బడ్జెట్‌పైనే మార్కెట్‌ దృష్టి | Key challenges for Nirmala Sitharaman's budget 2019 | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌పైనే మార్కెట్‌ దృష్టి

Published Mon, Jul 1 2019 5:01 AM | Last Updated on Mon, Jul 1 2019 5:02 AM

Key challenges for Nirmala Sitharaman's budget 2019 - Sakshi

ముంబై: ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నరేంద్ర మోదీ సర్కార్‌.. కేంద్రంలో రెండోసారి అధికారాన్ని చేపట్టాక 2019–20 ఆర్థిక ఏడాదికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే కౌంట్‌ డౌన్‌  ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జూలై 5న (శుక్రవారం) బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా.. ఈ ప్రధాన అంశమే మార్కెట్‌ వర్గాలకు ఉత్కంఠభరితంగా మారిపోయింది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి, కంపెనీల ఆదాయాలు అంతంత మాత్రంగా ఉన్నందున బడ్జెట్‌లో ఈసారి ద్రవ్య లభ్యత పెంపు, భారీ సంస్కరణల సూచనలు ఉండేందుకు ఆస్కారం ఉందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

‘గ్రామీణ ప్రాంతాల్లో నెమ్మదించిన డిమాండ్‌ మళ్లీ ఊపందుకునేలా చూడడం, వినియోగదారుల కొనుగోలు శక్తి పెరిగేలా నిర్ణయాలు తీసుకోవడం అనేది ఈ బడ్జెట్‌లో ప్రధాన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పన.. బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ, ఇంధన, విద్యుత్, ఉక్కు, ఆటోమొబైల్‌ రంగాలకు ఊతమిచ్చే నిర్ణయాలు వెల్లడైతే మాత్రం మార్కెట్‌కు నూతన ఉత్సాహం వస్తుంది. గతంలో కూడా.. మూలధన వ్యయంపై ప్రకటనలు, విధాన సంస్కరణలే సూచీల దిశానిర్దేశం చేశాయి’ అని ఎస్‌ఎమ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ అడ్వైజర్స్‌ చైర్మ¯Œ  డీకే అగర్వాల్‌ అన్నారు.

నిరాశపరిస్తే నేలచూపులే..
ఈవారంలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌.. భవిష్యత్తుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టంచేయనుంది. భారీ అంచనాలు ఉన్న కారణంగా ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈవో ముస్తఫా నదీమ్‌ విశ్లేషించారు. ఈ నేపథ్యంలో వేచిచూసే ధోరణిలోనే ఉండడం ఉత్తమం అని సూచించారు. మార్కెట్‌ ప్రస్తుత గమనం చూస్తుంటే తుపానుకు ముందు ప్రశాంతతలా ఉందని   శామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోడీ అన్నారు. బడ్జెట్‌ అంచనాలను అందుకోలేకపోతే అమ్మకాల ఒత్తిడి భారీస్థాయిలోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా ఆటోరంగంలో ఉంటే భారీ పతనం కానీ.. లేదంటే.. కోలుకోవడానికి ఆస్కారం ఉందన్నారు. ఆటో, మెటల్‌ రంగాలు ఈవారం ఫోకస్‌లో ఉండనున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధన విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు.  ఈవారంలో బడ్జెట్, 2018–19 ఆర్థిక సంవత్సర ఎకనామిక్‌ సర్వే (జూలై 4న) ఉన్న కారణంగా.. ప్రస్తుతం కన్సాలిడేషన్‌ లో ఉన్న మార్కెట్‌ ఈ ప్రధాన అంశాలు పూర్తయిన తరువాత బలమైన ర్యాలీ నమోదుచేయవచ్చని భావిస్తున్నట్లు ఎడెల్వీజ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ సాహిల్‌ కపూర్‌ అన్నారు.

అంతర్జాతీయ పరిణామాలు ఆశాజనకం..
మార్కెట్‌ వర్గాలను ఇరకాటంలో పడేసిన వాణిజ్య యుద్ధం తాత్కాలికంగా ఆగింది. అమెరికా–చైనాల మధ్య ట్రేడ్‌వార్‌కు ప్రస్తుతానికి తెరపడింది. గతంలో ఆగిపోయిన వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌  పింగ్‌లు అంగీకరించారు. జపాన్‌ లోని ఒసాకాలో జరుగుతున్న జీ–20 సదస్సు సందర్భంగా శనివారం సమావేశమైన ఇరువురు నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం మార్కెట్‌కు సానుకూల అంశంగా ఉంది. వివాదం పరిష్కారం అయ్యేంత వరకూ చైనా ఉత్పత్తులపై కొత్తగా సుంకాలు విధించబోమని ట్రంప్‌ ప్రకటించారు. మరోవైపు ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ , ట్రంప్‌ల మధ్య ఆదివారం చరిత్రాత్మక భేటీ జరగడం కూడా మార్కెట్‌కు సానుకూల అంశంగా ఉంది. ఈ తాజా అంశాలపై మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించినట్లు సాహిల్‌ కపూర్‌ అభిప్రాయపడ్డారు.

స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి..
నికాయ్‌ ఇండియా తయారీ రంగ ఇండెక్స్‌ జూన్‌ నెల గణాంకాలు సోమవారం వెల్లడికానున్నాయి. సేవల డేటా బుధవారం వస్తుంది. మౌలికరంగ  డేటా శుక్రవారం మార్కెట్‌ ముగిశాక వెల్లడికానుండగా.. జూలై ఒకటి నుంచి గతనెల ఆటో రంగ అమ్మకాల సమాచారం వెల్లడికానుంది. మరోవైపు అంతర్జాతీయ అంశాల్లో.. ఈవారంలోనే అమెరికా, చైనా దేశాల తయారీ రంగ సమాచారం వెల్లడికానుంది.

రూ.10,384 కోట్ల విదేశీ నిధుల వెల్లువ
భారత్‌ క్యాపిటల్‌ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయనే అంచనాల కారణంగా వీరు వరుసగా ఐదో నెల్లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. జూన్‌లో ఈక్విటీ మార్కెట్లో రూ.2,273 కోట్లు.. డెట్‌ మార్కెట్లో రూ.8,112 కోట్లను ఇన్వెస్ట్‌చేశారు. మొత్తంగా గత నెలలో రూ.10,384 కోట్లను పెట్టుబడిపెట్టారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.87,313 కోట్లను వీరు పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement