ముందున్న సవాలు | Sakshi Editorial On Syria | Sakshi
Sakshi News home page

ముందున్న సవాలు

Published Tue, Dec 10 2024 12:27 AM | Last Updated on Tue, Dec 10 2024 12:27 AM

Sakshi Editorial On Syria

21వ శతాబ్దంలో అత్యంత దీర్ఘకాలం సాగిన యుద్ధం... లక్షలాది ప్రజల ప్రాణాలు తీసి, మరెందరినో వలస బాట పట్టించి, శరణార్థులుగా మార్చిన యుద్ధం... ఎట్టకేలకు ఒక ముగింపునకు వచ్చింది. సంక్షుభిత సిరియా చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. అధ్యక్షుడు బషర్‌ – అల్‌ – అసద్‌ పాలనకు ఆదివారం ఆకస్మికంగా తెరపడడంతో సిరియాలో అంతర్యుద్ధం కొత్త మలుపు తిరిగింది. 

అలెప్పో, హమా, హామ్స్‌ల తర్వాత డమాస్కస్‌ సైతం తిరుగుబాటు శక్తుల వశం కావడంతో సిరియా రాజకీయ, సైనిక దృశ్యం సమూలంగా మారిపోనుంది. ఈ పరిణామాల ప్రభావం ఆ ప్రాంతమంతటా కనిపించనుంది. దాదాపు 53 ఏళ్ళ పైచిలుకు నిరంకుశ కుటుంబ పాలన పోయినందుకు సిరియన్లు సంబరాలు చేసుకుంటున్నా, తరువాతి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

తిరుగుబాటు తర్వాత డమాస్కస్‌లో సాగుతున్న విధ్వంసం, లూటీ దృశ్యాలు 2021లో అఫ్ఘానిస్తాన్‌లో జరిగిన సంఘటనల్ని తలపిస్తున్నాయి. అక్కడ తాలిబన్ల లానే ఇక్కడ ఇస్లామిస్ట్‌ బృందాలు సైతం గద్దెనెక్కాక వెనకటి గుణం మానక నిజ స్వభావం చూపిస్తాయని భయాందోళనలు రేగుతున్నాయి. వెరసి, అసలే రగులుతున్న పశ్చిమాసియా కుంపటికి కొత్త సెగ వచ్చి తోడైంది. 

చరిత్ర గమనిస్తే, ప్రజాగ్రహ ఉద్యమం 2011 మార్చిలోనే సిరియాను తాకింది. ఎప్పటికప్పుడు కూలిపోవడం ఖాయమని భావించినా, అసద్‌ ఏలుబడి వాటన్నిటినీ తట్టుకొని, దాటుకొని వచ్చింది. జనాగ్రహాన్ని ఎదుర్కొనేందుకు ఆయన తీవ్ర హింసకు పాల్పడ్డారు. స్వదేశీయులపైనే ఒక దశలో రసాయన ఆయుధాలు వాడినట్లు ఆరోపణలూ వచ్చాయి. 

సిరియాకు ఆయన పీడ ఎప్పుడు వదులుతుందా అని ఎదురుచూస్తున్న పరిస్థితి తెచ్చాయి. దాదాపు దశాబ్ద కాలం దూరం పెట్టాక, అరబ్‌ ప్రపంచం గత ఏడాది మళ్ళీ చేరదీయడం అసద్‌కు కలిసొస్తుందని భావించారు. అయితే, అరబ్‌ రాజ్యాలు తమ స్వలాభం కోసమే ఆ పని చేశాయి. అసద్‌ పోతే వచ్చే తెలియని దేవత కన్నా తెలిసిన దయ్యం మేలని భావించాయి. 

వారం రోజుల క్రితం దాకా ఈ పాలనకు చరమగీతం తథ్యమని ఎవరూ ఊహించ లేదు. రష్యా, ఇరాన్, హెజ్బుల్లాల అండతో అసమ్మతిని అణచివేస్తూ, అసద్‌ అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. అయితే, కొద్ది రోజుల క్రితం ఒక్కసారిగా మళ్ళీ తిరుగుబాటు బృందాలు విజృంభించడంతో నాటకీయంగా కథ అడ్డం తిరిగింది. 

ఒక పక్క ఉక్రెయిన్‌తో పోరాటం నేపథ్యంలో రష్యా వైమానిక సాయం ఉపసంహరించుకోగా, మరోపక్క ఇజ్రాయెల్‌తో యుద్ధం వల్ల హెజ్బొల్లా వనరులు క్షీణించాయి. ఇదే అదనుగా ఇస్లామిస్ట్‌ గ్రూప్‌ హయత్‌ – తహ్రీర్‌ అల్‌ – షామ్‌ (హెచ్‌టీఎస్‌) సారథ్యంలోని తిరుగుబాటుదారులు చకచకా ముందుకు చొచ్చుకువచ్చారు. 

అసద్‌కు పట్టున్న ప్రాంతాలన్నీ కైవసం చేసుకుంటూ, ఆఖరికి అధికార పీఠానికి ప్రతీక అయిన డమాస్కస్‌ను చేజిక్కించుకోవడంతో ఏళ్ళ తరబడి సాగుతున్న నియంతృత్వానికి తెరపడింది. పదవీచ్యుతుడైన అధ్యక్షుడు విమానంలో పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. అసద్‌ పదవీచ్యుతి ప్రభావం ప్రాంతీయంగా గణనీయమైనది. 

ఆ ప్రాంతంలో ఇంతకాలంగా స్నేహంగా మెలిగిన కీలక దేశం సిరియాలో అనుకూల పాలన పోవడం ఇరాన్‌కు వ్యూహాత్మకంగా ఇబ్బందికరమే. మరోపక్క హెజ్బుల్లా భవిష్యత్తూ అనిశ్చితిలో పడింది. తిరుగుబాటుదారులకు తెర వెనుక అండగా నిలిచిన టర్కీ ఇప్పుడిక అక్కడ చక్రం తిప్పే సూచనలున్నాయి. అయితే, టర్కీ ప్రయోజనాలకూ, ప్రాంతీయ శక్తులకూ మధ్య వైరుద్ధ్యం తలెత్తితే ఉద్రిక్తతలు పెరుగుతాయి. 

మానవ హక్కులను సైతం కాలరాస్తున్న నియంతృత్వంపై పోరాటం ఎవరు, ఎక్కడ చేసినా అది సమర్థనీయమే. ప్రపంచం సంతోషించాల్సిన అంశమే. నియంతృత్వం పోయి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడుతుందని ఆశిస్తాం. కానీ, అసద్‌ పాలన స్థానంలో రానున్న పాలన ఏమిటన్నది ప్రశ్న. ఒకటికి పది సంస్థలు ఈ సాయుధ తిరుగుబాటును నడిపాయని విస్మరించలేం. 

అసద్‌ను గద్దె దింపడం సరే కానీ, అనేక వైరుద్ధ్యాలున్న ఇవన్నీ ఒకతాటిపైకి రావడం, రేపు సజావుగా పాలన సాగించడం సాధ్య మేనా అన్నది బేతాళప్రశ్న. తీవ్రవాద అల్‌ఖైదాకు ఒకప్పటి శాఖ అయిన హెచ్‌టీఎస్‌ లాంటి తీవ్ర వాద సంస్థలు తమను తాము జాతీయవాద శక్తులుగా చెప్పుకుంటున్నా, అవి తమ వెనకటి స్వభా వాన్ని వదులుకుంటాయా అన్నదీ అనుమానమే. అదే గనక జరగకపోతే... దశాబ్దాలుగా అల్లాడు తున్న సిరియా, అక్కడి సామాన్యుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతుంది. 

ఒకప్పటి సంపన్న సిరియా దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై, అంతర్యుద్ధంలో మగ్గుతూ శిథిలాల కుప్పగా మారింది. అసద్‌ హయాంలో దాదాపు 1.2 కోట్లమంది దేశం విడిచి పోవాల్సి వచ్చింది. ఉద్రిక్తతా నివారణ జోన్లలో అతి పెద్దదైన ఒక్క ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌లోనే సుమారు 20 లక్షల మంది శరణార్థులుగా బతుకీడుస్తున్నారు. తాజా పరిణామాలతో ఆ దేశాన్ని రాజకీయంగా, సామాజికంగా ఒక గాడిన పెట్టాల్సిన తరుణమిది. 

స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న సిరియన్లు సైతం ఈ భగీరథ ప్రయత్నంలో భాగస్వాములవ్వాలి. అలాగే, ఆంక్షల విధింపుతో అసద్‌ పతనానికి దోహద పడ్డ పాశ్చాత్య దేశాలు సైతం సిరియా వాసుల కష్టాల తొలగింపుపై దృష్టి పెట్టాలి. తద్వారా వేలాది సిరియన్‌ శరణార్థులు స్వచ్ఛందంగా స్వదేశానికి వచ్చి, దేశ పునర్నిర్మాణంలో భాగమయ్యే వీలు చిక్కుతుంది. 

అసద్‌ పదవీచ్యుతితో సిరియా పునర్నిర్మాణానికి అవకాశం అంది వచ్చినా, అందుకు సవాలక్ష సవాళ్ళున్నాయి. మితవాద, అతివాద బృందాల సమ్మేళనమైన ప్రతిపక్షం సైనిక విజయం నుంచి సమర్థమైన పరిపాలన వైపు అడుగులేయడం ముఖ్యం. అందులో జయాపజయాలను బట్టే సిరియా భవితవ్యం నిర్ణయం కానుంది. అందుకే, రానున్న కొద్ది వారాల పరిణామాలు కీలకం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement