
అమెరికా–చైనాల మధ్య వాణిజ్యపోరు తీవ్రతరంకావడంతో ప్రపంచ మార్కెట్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలోనే భారత్‌లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్ ఆదివారంనాడు వెలువడ్డాయి. అత్యధిక శాతం ఎగ్జిట్‌పోల్స్...అధికార ఎ¯Œ డీఏనే తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చన్న అంచనాలు వెలువరించడంతో ఈ సోమవారం మన మార్కెట్ గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యే ఛాన్సుంది. కానీ 23న వెలువడే వాస్తవ ఎన్నికల ఫలితాలు ఏమాత్రం మార్కెట్ అంచనాల్ని చేరలేకపోయినా, పెద్ద పతనం సంభవించే ప్రమాదం కూడా వుంటుంది. ఎన్నికల ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా వున్నా, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో ర్యాలీ భారీగా వుండకపోవొచ్చన్న అభిప్రాయాల్ని పలువురు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే...
సెన్సెక్స్ సాంకేతికాలు...
మే 17తో ముగిసినవారం ప్రధమార్థంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 36.956 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమైన తర్వాత ద్వితీయార్థంలో 38,000 పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 468 పాయింట్ల లాభంతో 37,931 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఆదివారం వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌కు స్పందనగా మార్కెట్ గ్యాప్‌అప్‌తో ప్రారంభమైతే సెన్సెక్స్‌కు 38,600 పాయింట్ల సమీపంలో తొలి అవరోధం కలగవచ్చు. అటుపై స్థిరపడితే క్రమేపీ ఏప్రిల్ 18నాటి గరిష్టస్థాయి 39,480 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ గురువారం వెలువడే ఎన్నికల ఫలితాల అనంతరం ర్యాలీ కొనసాగితే 40,300 పాయింట్ల వరకూ పెరిగే అవకాశాలుంటాయి. ఈ వారం రెండో నిరోధాన్ని దాటలేకపోయినా, సోమవారం గ్యాప్‌అప్ స్థాయిని నిలబెట్టుకోలేకపోయినా 37,415 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఎన్నికల ఫలితాలు నిరుత్సాహపరిస్తే 200 రోజుల చలన సగటు రేఖ కదులుతున్న 36,700 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం నిలబెట్టుకోలేకపోతే 35,830 పాయింట్ల స్థాయివరకూ సెన్సెక్స్ నిలువునా పతనమయ్యే ప్రమాదం వుంటుంది.
తొలి అవరోధం 11,570...మద్దతు 11,260
గతవారం ప్రధమార్థంలో 11,108 పాయింట్ల వరకూ పతనమైన ఎ¯Œ ఎస్‌ఈ నిఫ్టీ...వారంలో చివరిరోజున 11,426 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 128 పాయింట్ల లాభంతో 11,407 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన తొలుత 11,570 పాయింట్ల స్థాయి అవరోధం కల్పించవచ్చు. ఈ స్థాయిని ఛేదిస్తే క్రమేపీ 11,830 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపై 12,100 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం రెండో నిరోధాన్ని దాటలేకపోయినా, సోమవారంనాటి గ్యాప్‌అప్‌స్థాయిపైన స్థిరపడలేకపోయినా 11,260 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా రోజుల్లో 200 డీఎంఏ రేఖ కదులుతున్న 11,040 పాయింట్ల దిశగా నిఫ్టీ ప్రయాణించవచ్చు. ఈ కీలక స్థాయిని సైతం వదులుకుంటే 10,780 పాయింట్ల వద్దకు పతనం కావొచ్చు.