
వాణిజ్య యుద్ధాల పరిణామాలు ఏ స్థాయిలో ఉంటాయో కూడా మనం ఊహించలేం. బడాబడా ఆర్థిక వ్యవస్థలు సైతం ఒక్కసారిగా కుప్పకూలిపోతాయి. ఈ యుద్ధం వస్తుందంటే బలమైన ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు సైతం హడలిపోతాయి. ఇటీవల అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం(ట్రేడ్ వార్) చోటు చేసుకునే సంకేతాలే చక్కర్లు కొట్టాయి. చైనాను ట్రేడ్ వార్ దిశగా అమెరికా ప్రలోభించడం, మీరు కనుక ట్రేడ్ వార్‌కి తెరలేపితే, తాము ఏ మాత్రం సహించమంటూ చైనా హెచ్చరించడం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ మరింత చర్చనీయాంశంగా మారింది. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై భారీగా సుంకం విధిస్తున్నట్టు ప్రకటించిన అనంతరం ట్రంప్ ట్రేడ్ వార్ మంచిదేనంటూ ట్వీట్ చేశారు.
''ట్రేడ్ వార్స్ మంచివే. తేలికగా గెలవచ్చు'' అని ట్వీట్ ద్వారా ట్రేడ్ వార్ సంకేతాలు పంపారు. దాదాపు ప్రతి దేశంతో జరిగే యూఎస్‌ఏ జరిపే వాణిజ్యంలో అనేక బిలియన్ డాలర్లను కోల్పోతోంది. ఈ క్రమంలో వాణిజ్య యుద్ధాలు మంచివి, సులభంగా వాటిని గెలుచుకోవచ్చూ అంటూ ట్వీట్ చేశారు. ట్రంప్ గురువారం స్టీల్ దిగుమతులపై భారీగా సుంకం విధించనున్నామనే ప్రకటన అనంతరం ఈ ట్వీట్ చేయడం గమనార్హం. ప్రపంచ మార్కెట్లన్నీ ట్రంప్ ఇస్తున్న ట్రేడ్ వార్ సంకేతాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. చైనా, యూరోప్, పొరుగు దేశం కెనడా లాంటి ప్రధాన వాణిజ్య భాగస్వాముల స్టీల్ దిగుమతులపై భారీ సుంకం విధించనున్నామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ట్రంప్ చైనాపై విరుచుకుపడ్డారు.