మానవాళి కోరుకోని యుద్ధం | Sakshi Editorial On Israeli Palestinian conflict | Sakshi
Sakshi News home page

మానవాళి కోరుకోని యుద్ధం

Published Tue, Oct 10 2023 12:06 AM | Last Updated on Tue, Oct 10 2023 12:06 AM

Sakshi Editorial On Israeli Palestinian conflict

ఆ దృశ్యాలు ఏదో హార్రర్‌ సినిమానో, మరేదో అమెరికన్‌ వార్‌ సినిమానో చూస్తున్నట్లుంది. ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన ‘హమాస్‌’ తీవ్రవాద సంస్థ జరిపిన ఆకస్మిక దాడులు, బదులుగా గాజా భూఖండంపై ఇజ్రాయెల్‌ చేస్తున్న ప్రతీకార దాడుల దృశ్యాలు మూడు రోజులుగా చూస్తున్న వారికి ఒళ్ళు ఝల్లుమనేలా చేస్తున్నాయి. భారీ విధ్వంసాలు, 1200 మందికి పైగా మృతులు, వేలల్లో నిరాశ్రయులు, పసిపిల్లల మొదలు పదహారేళ్ళ పడుచుల దాకా తీవ్రవాదుల చేతిలో చిక్కిన వందకు పైగా బందీల కథ మానవతావాదుల గుండెను బరువెక్కిస్తోంది.

పొరుగున ఉన్న అరబ్‌ దేశాలతో ఇప్పుడిప్పుడే ఇజ్రాయెల్‌ సంబంధాలు మెరుగుపడుతున్నాయనీ, ఆర్థిక సహకారం – శాంతి సాధనే ధ్యేయంగా సరికొత్త మధ్యప్రాచ్యానికి బాటలు పడుతున్నాయనీ భావిస్తున్న వేళ ఉరుము లేని పిడు గులా హమాస్‌ దాడి మొత్తం కథను మార్చేసింది. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ చేసిన అనివార్య యుద్ధప్రకటన కాలాన్ని వెనక్కి తిప్పేసింది. తాజా ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధంతో దశాబ్దాల పాటు మధ్యప్రాచ్యంలో కొనసాగిన అశాంతి మళ్ళీ భూతమై తిరిగొచ్చింది. 

ఇది యాభై ఏళ్ళ నాటి జ్ఞాపకాలను తట్టిలేపింది. అప్పట్లో 1973 అక్టోబర్‌ 6న యూదుల లెక్కలో పవిత్రమైన యోమ్‌ కిప్పూర్‌ రోజున ఈజిప్ట్, సిరియాలు సరిగ్గా ఇలాగే ఇజ్రాయెల్‌పై దాడి చేశాయి. 1949, 1956, 1967 తర్వాత ‘నాలుగో అరబ్‌ – ఇజ్రాయెలీ యుద్ధం’గా పేరుబడ్డ ఆ 19 రోజుల యుద్ధంలో చివరకు ఇజ్రాయెల్‌ పైచేయి సాధించి, పొరుగు భూభాగాలను స్వాధీనం చేసు కుంది. దాంతో, పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. అప్పటిలానే మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయెల్‌పై భయానక దాడి జరిగింది.

అదీ పవిత్ర హిబ్రూ బైబిల్‌లోని తొలి అయిదు భాగాల సమాహారమైన తోరా పఠనం ప్రారంభించే రోజున జరిగింది. గూఢచర్యంలో, దాడుల్ని నిరోధించే వ్యవస్థల్లో పేరున్న ఇజ్రాయెల్‌ ఈసారీ ఏమరుపాటుతో ఉంది. అక్టోబర్‌ 7 తెల్లవారుజామున అంతా నిద్రలో ఉన్న వేళ ఆకాశ, సముద్ర, భూ మార్గాలు మూడింటి ద్వారా, ఏకకాలంలో అనేక ప్రాంతాల్లో హమాస్‌ తీవ్రవాదులు ఆకస్మిక దాడి జరిపి, దిగ్భ్రాంతికి గురిచేశారు. 5 నుంచి 7 వేల రాకెట్ల వర్షం కురిపించారు. ఇజ్రాయెల్‌ అన్నట్టు ఒక రకంగా ఇది... 2001 సెప్టెంబర్‌ 11న అమెరికాలో అంతర్జా తీయ వాణిజ్య కేంద్ర జంట భవనాలపై అల్‌–ఖైదా తీవ్రవాదుల ‘9/11 దాడుల’ను గుర్తుచేస్తోంది.

ప్రపంచ ప్రసిద్ధ క్షిపణి – రాకెట్‌ నిరోధక వ్యవస్థ ‘ఐరన్‌ డోమ్‌ సిస్టమ్‌’ను సైతం తప్పించుకొని, వందలాది రాకెట్లు ఇజ్రాయెల్‌ భూభాగంలోకి చొచ్చుకొని రావడం నివ్వెరపరింది. ఇది నెతన్యాహూ సర్కార్‌ వైఫల్యాల్లో కొత్త చేరిక. తూర్పు జెరూసలేమ్‌లోని పవిత్ర అల్‌–అక్సా మసీదుకు వచ్చే పాల స్తీనా భక్తులపై దాడులు, మసీదులోకి యూదుల ప్రవేశం లాంటి రెచ్చగొట్టే చర్యలు పరిస్థితిని ఇక్కడి దాకా తెచ్చాయి.

