కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం, దక్షిణ చైనా సముద్రం విషయమై అమెరికా–చైనాల మధ్య తాజాగా ఉద్రిక్తతలు చెలరేగడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా మంగళవారం భారీగా నష్టపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు నష్టపోయి 75.42కు చేరడం, దేశంలో కొన్ని నగరాల్లో లాక్‌డౌన్ విధించడం వల్ల ఆర్థిక రికవరీకి విఘాతం వాటిల్లగలదన్న ఆందోళనలు, ఇప్పటివరకూ వెల్లడైన కంపెనీల క్యూ1 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 661 పాయింట్లు పతనమై 36,033 పాయింట్లకు, నిఫ్టీ 195 పాయింట్లు క్షీణించి 10,607 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రెండు సూచీలు చెరో 1.8% చొప్పున నష్టపోయాయి.
ఫార్మా సూచీకే లాభాలు.....
►ప్రపంచ మార్కెట్ల పతనంతో మన మార్కెట్ నష్టాల్లోనే మొదలైంది. నష్టాలు పెరుగుతూ పోయాయే కానీ ఏ దశలోనూ ఊరట లభించలేదు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 817 పాయింట్లు, నిఫ్టీ 240 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఒక్క ఎన్‌ఎస్‌ఈ ఫార్మా సూచీ మాత్రమే లాభపడింది. మిగిలిన అన్ని సూచీలు నష్టపోయాయి. బ్యాంక్, లోహ, వాహన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
►సెన్సెక్స్‌లోని 30 షేర్లలో టైటాన్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఆటో మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లు నష్టపోయాయి.
►వాహన రుణాలకు సంబంధించి అవకతవకలపై విచారణ జరుపుతున్నామని యాజమాన్యం నిర్ధారించడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2 శాతం నష్టంతో రూ.1,059 వద్ద ముగిసింది.
►స్టాక్‌మార్కెట్ భారీగా నష్టపోయినా, దాదాపు వందకు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, డాక్టర్ లాల్ ప్యాథ్‌ల్యాబ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
►దాదాపు 400కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. అర్వింద్ ఫ్యాషన్స్, ఐడీబీఐ బ్యాంక్, రెప్కో హోమ్ ఫైనాన్స్, సుజ్లాన్ ఎనర్జీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
►డాబర్ ప్రమోటర్లు బర్మన్‌లు తమ వాటాను 8.5 శాతం నుంచి 20 శాతానికి పెంచుకోవడంతో ఎవరెడీ ఇండస్ట్రీస్ షేర్ 10% అప్పర్ సర్క్యూట్‌తో రూ.89 వద్ద ముగిసింది.
►కరోనా చికిత్సలో ఉపయోగపడే ఔషధాన్ని అందించనున్నామని ప్రకటించడంతో బయో కాన్ షేర్ 5 శాతం లాభంతో రూ.437 వద్దకు చేరింది.
►ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) మొదలైన నేపథ్యంలో యస్ బ్యాంక్ షేర్ 5% నష్టంతో రూ.21 వద్ద ముగిసింది. గత 3 రోజుల్లో ఈ షేర్ 22% నష్టపోయింది. ఎఫ్‌పీఓ ఫ్లోర్‌ప్రైస్ రూ.12గా యస్‌బ్యాంక్ నిర్ణయించిన విషయం తెలిసిందే.
అన్ని సానుకూలాంశాలను మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసుకుంది. సెన్సెక్స్ 37.022 పాయింట్ల స్థాయికి చేరే క్రమంలో ప్రతి నిరోధ స్థాయి వద్ద లాభాల స్వీకరణ జరుగుతూనే ఉంటుంది.
–శ్రీకాంత్ చౌహాన్, కోటక్ సెక్యూరిటీస్
నిఫ్టీ 10,750 పాయింట్లపైన ముగియగలిగితేనే అప్‌ట్రెండ్ కొనసాగుతుంది. లేని పక్షంలో 10,480–10,500 పాయింట్లకు, ఆ తర్వాత 10,350 పాయింట్లకు పతనమయ్యే అవకాశాలున్నాయి.
–మనీశ్ హతిరమణి, టెక్నికల్ అనలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment