intellectual property
-
లక్ష పేటెంట్లు మంజూరు.. అధికంగా ఎందులో తెలుసా..
గతేడాదిలో సుమారు లక్ష పేటెంట్లను మంజూరు చేసినట్లు భారతీయ పేటెంట్ కార్యాలయం తెలిపింది. ప్రధానంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) రిజిస్ట్రేషన్లలో చెప్పుకోదగ్గ పెరుగుదల ఉందని, గత ఏడాదితో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయని పేర్కొంది. ఈమేరకు తాజాగా వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో ప్రతి 6 నిమిషాలకు ఒక టెక్నాలజీ ఐపీ రైట్స్కోసం నమోదవుతున్నట్లు ప్రకటనలో పాలిపారు. 2022-23లో అత్యధికంగా 90,300 పేటెంట్ దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (15-మార్చి-2023 నుంచి 14-మార్చి 2024 వరకు) లక్షకు పైగా పేటెంట్లను మంజూరు చేశారు. ప్రతిరోజు 250 పేటెంట్లు మంజూరు చేసినట్లు తెలిసింది. 2013–14లో కేవలం 6 వేల పేటెంట్లు మాత్రమే ఇష్యూ అయినట్లు ప్రకటనలో తెలిపారు. ఇదీ చదవండి: 2003-07 నాటి వృద్ధిరేటు దిశగా భారత జీడీపీ ఈ సంఖ్య లక్షకు పెరగడం పట్ల వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేసింది. విభిన్న అంశాలపై పరిశోధనలు చేస్తున్న ఆచార్యులు, సృజనాత్మకమైన ఆలోచనలతో కొత్త పరికరాలు, యంత్రాలను కనిపెడుతున్న వారు పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంటారు. -
నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం: యంగిస్తాన్!
నరాల బిగువు, కరాల సత్తువ, వరాల వర్షం కురిపించే మేధో సంపత్తితో కూడిన యువ శక్తి భారత దేశ సొంతం. ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంత యువ జనాభా మన దగ్గరుంది. మన దేశ సగటు వయసు కేవలం 28 ఏళ్లు! అదే చైనా సగటు వయసు 37 ఏళ్లు, జపాన్‌దైతే ఏకంగా 48 ఏళ్లు. సూపర్ పవర్స్‌గా పేరుబడ్డ అమెరికా, చైనా వంటి దేశాల్లో వృద్ధ జనాభా నానాటికీ పెరిగిపోతోంది. ఆ రెండు దేశాల్లో సగానికిపైగా జనాభా వృద్ధులే! 15 నుంచి 24 మధ్య వయసు వారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల మంది ఉన్నారు. అంటే ప్రపంచ జనాభాలో 16 శాతం. అదే భారత్‌లో 13 నుంచి 35 మధ్య వయసు వారు జనాభాలో ఏకంగా 66 శాతమున్నారు. అంటే మన దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరు యువోత్సాహంతో తొణికిసలాడుతున్నారు. యువత శక్తి సామర్థ్యాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో సింహావలోకనం చేసుకునేందుకు ఏటా ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుతున్నారు. మేధో వలసలు ఆపాలి అపార ప్రతిభ, సజనాత్మకత పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలిచే తెలివితేటలు భారత యువత సొంతం. వీటిని వాడుకుని బహుళ జాతి సంస్థలు చాలా లాభపడుతున్నాయి. మన వారిలోని ప్రతిభా పాటవాలను ఇతర దేశాలే ముందుగా గుర్తించి ఎగరేసుకుపోతున్నాయి. దాంతో మన యువత మేధో సంపత్తి దేశాభివృద్ధికి ఉపయోగపడటం లేదు. మన దేశం నుంచి మేధో వలసలు చాలా ఎక్కువగా ఉన్నాయి. యాపిల్ ఉద్యోగుల్లో 35 శాతం, మైక్రోసాఫ్ట్‌లో 34›, ఐబీఎంలో 28, ఇంటెల్‌లో 17, అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో 36 శాతం భారతీయులే! మన యువతలో చాలావరకు భారత్‌లో ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించడం లేదన్న అసంతప్తితో వలస బాట పడుతున్నారు. ప్రపంచ సారథిగా భారత్ ఎదగాలంటే ఈ మేధో వలసను తక్షణం అడ్డుకోవాలి. దేశానికి అండదండ ► భారత యువతలో అక్షరాస్యత 90 శాతానికి పెరిగింది. వీరంతా స్మార్ట్ తరం. డిజిటల్ ప్లాట్‌ఫారాలపై దుమ్ము రేపుతున్నారు. మన యువత నైపుణ్యాలు పెంచడానికి కేంద్రం మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలపై లక్ష కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తోంది. ► యువకుల్లో 36%, యువతుల్లో 42% ఉన్నత విద్యాభ్యాసంపై ఆసక్తి చూపుతున్నట్టు లోక్‌నీతి–సీస్‌డీఎస్ తాజా సర్వే వెల్లడించింది. యువతీ యువకులు విద్యావంతులైతే ఉపాధి అవకాశాలు బాగా పెరిగి వారి భవిష్యత్తు బంగారమవుతుంది. ► ఐదేళ్ల క్రితం దాకా యువతలో 65% ఉద్యోగ భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వోద్యోగాలే కోరుకునేవారు. వారిలో క్రమంగా మార్పు వస్తోంది. సర్కారు కొలువు కోరుకునే వారు 55 శాతానికి తగ్గారు. 25% మంది సొంత వ్యాపారాలకు సిద్ధపడుతుండటం మరో మంచి పరిణామం. ► దేశ జనాభాలో 35 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు 54 శాతమున్నారు. పైగా ఏటా 1.5 కోట్ల మంది పని చేసే వయసులోకి అడుగు పెడుతున్నారు. ► దేశంలోని టాప్ 10 స్టార్టప్ కంపెనీల సారథులు యువతీ యువకులే కావడం విశేషం. ► దేశ స్థూల జాతీయాదాయం(జీఎన్ఐ)లో 34% 15–29 మధ్య వయసున్న యువత నుంచే సమకూరుతోంది. వచ్చే 20 ఏళ్లలోనే సాధించాలి సూపర్ పవర్‌గా ఎదగాలని భారత్ కలలు కంటోంది. చైనాను అధిగమించి దూసుకెళ్లాలని అనుకుంటోంది. ఇందుకు ఆశలన్నీ యువత మీదే పెట్టుకుంది. ఇలాంటి భారీ లక్ష్యాలను మనం మరో 20 ఏళ్లలోనే సాధించాలి. ఎందుకంటే ఏ దేశమైనా వృద్ధి బాట పట్టాలంటే 15 నుంచి 59 ఏళ్ల వయసు మధ్యనున్న వారే కీలకం. ఆర్థిక వ్యవస్థకు వారే వెన్నుదన్నుగా నిలుస్తారు. ఆ వయసు వారే పని చేసే రంగంలో ఉంటారు. తద్వారా ఉత్పాదకత పెరుగుతుంది. ప్రస్తుతం దేశ జనా«భాలో ఈ వయసు వారు 63% ఉన్నారు. 2036 నాటికి 65 శాతానికి చేరే అవకాశముంది. తర్వాత నెమ్మదిగా పని చేసే వారి సంఖ్య తగ్గి దేశంలో వృద్ధులు పెరిగిపోతారు. ఆ లెక్కన వచ్చే 20 ఏళ్లలో మన యువతరం ఏ మేరకు కష్టిస్తుందనే దానిమీదే భావి భారత పురోగతి ఆధారపడి ఉంది. యువతలో శక్తి సామర్థ్యాలను గరిష్టంగా వినియోగించుకొని వృద్ధి బాట పట్టిన దేశాల్లో చైనాతో పాటు న్యూజిలాండ్, ఫిన్లాండ్, ఆస్ట్రియా వంటివి ముందు వరుసలో ఉంటాయి. మన యువత మీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. జనాభా స్థిరీకరణ, 2024 నాటికి రూ.5 లక్షల కోట్ల ఎకానమీ వంటి లక్ష్యాలు సాకారం కావాలంటే ప్రభుత్వం యువతపై దృష్టి సారించాలి. వారిమీదే అధికంగా పెట్టుబడులు పెట్టాలి – పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా – నేషనల్ డెస్క్, సాక్షి -
ఇంత బాధలో మేధో హక్కులా?
కరోనా విజృంభిస్తున్న వేళ విశ్వజనులకు వేగంగా వ్యాక్సిన్ అందించే అడుగులు పడుతున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ పేటెంట్ రక్షణను తాత్కాలికంగానైనా నిలిపివేయాలనే ప్రతిపాదనకు సానుకూల స్పందన వస్తోంది. అంటే, మేధో సంపత్తి హక్కుల మాఫీ అన్నమాట! ఏకాభిప్రాయం కుదిరితే వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ విశ్వవ్యాప్తమై సత్వరమే అందరికీ వ్యాక్సిన్ లభిస్తుంది. ఫలితంగా కరోనాపై మన ఉమ్మడిపోరు విజయావకాశాలు మెరుగవుతాయి. ఇదొక ఆరోగ్యకర వాతావరణానికి సంకేతం! ముఖ్యంగా వైద్యరంగంలో సరికొత్త సంస్కరణలకు తెరలేపడమే! కొన్నేళ్లుగా లోలోన రగులుతున్న ఈ అంశం ఇప్పుడు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వేదికపైకి రావడం విశేషం. భారత్, దక్షిణాఫ్రికా చేసిన ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సానుకూలంగా స్పందించడం పెద్ద ముందడుగు. అమెరికా మరింత స్పష్టతతో వస్తే అప్పుడాలోచిస్తామని తాజాగా పేర్కొన్న యురోపియన్ యూనియన్ (ఈయూ), ఈ విషయంలో లోతైన చర్చకు తాము సిద్ధమే అనడం కొత్త మలుపు. ఇదివరకటి వారి వైఖరికిది పూర్తి భిన్నం. ఇప్పటికీ జర్మనీ, బ్రిటన్, స్విట్జర్లాండ్. నార్వే వ్యతిరేకిస్తున్నాయి. ఫ్రాన్స్ మాత్రం సానుకూలంగా స్పందించింది. ‘పేటెంట్ హక్కులు తర్వాత, ముందు ప్రజల ప్రాణాలు కాపాడటం ముఖ్యం’ అన్న ఫ్రాన్స్ లాంటి వైఖరే తాజా ముందడుగు వెనుక మూలసూత్రం. అందరూ ఒక్కటై, కరోనా మహమ్మారిపై పోరాడాల్సిన సంక్లిష్ట సమయంలో... ఏ కొందరి వాణిజ్య ప్రయోజనాలకో–లాభార్జనకో రక్షణ కల్పించడం సరికాదనేది రక్షణ సడలించాలనే వారి వాదన. కోవిడ్ వ్యాక్సిన్, దాని ముడిసరుకుల విషయంలో పేటెంట్ హక్కులున్న పరిమిత కంపెనీలు సంపన్న దేశాల్లోనే ఉత్పత్తులు జరుపుతున్నాయి. ఉత్పత్తి ఎక్కడ జరిపినా.. పంపిణీలో వివక్ష వల్ల ఆయా సంపన్న దేశాల్లో జరిగినట్టు టీకాలిచ్చే ప్రక్రియ ఇతర అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో జరగటం లేదు. మహమ్మారిని తరిమికొట్టాలన్న విశాల లక్ష్యానికి ఇది విఘాతం. సంపన్న దేశాల్లో టీకాలివ్వడం రేపు సంపూర్ణమైనా, ఆ సమయానికి వ్యాక్సిన్ దొరక్క అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు ఇంకా వైరస్‌తో పోరాడుతూ ఉంటే సమస్యను ఎదుర్కోవడంలో సమతూకం చెడుతుంది. ఉత్పరివర్తనతో వైరస్ మరిన్ని రూపాలు సంతరించుకొని వ్యాప్తి చెందడం వ్యాక్సిన్ పొందిన సంపన్నదేశాలకూ ప్రమాదమే! అలా కాక, పేటెంట్ రక్షణ కవచం తొలగి, ఉత్పత్తి–పంపిణీ వేగంగా విశ్వవ్యాప్తమైతే సకాలంలో టీకా ప్రక్రియ ముగించి మహమ్మారిని శాశ్వతంగా తరిమికొట్టవచ్చని సానుకూలవాదులంటారు. ఇందుకు భిన్నంగా, పేటెంట్ రక్షణను సడలించకూడదనే వారికీ కొన్ని వాదనలున్నాయి. సడలిస్తే ఉత్పత్తి ఎవరెవరి చేతుల్లోకో పోయి వ్యాక్సిన్ నాణ్యత పడిపోతుందని, వినియోగదారుల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని వారంటారు. పైగా అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో నాణ్యతా ప్రమాణాలుండవనే వాదనను వారు ముందుకు తెస్తున్నారు. ఇదొక తప్పుడు వాదన. వ్యాక్సిన్లు, ఇతర మందులకు పేటెంట్ హక్కులు ఖాయం చేసుకున్న తర్వాత ఇవే పెద్ద కంపెనీలు, పలు చిన్న కంపెనీలకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడమో, స్వయంగా తామే రంగంలోకి దిగో ఆ పేద దేశాల్లోనే ఉత్పత్తి చేస్తుంటాయి. తేరగా మౌలిక సదుపాయాలు, చౌకగా కూలీలు లభించడం వల్ల అటు మొగ్గి ఇబ్బడిముబ్బడిగా లాభాలార్జిస్తున్నారు. మరి అప్పుడు లేని నాణ్యతా సందేహాలు, పేటెంట్ హక్కుల్ని సడలిస్తేనే వస్తాయా? నిజంగా ఉత్పత్తి నాణ్యతపై భయ–సందేహాలుంటే... విశ్వసనీయత కలిగిన సంస్థల పర్యవేక్షణ, గట్టి నిఘాతో అది సాధించుకోవచ్చు. మేధో సంపత్తి హక్కులు లేకుంటే పెద్ద పరిశ్రమలు భారీ వ్యయంతో పరిశోధనలకు, నూతన ఆవిష్కరణలకు, పెట్టుబడులకు ముందుకు రావంటారు. అందుకే, వారికి తగిన ఆర్థిక ప్రతిఫలం ఉండాలంటారు. అది కొంత నిజమే అయినా, ప్రస్తుత ఉపద్రవం తగ్గేవరకైనా పేటెంట్ హక్కుల్ని నిలిపివేయాలని కొన్ని దేశాలు కోరుతున్నాయి. ఈ విపత్కాలంలో ఓ వైపు లక్షలాది మంది ప్రాణాల్ని మహమ్మారి తోడేస్తుంటే, మరోవైపు కొన్ని కంపెనీలు పేటెంట్ రక్షణ కవచం నీడన పెద్దమొత్తం లాభాలార్జించడం ఎలా? సమంజసమనే సందేహం పుడుతోంది. ప్రజాధనంతో పనిచేసే విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో ప్రాథమిక శాస్త్ర పరిశోధనలు, ఆవిష్కరణలే ఆయా వ్యాక్సిన్ అభివృద్ధికి శాస్త్రీయ మూలమైనపుడు కంపెనీలకు అంతటి అపరిమిత హక్కులు ఎందుకనేది ప్రశ్న. మేధో సంపత్తి హక్కులు–బహిరంగ శాస్త్ర పరిజ్ఞానం వాదనలకు మధ్య ఇదో ఘర్షణ. ఇల్లు అలకగానే పండుగ కాదు. ఓటింగ్ పద్ధతి కాకుండా ఏకాభిప్రాయానికి మొగ్గే డబ్ల్యూటీవో లోని 164 సభ్య దేశాలు అంగీకరిస్తేనే ఏదైనా సాధ్యం. పేటెంట్ రక్షణకు సడలింపు ప్రతిపాదనను ఏ ఒక్కదేశం వ్యతిరేకించినా నిర్ణయం జరగదు. పెద్ద దేశాల చొరవతో ఏకాభిప్రాయం సాధ్యమే! పేటెంట్ రక్షణను సడలించాలి. సాంకేతికత బదిలీ జరగాలి. లైసెన్సింగ్ సులభమవాలి. అలా అని, అడ్డదిడ్డంగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి వినియోగదారుల కళ్లలో దుమ్ముకొట్టే సంస్థలు రాత్రికి రాత్రి పుట్టగొడుగుల్లా పుట్టి, డబ్బు దండుకొని, జారిపోవాలని ఎవరూ కోరుకోరు. పేటెంట్ హక్కుల సడలింపు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, ఉత్పత్తి వికేంద్రీకరణ, సమరీతి పంపిణీ, హేతుభద్దమైన ధర... ఇవన్నీ సాకారమై కరోనా మహమ్మారిపై మానవ విజయం పరిపూర్ణం కావాలన్నదే అందరి కోరిక. -
యుద్ధానికి సంకేతమా? చైనాపై భారీ జరిమానా
అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్ ఉద్భవించే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమ మేధోసంపత్తిని దొంగలించిందనే నెపంతో చైనాపై అమెరికా భారీ జరిమానా విధించేందుకు సిద్ధమవుతుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దీంతో చైనాపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేటివ్ సిద్ధమవుతుందనే స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. అమెరికా కంపెనీలను బలవంతం పెట్టి మేధో సంపత్తిని చైనా తనకు బదిలీ చేసుకుందని రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్, ఆయన ఆర్థిక సలహాదారుడు గ్యారీ కోన్లు ఆరోపించారు. ఈ విషయంపై అమెరికా వాణిజ్య విచారణ చేపట్టిందని కూడా తెలిపారు. అమెరికా వాణిజ్య ప్రతినిధులు దీనిపై త్వరలోనే సిఫారసులు చేస్తారని పేర్కొన్నారు. ''మేము పెద్ద మొత్తం మేధోసంపత్తి జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నాం. త్వరలోనే దీన్ని ప్రకటిస్తాం'' అని అధ్యక్షుడు చెప్పారు. అయితే ఎంత మొత్తంలో జరిమానా విధించనున్నారో మాత్రం తెలుపలేదు. చైనా చేసిన ఈ పనివల్ల టెక్నాలజీలో వందల బిలియన్ డాలర్లను కోల్పోయామని అమెరికా వ్యాపారాలు కూడా వాపోతున్నాయి. మిలియన్ల ఉద్యోగాలు చైనీస్ కంపెనీలకు వెళ్లినట్టు తెలిపాయి. సాఫ్ట్వేర్లను, ఐడియాలను బలవంతం మీద చైనీస్ కంపెనీలు తమ వద్ద నుంచి దొంగలించాయని ఆరోపిస్తున్నాయి. చైనాతో సత్సంబంధాలను కొనసాగించాలని అమెరికా చూస్తున్నప్పటికీ, బీజింగ్ మాత్రం అలా వ్యవహరించడం లేదని అధ్యక్షుడు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై జనవరి 30న అమెరికా కాంగ్రెస్ వద్ద కూడా చర్చించనున్నట్టు పేర్కొన్నారు. అయితే ట్రేడ్‌వార్ అనేది అమెరికా తీసుకొనబోయే చర్యలపై ఆధారపడి ఉండనుంది. ట్రేడ్ వార్ సంభవించే అవకాశాలు లేవని ట్రంప్ చెబుతున్నప్పటికీ, జరిమానా పెద్ద మొత్తంలో విధిస్తే, ఈ విషయాన్ని చైనా కూడా సీరియస్‌గా తీసుకోబోతుందని తెలుస్తోంది. మేధో సంపత్తిని దొంగలించామనే అమెరికా ఆరోపణలను చైనా ఆర్థికమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ ఖండిస్తున్నారు. చైనాలో ఏ చట్టాలు కూడా బలవంతంగా విదేశీ పెట్టుబడిదారుల నుంచి టెక్నాలజీని బదిలీ చేసుకునేలా లేవని, కానీ కంపెనీల మధ్య మార్కెట్ ప్రవర్తన బట్టి అది ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు. -
ఫేస్‌బుక్‌పై భారీ జరిమానా
బెర్లిన్: యూజర్ల డాటాను ఎలా వినియోగించుకుంటున్నదో తెలిపేందుకు నిరాకరించడంతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై జర్మనీ కోర్టు భారీ జరిమానా విధించింది. ఫేస్బుక్లో యూజర్లు పోస్టుచేస్తున్న మేధో సంపత్తి అంశాలను మీరు ఎలా ఉపయోగించుకుంటున్నామో వారికి తెలియజేయాలని జర్మనీ కోర్టు ఆదేశించగా.. అందుకు ఫేస్బుక్ నిరాకరించిందని, అందుకే బెర్లిన్ రిజినల్ కోర్టు దానిపై 1.09 లక్షల డాలర్లు (రూ. 74 లక్షలు) జరిమానా విధించిందని వినియోగదారుల హక్కుల సంస్థ ఒకటి తెలిపింది. ఫేస్బుక్ యూజర్ల డాటా పరిరక్షణ విషయంలో జర్మనీలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ కోర్టు ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. ఇప్పటికే ఫేస్బుక్ పై జర్మనీలో వ్యతిరేకత పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొనే గతవారం ఫేస్బుక్ స్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ జర్మనీలో పర్యటించారు కూడా. అయితే యూజర్ల మేధోసంపత్తి పరిరక్షణలో ఫేస్బుక్ కచ్చితమైన చర్యలు తీసుకోవడం లేదని, అది జర్మనీ, యూరప్‌లో వినియోగదారుల చట్టాలను తొంగతొక్కాలని భావిస్తున్ననది జర్మనీ వినియోగదారుల హక్కుల ఫెడరేషన్ (వీజెడ్బీవీ) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.