తాజా దాడి నుంచి ఇజ్రాయెల్‌ వెంటనే తేరుకొని, హమాస్‌ కీలక కేంద్రాలపై ప్రతి దాడులు జరిపింది. జొరబడిన హమాస్‌ తీవ్రవాదులను నిర్వీర్యం చేసింది. ఇప్పుడప్పుడే తెగే అవ కాశం లేని ఈ యుద్ధంలో సైనిక బలిమితో చివరకు ఇజ్రాయెలే గెలవచ్చు కానీ, ఇరువైపులా జరిగే నష్టం మాటేమిటి? ఇరాన్‌ను శత్రువుగా భావిస్తూ, దాన్ని శిక్షించడానికి ఇజ్రాయెల్‌ను వాటంగా చేసు కుంటున్న అమెరికా ఈ ఒత్తిడి వ్యూహం వల్ల మధ్యప్రాచ్యంలో మంటలు చల్లారవని గ్రహించాలి. 

మధ్యప్రాచ్యంలో మంటలు ఈనాటివి కావు. 1948లో ఇజ్రాయెల్‌ ఏర్పాటుతో లక్షలాది పాలస్తీనియన్లు నిరాశ్రయులై, సొంత గడ్డ మీదే శరణార్థులు కావాల్సి వచ్చింది. నాటి నుంచి పాలస్తీనియన్లకూ, ఇజ్రాయెల్‌కూ మధ్య పోరు సాగుతూనే ఉంది. గతంలో 2008–09లో, 2014లో ఇజ్రాయెల్‌కీ, హమాస్‌కీ మధ్య యుద్ధాలు జరిగాయి. కానీ, కథ కంచికి చేరలేదు. నిజానికి, పాలస్తీనియన్‌ ప్రజలందరికీ హమాస్‌ ప్రతినిధి అనుకోవడం కూడా పొరపాటే. ఆ తీవ్రవాద సంస్థ చేసిన చర్యలన్నిటికీ పాలస్తీనాను తప్పుబట్టలేం. కానీ, దీర్ఘకాలిక పాలస్తీనా సమస్యకు పరిష్కారానికి చర్చలు, శాంతియుత మార్గమే సాధనం.

అది గ్రహించకుండా హింసకు దిగేవారిని కూడా క్షమించలేం. తీవ్రవాద దాడుల దుష్ఫలితం ఇప్పటికే ప్రతిదాడుల రూపంలో గాజా భూఖండంలో అమాయకులపై పడింది. ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక శాంతి, సుస్థిరతలు కావాలంటే పాలస్తీని యన్లకూ, ఇజ్రాయెల్‌కూ మధ్య పరస్పర అంగీకారయోగ్యమైన రాజకీయ రాజీ కుదరాలి. స్వతంత్ర పాలస్తీనా దేశమనేది అసాధ్యమైన వేళ ఆచరణయోగ్య పరిష్కారం వైపు ఆలోచించాలి. పాలస్తీనా పక్షాన ఇజ్రాయెల్‌కు ఎదురొడ్డుతున్న ఇరాన్, సిరియా, లెబనాన్‌లోని హెజ్బొల్లా బృందం అది గ్రహించాలి. ఉక్రెయిన్‌ యుద్ధంతో అస్తుబిస్తవుతున్న ప్రపంచం మరో యుద్ధాన్ని భరించలేదు.

భారత్‌ సంగతికొస్తే, రక్షణ వ్యవహారాల్లో బలమైన భాగస్వామి అయిన ఇజ్రాయెల్‌ చేతిని విడిచిపెట్టే పరిస్థితి లేదు. అదే సమయంలో దశాబ్దాల తరబడి పాలస్తీనా అంశంలో బాధితుల గళానికి మద్దతుగా నిలిచిన చరిత్ర మనది. ఆ చారిత్రక వైఖరిని పూర్తిగా వదిలేసి, ఇరాన్‌తో పాటు వివిధ అరబ్బు దేశాలతో స్నేహానికి పీటముడి వేసుకోనూ లేము. ‘ఈ కష్టకాలంలో ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటిస్తున్నాం’ అని భారత ప్రధాని ప్రకటించారు. దురాక్రమణలు, తీవ్రవాద దాడులను విస్పష్టంగా ఖండించాల్సిందే. అదే సమయంలో గాజా భూఖండంపై ప్రతీకార దాడుల వల్ల ఇప్పటికే నిరాశ్రయులైన లక్షా పాతిక వేల మంది సామాన్య పౌరులపై మానవతాదృష్టి సారించాల్సిందే.

అందుకు మనం ఇప్పుడు ఆచితూచి అడుగేయాలి. తటస్థంగా ఉంటూ, శాంతి స్థాపనకు కృషి చేయాలి. పాలస్తీనియన్లకు కొద్దిపాటి సడలింపులిస్తే ఇజ్రాయెల్‌తో సాధారణ సంబంధాలకు సిద్ధపడ్డ సౌదీ అరేబియా సైతం నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. మానవాళి కోరుకోని ఈ యుద్ధం ఆగాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement