదలు, తోమరాలు, పరిఘలు వంటి నానా ఆయుధాలను పుష్పక విమానం మీదకు విసిరారు. ఆ ఆయుధాల తాకిడికి పుష్పక విమానంలోని ఆసనాలు, వేదికలు, స్తంభాలు ధ్వంసం అయిపోయినా, క్షణాల్లోనే మళ్లీ అవి యథాతథ స్థితికి వచ్చాయి. అక్షయమైన పుష్పక విమానం మహిమకు యమభటులు నివ్వెరపోయారు.రావణుడికి, యమభటులకు మధ్య ఈ రభస కొనసాగుతుండగా, నారదుడు నేరుగా యుముడి వద్దకు చేరుకున్నాడు. ‘యమధర్మరాజా! లంకాధిపతి రావణుడు నీ మీదకు యుద్ధానికి వస్తున్నాడు. నీ కాలదండం ఏం కానుందో!’ అన్నాడు. యుముడితో నారదుడు మాట్లాడుతుండగానే, దూరాన ఆకాశంలో ధగధగలాడుతూ ఎగురుతున్న పుష్పక విమానం కనిపించింది. యమభటులతో కొంతసేపు యుద్ధం సాగించిన రావణుడు, వారి ధాటి శ్రుతి మించుతుండటంతో వారిపై పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. అగ్నిజ్వాలలను చిమ్ముతూ దూసుకొచ్చిన పాశుపతాస్త్రం యమభటులను మిడతల్లా మాడ్చేసింది. నరకంలోని చెట్లను, పొదలను బూడిద చేసింది. యమభటులు అంతం కావడంతో రావణుడు, అతడి మంత్రులు పెద్దపెట్టున సింహనాదాలు చేశారు. వాటిని విన్న యముడు యుద్ధంలో రావణుడు గెలిచాడని అర్థం చేసుకున్నాడు.ఇక తానే రంగంలోకి దూకాలని నిశ్చయించుకుని, తన సారథిని పిలిచి రథాన్ని సిద్ధం చేయమన్నాడు. క్షణాల్లో రథం సిద్ధమైంది. యముడు తన యమపాశాన్ని, కాలదండాన్ని, ముద్గరాన్ని తీసుకుని రథాన్ని అధిరోహించాడు. రథం పుష్పక విమానం దిశగా ముందుకు ఉరికింది. యముడు యుద్ధానికి స్వయంగా బయలుదేరడంతో ముల్లోకాలూ కంపించాయి. యముడి రథం వాయువేగ మనోవేగాలతో నేరుగా రావణుడి పుష్పక విమానం ఎదుట నిలిచింది. యముడి రథాన్ని చూడగానే రావణుడి మంత్రులు భయభ్రాంతులయ్యారు. యుద్ధరంగంలో నిలిచేందుకు ధైర్యం చాలక వారు తలో దిక్కు పారిపోయారు. రావణుడు మాత్రం భయపడకుండా, యముడికి ఎదురు నిలిచాడు. ఇద్దరికీ ఏడు పగళ్లు, ఏడు రాత్రులు ఏకధాటిగా యుద్ధం జరిగింది. యముడు అనేక దివ్యాస్త్రాలను ప్రయోగించి, రావణుడిని తీవ్రంగా గాయపరచాడు.రెచ్చిపోయిన రావణుడు కూడా యముడి మీదకు శరపరంపర కురిపించి, గాయపరచాడు. యముడి సారథిని కూడా తీవ్రంగా బాధించాడు. యమ రావణుల యుద్ధాన్ని గమనిస్తూ వచ్చిన మృత్యుదేవత యముడి ముందుకు వచ్చి నిలిచింది. ‘యమధర్మరాజా! నువ్వెందుకు శ్రమించడం? వీడితో యుద్ధానికి నన్ను ఆదేశించు! క్షణాల్లో వీడిని చంపేస్తాను’ అంది. ‘నువ్వు ఊరికే చూస్తూ ఉండు. వీణ్ణి నేనే చంపేస్తాను’ అంటూ యముడు తన కాలదండాన్ని పైకెత్తాడు. కాలదండం నిప్పులు చిమ్ముతూ భయంకరంగా ఉంది. యముడు కాలదండాన్ని రావణుడి మీదకు విసరబోతుండగా, బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ‘యమధర్మరాజా! కాలదండాన్ని ప్రయోగించకు. నీ కాలదండంతో వీడు మరణిస్తే, నేను వీడికిచ్చిన వరం వ్యర్థమవుతుంది’ అన్నాడు. బ్రహ్మదేవుడి మాట మన్నించిన యముడు తన కాలదండాన్ని ఉపసంహరించుకున్నాడు. రావణుణ్ణి చంపడానికి అవకాశం లేకపోవడంతో యుద్ధరంగంలో ఏం చేయాలో తోచక రథంతో సహా అదృశ్యమై, బ్రహ్మదేవుడి వెంట సత్యలోకానికి వెళ్లిపోయాడు.యముడు అదృశ్యం కావడంతో రావణుడు తాను నరకాన్ని జయించినట్లు ప్రకటించుకున్నాడు. అక్కడి నుంచి పుష్పక విమానంలో బయలుదేరి లంకకు చేరుకున్నాడు.∙సాంఖ్యాయన -
సాయపు చేతులు..!
యమదూతలు ఓ మనిషిని తీసుకొచ్చి యమలోకాన యమ ధర్మరాజు ఎదుట నిలబెట్టారు. ఆ మనిషి ఎంతో దిగాలు ముఖం వేసుకుని నిల్చున్నాడు. పక్కనే చిత్రగుప్తుడు ఆ మనిషి ఖాతాను తరచి చూస్తున్నాడు. అతను ఏం తప్పు చేశాడని యమధర్మరాజు అడిగాడు. చిత్రగుప్తుడు అదే పనిగా అతని గురించి నమోదు చేసిన పేజీలను చదువుతుంటే తలతిరుగుతోంది. అంతా విన్నాడు యమధర్మరాజు.‘అతనిని నరకలోకంలో పడేయండి’ అన్నాడు యముడు. వెంటనే చిత్రగుప్తుడు అడ్డు తగిలి ఇలా అన్నాడు: ‘అతను అన్ని పాపాలు చేసిన ప్పటికీ ఒకే ఒక్క పుణ్యం చేశాడు. ఓరోజు ఓ వృద్ధురాలు గుడికి వెళ్ళడా నికి దారి అడిగితే చూపుడు వేలుతో దారి చెప్పడమే కాకుండా ఆమె చేయి పట్టుకుని వెళ్ళి దిగబెట్టాడు’. ఆ మాటతో యముడు తన తీర్పుని అప్పటికప్పుడు మార్చు కున్నాడు. ‘అతని చేతికి గంధం పూసి ముందుగా స్వర్గానికి తీసుకుపోండి. అనంతరం అతనిని నరకానికి తరలించవచ్చు’ అని ఆదేశించాడు.కర్ణుడు వంటి పుణ్యాత్మునికీ మరణానంతరం ఓ సమస్య ఎదురయ్యింది. ఆయన మహాదాత. అయితే ఆయన ధన రాశులను, వస్తువులనే ఇచ్చాడు. ఆకలిగొన్నవారి ఆకలి తీర్చిన చరిత్ర ఆయనకు లేదు. నిర్యాణానంతరం కర్ణుడు స్వర్గానికే వెళ్లాడు. స్వర్గానికి వెళ్ళే వారికి ఆకలి అనేది ఉండదు. కానీ కర్ణుడికి ఆకలి వేసింది. ఓమారు కర్ణుడు ‘నాకు మాత్రమే ఎందుకు ఆకలి వేస్తోంది’ అని స్వర్గ లోక ద్వార పాలకుని అడిగాడు. అప్పుడతను ‘నువ్వు భూలోకంలో ఎవరికీ అన్నదానం చేయలేదు. అందుకే నీకు ఆకలి వేస్తోంద’ని చెప్పాడు. ‘మరిప్పుడు ఏం చేయాలి. ఆకలి ఎక్కువై భరించలేకపోతు న్నాను’ అన్నాడు కర్ణుడు. వెంటనే ద్వారపాలకుడు ‘కర్ణా, నీ చూపుడు వేలుని నోట పెట్టుకో. ఆకలి తగ్గిపోతుంది’ అన్నాడు. కర్ణుడు అలాగే చేశాడు. ఆకలి పోయింది. ఇందుకు కారణమేమిటి?ఓసారి కృష్ణుడి సన్నిహితులకు కర్ణుడు అన్నం తినడానికి ఓ చోటును తన చూపుడు వేలుతో చూపించాడట. అది కాస్తా ఓ పుణ్య కార్యంగా కర్ణుడి ఖాతాలో జమైంది. పురాణాలు, ఇతిహాసాలలో పేర్కొన్న ఇటువంటి కథలను నమ్మవచ్చా, అసలు స్వర్గ–నరకాలు ఉన్నాయా అంటూ చర్చోప చర్చలు ఇక్కడ అనవసరం. మనిషిగా పుట్టినవాడు సాటి మనిషికి సాయం చేయడం అతడి కనీస ధర్మం అని తెలియచేయడానికి ఇటువంటి కథలు వాహకాలుగా నిలుస్తాయి. మానవ విలువలను ప్రోది చేసే భారతీయ తత్త్వం సర్వదా ఆచరణీయం. – యామిజాల జగదీశ్ -
భగీరథ యమధర్మరాజ సంవాదం
పూర్వం భగీరథ చక్రవర్తి సమస్త భూమండలాన్ని పరిపాలిస్తుండేవాడు. ధర్మాత్ముడు, పరాక్రమవంతుడు అయిన భగీరథుడు నిత్యం తన రాజ్యంలో యజ్ఞయాగాది క్రతువులను జరిపించేవాడు. ఆయన రాజ్యం సర్వసుభిక్షంగా ఉండేది. రాజ్యంలోని ప్రజలెవరూ ధర్మం తప్పేవారు కాదు. భగీరథుడి కీర్తిప్రతిష్ఠలు ముల్లోకాలకూ వ్యాపించాయి. భగీరథుడి కీర్తిప్రతిష్ఠలు విని యమధర్మరాజు ఒకసారి ఆయనను స్వయంగా కలుసుకోవాలనుకున్నాడు. ఒకనాడు యమధర్మరాజు భగీరథుడి వద్దకు వచ్చాడు. భగీరథుడు ఎదురేగి యమధర్మరాజుకు స్వాగతం పలికాడు. ఘనంగా అతిథి సత్కారాలు చేశాడు. భగీరథుడి సేవలకు యమధర్మరాజు సంతృప్తి చెందాడు. ‘భగీరథా! నువ్వు చాలా ధర్మాత్ముడివి. నీ కీర్తి ముల్లోకాలకూ వ్యాపించింది. అది వినే నేను నిన్ను స్వయంగా కలుసుకోవాలని వచ్చాను. నీ జీవితం మానవులందరికీ ఆదర్శప్రాయం’ అని ప్రశంసించాడు. ‘సమదర్శీ! నా మీద నీ అనుగ్రహానికి ఆనందభరితుణ్ణవుతున్నాను. అయితే, నాకు కొన్ని ధర్మసందేహాలు ఉన్నాయి. సకలలోక ధర్మాధర్మ విచక్షణాదక్షుడవైన నువ్వే నా సందేహాలను తీర్చగలవు. అవేమిటంటే, ధర్మాలంటే ఏవి? ధర్మాచరణ చేసేవారికి ఎలాంటి లోకాలు ప్రాప్తిస్తాయి? దయచేసి వివరించు’ అని వినయంగా అడిగాడు భగీరథుడు. ‘ధర్మం అనేది రకరకాలుగా ఉంటుంది. ధర్మం గురించి సంపూర్ణంగా చెప్పాలంటే లక్ష సంవత్సరాలైనా సరిపోవు. అయినా నువ్వు అడిగావు కాబట్టి సూక్ష్మంగా చెబుతున్నాను విను. లోకంలో బ్రాహ్మణులకు, ఆధ్యాత్మికవేత్తలకు చేసే దానం అత్యుత్తమమైనది. స్వయంగా కూప తటాకాది జలాశయాలు తవ్వినా, ఇతరులను నియమించి తవ్వింపచేసినా వచ్చే పుణ్యఫలం అనంతం. బావులు, చెరువులు తవ్వే పనిలో స్వల్పమైన సాయం చేసినా గొప్ప పుణ్యఫలం దక్కుతుంది. ఇందుకు ఉదాహరణగా నీకు వీరభద్ర మహారాజు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పాడు: పూర్వం గౌడదేశాన్ని వీరభద్రుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతడు మహాదానశీలి, ధర్మాత్ముడు, అమిత పరాక్రమవంతుడు. వీరభద్రుడి భార్య చంపకమంజరి. వీరభద్రుడు ప్రతినిత్యం యజ్ఞయాగాదులు నిర్వర్తించేవాడు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడేవాడు. వీరభద్రుడి రాజ్యంలో ప్రజలందరూ ధర్మబద్ధులై ఉండేవారు. అతడి మంత్రులందరూ విద్యావంతులు, ధర్మాధర్మ విచక్షణ కలిగిన విజ్ఞులు కావడంతో పరిపాలన సజావుగా సాగేది. వీరభద్రుడి రాజ్యం భూతలస్వర్గంగా ప్రసిద్ధి పొందింది. ఒకనాడు వీరభద్రుడు తన మంత్రులు, పరివారంతో కలసి సమీప అరణ్యానికి వేటకు బయలుదేరాడు. మధ్యాహ్నం వరకు వేట కొనసాగించారు. మధ్యాహ్నవేళ వీరభద్రుడు సహా అతడి పరివారమంతా బాగా అలసట చెందారు. అందరికీ విపరీతమైన దాహం వేయసాగింది. సమీపంలో నీటిజాడ ఎక్కడైనా కనిపిస్తుందేమోనని అందరూ వెదకసాగారు. కొంత దూరం ముందుకు వెళ్లాక కొండ మీద ఒక చెరువు కనిపించింది. అక్కడకు వెళ్లి చూశారు. చెరువులో చుక్క నీరైనా లేదు. ‘అసలు ఇంత ఎత్తులో ఎవరు ఈ చెరువు తవ్వించారు? ఇందులో నీళ్లు ఎందుకు లేవు?’ అని స్వగతంగా అన్నాడు వీరభద్రుడు. అక్కడే ఉన్న వీరభద్రుడి మంత్రి బుద్ధిసాగరుడు చెరువును మరికొంత లోతుకు తవ్వమని భటులను పురమాయించాడు. మూడడుగులు తవ్వేసరికి చెరువులోకి నీళ్లూరాయి. చెరువు కొంతవరకు నీళ్లతో నిండింది. అందరూ ఆ చెరువులో నీళ్లు తాగి సేదదీరారు. ‘మహారాజా! ఈ చెరువు వానాకాలంలోనే నిండేలా ఎవరో తవ్వించారు. మరికొంత లోతుకు తవ్విస్తే సర్వకాలాల్లోనూ ఇందులో నీళ్లు నిలిచి ఉంటాయి. బాటసారులకు దాహార్తి తీర్చేలా ఈ చెరువు మరింత లోతుకు తవ్వించేందుకు అనుమతించండి’ అన్నాడు బుద్ధిసాగరుడు. అందుకు వీరభద్రుడు సరేననడంతో మంత్రి బుద్ధిసాగరుడు దగ్గర ఉండి భటులతో చెరువును మరింత లోతుగా తవ్వించాడు. దానికి పటిష్ఠంగా రాతిగోడలు నిర్మించారు. కొంతకాలానికి ఆయుష్షుతీరి బుద్ధిసాగరుడు, వీరభద్రుడు నా లోకానికి వచ్చారు. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యాల చిట్టాను పరిశీలించి, కొండ మీద తటకాన్ని తవ్వించిన వారి మహత్కార్యాన్ని నాకు చెప్పాడు. ధర్మవిమానంలో వారు స్వర్గానికి వెళ్లడానికి అర్హులని గ్రహించి, వారిని విమానంలో స్వర్గానికి పంపాను. స్వర్గానికి బయలుదేరే ముందు వారు నన్ను కొండ మీద ఆ చెరువు చరిత్ర చెప్పమని అడిగారు. ‘పూర్వం సైకతపర్వతం మీద ఈ చెరువు ఉన్నచోట ఒక లకుముకి పిట్ట తన ముక్కుతో రెండంగుళాలు తవ్వింది. కొంతకాలానికి ఒక వరాహం అక్కడకు వచ్చి, తన ముట్టెతో రెండు మూరలు తవ్వింది. దాంతో అందులోకి అప్పుడప్పుడు కొంత నీరు చేరసాగింది. చుట్టుపక్కల వన్యప్రాణులు అందులోని నీరుతాగుతూ దాహార్తి తీర్చుకునేవి. మూడేళ్లు గడిచాక ఒక ఏనుగుల గుంపు వచ్చి, దానిని మరింత లోతుగా తవ్వడంతో చిన్న చెరువుగా మారింది. అప్పటి నుంచి ఏటా వానాకాలంలో ఆ చెరువు పూర్తిగా నీటితో నిండసాగింది. మీరు వేసవి ప్రారంభంలో వేటకు వెళ్లడం వల్ల ఆ చెరువు ఎండిపోయి కనిపించింది. అంతకు ముందు అందులోకి నీరు ఇంకి ఉండటం వల్ల కొద్ది లోతు తవ్వగానే నీరు దొరికింది. వీరభద్రా! నీ మంత్రి సూచనతో నువ్వు ఆ చెరువును మరింత లోతుగా తవ్వించి, పటిష్ఠంగా గోడ నిర్మించి, ఏడాది పొడవునా నీరు నిలిచేలా చేశావు. ఈ పనిచేసినందుకు నువ్వు, నీ మంత్రి, నీ పరివారం అభినందనీయులు’ అని చెప్పి ధర్మవిమానంలో వారిని స్వర్గానికి సాగనంపాను. ‘భగీరథా! తటాకాలను తవ్వించిన వారికి సమస్తపాపాలూ నశించి, అనంత పుణ్యఫలం లభిస్తుంది’ అని చెప్పాడు యమధర్మరాజు. భగీరథుడు ప్రణమిల్లి, అతడికి సాదరంగా వీడ్కోలు పలికాడు. ఇవి చదవండి: హెల్త్: గుటక వేయడం కష్టమవుతోందా? అయితే ఇలా చేయండి.. -
యమధర్మరాజుకి ప్రత్యేక పూజలు
-
ఆశీర్వచన బలం
పూర్వం మృకండుడు, మరుద్వతి అనే ముని దంపతులుండేవారు. వారికి సంతానం లేకపోవడంతో మృకండుడు శివుని గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ‘‘నీకు పదహారేళ్ళ వయసు వరకు జీవించే కుమారుడు జన్మిస్తాడు’’ అని వరమిచ్చాడు. ఆ కుమారుడికి మార్కండేయుడని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకోసాగారు ఆ దంపతులు. ఆ దంపతులు తమ కుమారునికి బాల్యం నుంచి పెద్దలందరికీ పాదనమస్కారాలు చేయడం అలవాటు చేశారు. మార్కండేయుడు అలా నమస్కరించిన ప్రతిసారీ, అతన్ని ‘దీర్ఘాయుష్మాన్భవ’ అని దీవించేవారు. చూస్తుండగానే మార్కండేయునికి పదిహేనవ సంవత్సరం వెళ్లి పదహారవ సంవత్సరం వచ్చింది. మరికొది ్దరోజులలో తమ కుమారుడి ఆయుర్దాయం తీరిపోతోందని తెలిసి మృకండ దంపతులు తమలో తామే కుమిలిపోసాగారు. తల్లిదండ్రుల వద్ద విషయం తెలుసుకున్న మార్కండేయుడు ‘‘నన్ను ఆశీర్వదించండి. శివుని గూర్చి తపస్సు చేస్తాను. ఆ బోళాశంకరుడు నన్ను కరుణించబోడు. మీరు బెంగ పెట్టుకోకండి’ అని చెప్పి హిమాలయాలకు వెళ్లి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి చిన్న దేవాలయం నిర్మించి అక్కడ కూర్చుని తపస్సు మొదలు పెట్టాడు. ఆ బాలుడి ఆయువు తీరే సమయం అసన్నం కావడంతో యమదూతలు వెళ్లారు. అయితే, మార్కండేయుని మెడలో పాశం వెయ్యడానికి భయం వేసి వెనుతిరిగి వెళ్ళిపోయారు. అపుడు యముడు తానే స్వయంగా వెళ్లి, ‘ఓ బాలకా! బయటకు రా! నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను’ అన్నాడు. మార్కండేయుడు భయంతో శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. యముడు పాశాన్ని మార్కండేయుడి మెడలోకి విసిరి బలంగా