
న్యూయార్క్, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర భారత్ కాలమానం ప్రకారం గురువారం రాత్రి ఒక్కసారిగా క్షీణించింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్–నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా)కు 30 డాలర్లకు పైగా పతనమై, 1,462 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వాణిజ్య యుద్ధానికి ముగింపు పలకడానికి అమెరికా–చైనా మధ్య జరుగుతున్న చర్చలు సానుకూలంగా ఉన్నా యనే ఊహగానాలు పసిడి నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు కారణమన్నది విశ్లేషణ. సహజంగా భౌగోళిక ఆర్థిక, రాజకీయ ఉద్రిక్తతల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు పసిడి సురక్షితమైనదిగా భావిస్తారు. అలాంటి పరిస్థితులు లేనప్పుడు వాస్తవ వృద్ధికి దోహదపడే అసెట్స్‌వైపు తమ ఇన్వెస్ట్‌మెంట్లను మళ్లిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర గురువారం రాత్రి ఇదే విధంగా బలహీనంగా ముగిస్తే, భారత్ దేశీయ మార్కెట్‌లో శుక్రవారం పసిడి ధర భారీగా పతనమయ్యే అవకాశం ఉంది.