
బీజింగ్: ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా చైనాల మధ్య ట్రేడ్‌వార్ ముదురుతోంది. "తమలపాకు తొ నువ్వొకటి అంటె తలుపు చెక్కతో నేనొకటి అంటా’’ అన్నచందాన పెద్దన్నకు గట్టి రిటార్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అమెరికాలో చైనా దిగుమతులకు ట్రంప్ సర్కార్ చెక్ పెడితే.. చైనాలో అమెరికా వస్తువుల దిగుమతులకు చెక్ పెట్టేందుకు జీ జిన్‌పింగ్ ప్రభుత్వం ప్రణాళికలు ప్రకటించింది. ఈ చర్యలతోపాటు అమెరికాతో వాణిజ్య యుద్ధంపై తమకు ఎలాంటి భయాలు లేవని స్పష్టం చేసింది. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై అమెరికా దిగుమతి సుంకానికి ప్రతిస్పందనగా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుటిఓ)ను ఆశ్రయించనుంది. అమెరికాపై చట్టపరమైన చర్యలను కోరనున్నామనీ, ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు జోక్యం చేసుకోవాలని డబ్ల్యుటిఓని కోరునున్నట్టు చైనా ఒక ప్రకటనలో తెలిపింది.
చైనా ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకం విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం గురువారం సంతకం చేసింది. చైనా వస్తువులపై 60 బిలియన్ డాలర్ల వరకు సుంకాలను ప్రతిపాదించింది. 30-రోజుల సంప్రదింపులు జరిపిన తరువాత మాత్రమే ఈ నిర్ణయాన్ని అమలు చేయనునున్నట్టు ట్రంప్ సర్కార్ వెల్లడించింది. దీనికి చైనాకూడా కౌంటర్ ఎటాక్‌గా అమెరికానుంచి దిగుమతి అయ్యే డ్రై ఫ్రూట్స్, వైన్, స్టీల్ పైప్స్‌లపై 15శాతం, పంది మాంసం ఉత్పత్తులపై 25 శాతం సుంకం, రీసైకిల్ చేసిన అల్యూమినియంపై సుంకాలను చైనా పరిశీలిస్తోందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు దేశాల వాణిజ్య సమస్యలపై ఒప్పందం కుదరని పక్షంలో 3 బిలియన్ డాలర్ల మేర సుంకం విధించనుంది. ఇందుకు అమెరికాకు చెందిన మొత్తం 128 ఉత్పత్తులతో కూడిన జాబితాను సిద్ధం చేసింది.