లాగాడు. పాశం శివలింగానికి తగిలింది. అంతే! శివలింగం ఫెటిల్లున పేలిపోయి శంకరుడు ఆవిర్భవించి తన ఎడమ కాలితో యమధర్మరాజు వక్షస్థలంపై ఒక్క తన్ను తన్నేటప్పటికి యముడు విరుచుకు పడిపోయాడు. శివుడు మార్కండేయునితో ‘‘నీ భక్తికి మెచ్చాను. వరం కోరుకో’’ అన్నాడు. మార్కండేయుడు ‘‘స్వామీ! పాపం! యముడు భయకంపితుడై ఉన్నాడు. ఆయనను కరుణించండి’’ అన్నాడు. శంకరుడు ప్రసన్నుడై చూడగా యమధర్మరాజు లేచి నమస్కరించి ‘‘స్వామీ, నువ్వు ఈ బాలుడికి పదహారు సంవత్సరాలు ఆయుర్దాయం మాత్రమే ఉంటుందని చెప్పావు. నేను చేసిన దోషం ఏమిటి? చెప్పవలసింది’ అన్నాడు. శివుడు మందహాసం చేసి ‘‘ఎప్పుడూ పదహారేళ్ళు వయస్సు ఉండే పిల్లవాడిని నేను వాళ్లకి ఇచ్చాను. నువ్వు పదహారేళ్ళే అని అర్థం చేసుకోవడమే నీ దోషం. అందుకని ఇలా జరిగింది. ఏమీ బెంగలేదు. వెళ్ళు’’ అన్నాడు.‘‘నాయనా! మార్కండేయాయుష్షు అనే కొత్త ఆయుష్షును సృష్టించి నీకు ఇస్తున్నాను. చిరంజీవివై ఉండు’’ అని ఆశీర్వదించాడు.పెద్దల ఆశీర్వచనం, భగవంతునిపట్ల నిర్మల భక్తి ఎప్పటికీ వృథాపోవన్నది ఇక్కడ తెలుసుకోవలసిన నీతి. – డి.వి.ఆర్. భాస్కర్ -
శిబిచక్రవర్తి దాతృత్వం
పురానీతి విశ్వవిఖ్యాతి పొందిన మహాదాతలలో శిబిచక్రవర్తి పేరును ముందుగా చెప్పుకోవాలి. ధర్మనిరతిలోను, దానగుణంలోను శిబిచక్రవర్తి పేరు ప్రఖ్యాతులు దేవలోకం వరకు వ్యాపించాయి. అయితే, శిబిచక్రవర్తి నిజంగానే ధర్మనిరతి గలవాడా? దానగుణ సంపన్నుడా? ఇదేదో తేల్చుకోవాలంటే అతడికి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు యమధర్మరాజు. ఈ విషయంలో అతడికి తోడుగా ఉండటానికి సిద్ధపడ్డాడు దేవేంద్రుడు. ఈ సంగతి తెలియని శిబి చక్రవర్తి ఒకరోజు తన రాజప్రాసాదం మేడ మీద కూర్చుని ప్రకృతిని తిలకిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచో ఒక పావురం శరవేగంగా ఎగురుకుంటూ వచ్చి ఆయన చెంత వాలింది. ఈలోగా దానిని తరుముతూ ఒక గద్ద వచ్చింది. అనుకోని పరిణామానికి నివ్వెరపోయాడు శిబిచక్రవర్తి. ప్రాణభయంతో వణుకుతున్న పావురం ‘రాజా! నన్ను నీవే కాపాడాలి’ అంటూ మొరపెట్టుకుంది. ‘తప్పక కాపాడతాను. నా రాజ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనులకు రక్షణ ఉంటుంది’ అని భరోసా ఇచ్చాడు. పావురాన్ని తరుముతూ వచ్చిన గద్ద ఊరుకోలేదు. ‘రాజా! నేను ఆకలితో అలమటిస్తున్నాను. ఆ పావురం నా సహజ ఆహారం. దానిని వదిలేస్తే నా ఆకలి తీర్చుకుంటాను’ అని అడిగింది. ‘రక్షణ కల్పిస్తానని పావురానికి నేను మాట ఇచ్చాను. దానిని వదల్లేను. నీ ఆకలి తీర్చుకోవడానికి మరేది అడిగినా ఇస్తాను. పావురాన్ని వదిలేయి’ అని బదులిచ్చాడు శిబిచక్రవర్తి. ‘రెండు షరతులకు అంగీకరిస్తే పావురాన్ని వదిలేస్తాను’ అని చెప్పింది గద్ద. సరేనన్నాడు శిబిచక్రవర్తి. షరతులేమిటో చెప్పమన్నాడు. ‘పావురం బరువుకు సమానమైన మాంసాన్ని నీ శరీరం నుంచే కోసి ఇవ్వాలి. మాంసం ఇస్తున్నప్పుడు నువ్వు కంటతడి పెట్టరాదు’ అంది గద్ద. షరతులకు అంగీకరించాడు శిబిచక్రవర్తి. వెంటనే ఒక తక్కెడను, తన శరీరం నుంచి మాంసాన్ని కోసేందుకు కత్తిని తెప్పించాడు. గుప్పెడు మాంసం కోసిస్తే పావురం బరువుకు సరిపోతుందనుకున్నాడు. తన కుడితొడ నుంచి గుప్పెడు మాంసం కోసి తక్కెడలోని ఒకవైపు పళ్లెంలో వేశాడు. మరోవైపు పళ్లెంలో పావురాన్ని నిలిపాడు. పావురమే బరువు తూగింది. మరికొంత మాంసాన్ని తీసి వేశాడు. అయినా పావురమే బరువు తూగింది. శిబి చక్రవర్తి తన శరీరంలోని కుడివైపు ఉన్న మాంసమంతా తక్కెడలో వేసేశాడు. అయినా పావురమే బరువు తూగింది. ఇదేదో మాయలా ఉందనుకున్నాడు. అయితే, ఏదైనా కానీ తాను మాత్రం ధర్మానికి కట్టుబడే ఉండాలనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో శిబిచక్రవర్తి ఎడమకంట ఒక కన్నీటి బిందువు ఉబికింది. దానిని చూడగానే గద్ద... ‘రాజా! నీవేదో అయిష్టంగా నీ మాంసాన్ని ఇస్తున్నట్లున్నావు. అలాగైతే నీ మాంసం నాకు అక్కర్లేదు. నీ అండలోని పావురాన్ని వదిలేస్తే శుభ్రంగా తినేసి పోతా. నీ శరీరం తిరిగి పూర్వస్థితికి వచ్చేలా చేస్తా’ అంది. ‘పక్షిరాజా! నువ్వు పొరబడుతున్నావు. నీ ఆకలితీర్చే అదృష్టం నా శరీరంలోని కుడిభాగానికి దక్కినందుకు ఎడమభాగం ఆనందంతో పులకిస్తోంది. అందుకే నా ఎడమకన్ను ఆనందబాష్పాన్ని చిందిస్తోంది. నీ ఆకలి తీర్చడానికి నా శరీరంలోని ఎడమభాగం కూడా సిద్ధంగా ఉంది. చూడు! ఎడమభాగంలోని మాంసాన్ని కూడా వేసేస్తాను’ అంటూ మళ్లీ కత్తికి పనిచెప్పబోయాడు. శిబిచక్రవర్తి ధర్మనిరతికి, దానగుణానికి సంతోషించిన దేవతలు పూలవాన కురిపించారు. అతడి శరీరానికి పూర్వరూపం ఇచ్చారు. గద్దరూపంలో ఉన్న యమధర్మరాజు. పావురం రూపంలో ఉన్న ఇంద్రుడు తమ నిజరూపాలతో ప్రత్యక్షమయ్యారు. ‘ఇదంతా నీ ధర్మనిరతిని పరీక్షించేందుకు ఆడిన నాటకం’ అని చెప్పి అంతర్ధానమయ్యారు. నీతి: ఎట్టి పరిస్థితుల్లోనైనా మాట తప్పకపోవడమే ధర్మం.