అది 1971, డిసెంబర్ 16.. భారతదేశ చరిత్ర పుటల్లో గర్వకారణంగా నిలిచిన రోజు. ఆ రోజున భారతదేశం యుద్ధంలో పాకిస్తాన్‌కు ఘోరమైన ఓటమి ఎలా ఉంటుందో చూపింది. నాటి యుద్ధంలో సుమారు 3,900 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందగా, 9,851 మంది గాయపడ్డారు. యుద్ధం అనంతరం 93 వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. ఈ నేపధ్యంలోనే తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా, బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించింది.
నాటి యుద్ధంలో బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన పలువురు వీర సైనికులు పాకిస్తాన్ సేనను ధైర్యంగా ఎదుర్కొని, వారిని మట్టికరిపించారు. ప్రతీయేటా డిసెంబర్ 16 రాగానే.. నాటి యుద్ధంలో పాల్గొని, పాక్ సైనికులను ఓడించిన వీర జవాన్లకు నాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి.
నాటి యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికుడు మీడియాతో మాట్లాడుతూ ‘నేను యుద్ధం ప్రారంభమైనప్పుడు లక్నోలో వైర్‌లెస్ ఆపరేటర్‌గా పని చేశాను. నాడు నన్ను బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు పంపారు. అక్కడ మా ఎనిమిది మంది సైనికుల బృందం పాకిస్తాన్ సైనికుల కాన్వాయ్‌పై మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో పలువురు పాకిస్తానీ సైనికులు మరణించారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో మేము స్పృహ కోల్పోయాం. నేను చనిపోయానని సైన్యం భావించి, మా ఇంటికి టెలిగ్రామ్ పంపింది. అయితే ఆ తర్వాత నేను స్పృహలోకి రాగానే, నేను బతికే ఉన్నానంటూ మా ఇంటిలోనివారికి సైన్యం తిరిగి మరో సందేశం పంపింది’ అని తెలిపారు.
మరో సైనికుడు తన యుద్ధ అనుభవాలను మీడియాతో పంచుకుంటూ ‘యుద్ధం జరుగుతున్న సమయంలో నేను ఢాకాలో ఉన్నాను. రాత్రంతా వైర్‌లెస్ బ్యాటరీని ఛార్జ్ చేసేవాడిని. కరెంటు లేకపోవడంతో జనరేటర్‌తో పని చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో మేము నిత్యం అప్రమత్తంగా ఉన్నాం. పాకిస్తాన్ సైనికులు ఎప్పుడైనా దాడి చేయవచ్చనే భావనతో ఉండేవాళ్లం’ అని తెలిపారు. నాడు భారత సైనికులు ప్రదర్శించిన ధైర్యం అందరికీ ఎనలేని స్ఫూర్తినిస్తుంది. నాటి యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందిన సైనికులకు ప్రతి ఏటా డిసెంబర్ 16న దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తారు.
ఇది కూడా చదవండి: Mahakumbh 2025: లక్షలాది రుద్రాక్షలు ధరించి ప్రయాగ్‌రాజ్‌కు..
Comments
Please login to add a commentAdd a comment