ముంబై : అమెరికా-చైనా మధ్య నెలకొన్న ట్రేడ్ వార్ ఆందోళనలతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ప్రారంభంలోనే భారీగా నష్టపోయిన మార్కెట్లు, అమ్మకాల ఒత్తిడితో పడుతూ లేస్తూ.. చివరికి కూడా భారీ నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 410 పాయింట్లు పడిపోయి 32,596 వద్ద, నిఫ్టీ 117 పాయింట్లు పడిపోయి 10వేల మార్కుకు కింద 9998 వద్ద క్లోజైంది. దాదాపు అన్ని రంగాల షేర్లు నీరసించగా.. చైనా స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా దిగుమతి సుంకం విధించడంతో మెటల్ సెక్టార్ భారీగా నష్టపోయింది. దాంతో పాటు అమ్మకాల తీవ్రతతో పీఎస్‌యూ బ్యాంక్స్ కూడా టాప్ లూజర్‌గా నష్టాల్లోనే కొనసాగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ సుమారు 300 పాయింట్లు కిందకి పడిపోయాయి. యాక్సిస్ బ్యాంకు, ఎస్‌బీఐ, వేదంత, హిందాల్కో, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ 5 శాతం వరకు నష్టపోయాయి.
వీటితో పాటు యూనియన్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంకు, ఓబీసీ, అలహాబాద్ బ్యాంకు, జై ప్రకాశ్ అసోసియేట్స్, సెయిల్, ఎంఎంటీసీ, అదానీ ఎంటర్‌ప్రైజస్, బజాజ్ హిందూస్తాన్, ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లు కూడా నష్టాలోనే నడిచాయి. అయితే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 2.5 శాతం ర్యాలీ జరుపగా.. టెక్ మహింద్రా 0.5 శాతం లాభపడింది. అమెరికా విధించిన స్టీల్, అల్యూమినియం దిగుమతుల సుంకానికి బదులుగా.. చైనా కూడా ప్రతీకారం తీర్చుకోబోతోంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే డ్రై ఫ్రూట్స్, వైన్, స్టీల్ పైప్స్‌లపై 15శాతం, పంది మాంసం ఉత్పత్తులపై 25 శాతం సుంకం, రీసైకిల్ చేసిన అల్యూమినియంపై సుంకాలను చైనా పరిశీలిస్తోందని ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో అమెరికా-చైనాల మధ్య ట్రేడ్ వార్ ఆందోళనలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment