అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్ ఉద్భవించే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమ మేధోసంపత్తిని దొంగలించిందనే నెపంతో చైనాపై అమెరికా భారీ జరిమానా విధించేందుకు సిద్ధమవుతుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దీంతో చైనాపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేటివ్ సిద్ధమవుతుందనే స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. అమెరికా కంపెనీలను బలవంతం పెట్టి మేధో సంపత్తిని చైనా తనకు బదిలీ చేసుకుందని రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్, ఆయన ఆర్థిక సలహాదారుడు గ్యారీ కోన్‌లు ఆరోపించారు. ఈ విషయంపై అమెరికా వాణిజ్య విచారణ చేపట్టిందని కూడా తెలిపారు. అమెరికా వాణిజ్య ప్రతినిధులు దీనిపై త్వరలోనే సిఫారసులు చేస్తారని పేర్కొన్నారు. ''మేము పెద్ద మొత్తం మేధోసంపత్తి జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నాం. త్వరలోనే దీన్ని ప్రకటిస్తాం'' అని అధ్యక్షుడు చెప్పారు. అయితే ఎంత మొత్తంలో జరిమానా విధించనున్నారో మాత్రం తెలుపలేదు.
చైనా చేసిన ఈ పనివల్ల టెక్నాలజీలో వందల బిలియన్ డాలర్లను కోల్పోయామని అమెరికా వ్యాపారాలు కూడా వాపోతున్నాయి. మిలియన్ల ఉద్యోగాలు చైనీస్ కంపెనీలకు వెళ్లినట్టు తెలిపాయి. సాఫ్ట్‌వేర్లను, ఐడియాలను బలవంతం మీద చైనీస్ కంపెనీలు తమ వద్ద నుంచి దొంగలించాయని ఆరోపిస్తున్నాయి. చైనాతో సత్సంబంధాలను కొనసాగించాలని అమెరికా చూస్తున్నప్పటికీ, బీజింగ్ మాత్రం అలా వ్యవహరించడం లేదని అధ్యక్షుడు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై జనవరి 30న అమెరికా కాంగ్రెస్ వద్ద కూడా చర్చించనున్నట్టు పేర్కొన్నారు. అయితే ట్రేడ్‌వార్ అనేది అమెరికా తీసుకొనబోయే చర్యలపై ఆధారపడి ఉండనుంది. ట్రేడ్ వార్ సంభవించే అవకాశాలు లేవని ట్రంప్ చెబుతున్నప్పటికీ, జరిమానా పెద్ద మొత్తంలో విధిస్తే, ఈ విషయాన్ని చైనా కూడా సీరియస్‌గా తీసుకోబోతుందని తెలుస్తోంది. మేధో సంపత్తిని దొంగలించామనే అమెరికా ఆరోపణలను చైనా ఆర్థికమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ ఖండిస్తున్నారు. చైనాలో ఏ చట్టాలు కూడా బలవంతంగా విదేశీ పెట్టుబడిదారుల నుంచి టెక్నాలజీని బదిలీ చేసుకునేలా లేవని, కానీ కంపెనీల మధ్య మార్కెట్ ప్రవర్తన బట్టి అది ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment