
సాక్షి , న్యూఢిల్లీ : భారత మార్కెట్లో 99శాతం వాటాను కలిగి ఉన్న గూగుల్ ఆండ్రాయిడ్ ఇతరులను మార్కెట్లోకి రాకుండా అడ్డుకుంటుందనే ఫిర్యాదుల నేపథ్యంలో గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై కాంపీటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దర్యాప్తు ప్రారంభించింది. మొబైల్ తయారీదారులు, గూగుల్ మధ్య ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) మార్కెట్ వాటా ఆరోపణలపై వీటి మధ్య ఒప్పంద వివరాలను ఇవ్వాలని సిసిఐ దర్యాప్తు విభాగం మొబైల్ తయారీదారులను కోరింది.
గూగుల్‌తో చేసుకున్న నిబంధనలు, షరతులపై సమాచారం కోరుతూ శాంసంగ్, షావోమి, కార్బన్, లావాతో సహా పలు హ్యాండ్‌సెట్ తయారీదారులకు సిసిఐ డైరెక్టర్ జనరల్ లేఖలు జారీ చేశారు. ఏప్రిల్ 2011 నుంచి ఎనిమిది సంవత్సరాలలో మొబైల్ యాప్స్, సేవలను ఉపయోగించడానికి గూగుల్ ఏదైనా ఆంక్షలు విధించిందో లేదో కూడా సీసీఐ వివరాలు అడిగింది. ఏప్రిల్ 2011 నుంచి మార్చి 2019 వరకు వార్షిక ప్రాతిపదికన ఆండ్రాయిడ్ ఓఎస్ మరియు గూగుల్ సేవలను ఉపయోగించుకోవడం కోసం గూగుల్‌కు చెల్లించిన లైసెన్స్ ఫీజు లేదా రాయల్టీ వివరాలను కూడా కోరింది.
నోటీసులు అందుకున్నట్లు కంపెనీలు ధృవీకరించినా ఈ విషయంపై వారు స్పందించడానికి నిరాకరించారు. దర్యాప్తుకు సహకరిస్తామని గూగుల్ తెలిపింది. విచారణలో భాగంగా సీసీఐ ముందు హాజరుకావడానికి గూగుల్ అత్యున్నత అధికారులను పిలుస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే ట్విట్టర్ యాజమాన్యాన్ని విచారణకు పిలిచిన తర్వాత విచారణ ఎదుర్కొనే మరో మల్టీనేషనల్ కంపెనీ గూగుల్ అవుతుంది. 2012లో కూడా గూగుల్ తన ఆధిపత్యస్థానాన్ని దుర్వినియోగం చేసిందనే ఫిర్యాదుపై 2018లో 136 కోట్ల రూపాయల భారీ జరిమానాను భారత్ విధించింది. అయితే ఇంతవరకూ గూగుల్ జరిమానాపై స్పందించలేదు. ఆండ్రాయిడ్ మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిన కేసులో దోషిగా తేలడంతో యూరోపియన్ యూనియన్ గత ఏడాది 5 బిలియన్ డాలర్లు (రూ .35,000 కోట్లు) చెల్లించాలని గూగుల్‌ను ఆదేశించడం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ వర్గాల్లో ఈ అంశం సంచలనం రేపినా గూగుల్ ఇంతవరకూ ఒక్క రూపాయి చెల్లించలేదు.
పూర్తి వివరాలు కోరిన సీసీఐ
సిసిఐ కోరిన ఇతర వివరాలలో 2011 మరియు 2019 మధ్య స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) ద్వారా మొబైల్ ఫోన్ల వార్షిక అమ్మకం ఎంత ఉంది, అదే కాలంలో గూగుల్ లేదా దాని యూనిట్లలో ఏదైనా గూగుల్ యాప్‌లను కోరుకునే కంపెనీలు ఇతర యాప్‌లను ఎందుకు ఎంచుకోకూడదు, హ్యాండ్‌సెట్ తయారీదారులు తమ సొంత యాప్ స్టోర్స్, వారి యాప్‌ల సంఖ్య, పరిశోధన, అభివృద్ధిపై వార్షిక పెట్టుబడులు, యాప్ స్టోర్ల నిర్వహణ, అప్‌గ్రేడ్, వార్షిక ఆదాయం గురించి సమాచారాన్ని గూగుల్‌తో ఎందుకు పంచుకోవలసి ఉంటుంది?, స్మార్ట్‌ఫోన్‌లలో ప్రత్యర్థుల యాప్ స్టోర్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకునే వెసులుబాటు ఉందా? తదితర పూర్తి వివరాలను సిసిఐ కోరింది.
అమెరికాకు చెక్ పెట్టే భాగంలోనే
భారత్‌లో అమెరికా వస్తువులకు సుంకం రేట్లు భారీగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరచూ విమర్శించడం తెలిసిందే. ఇందులో భాగంగా భారత వస్తువులపై సుంకాన్ని భారీగా పెంచుతామని హెచ్చరించారు. దీనికి ధీటుగా భారత్ కూడా ప్రతిస్పందించింది. ఈ చర్యల్లో భాగంగానే కాలిఫోర్నియా ప్రధానకేంద్రంగా గల గూగుల్‌ను నియంత్రించి ట్రేడ్‌వార్‌పై అమెరికా చర్యలను కట్టడి చేయాలని భారత్ భావిస్తుందని పరిశీలకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment