తీవ్ర ఒడిదుడుకులు ఎదురయినా, సమీపకాలంలో పసిడి పటిష్టమేనన్నది నిపుణుల వాదన. అమెరికా–చైనా మధ్య చర్చ మధ్య మధ్యలో చర్చలు జరిగినా, వాణిజ్య యుద్ధంపై కొనసాగుతున్న తీవ్ర అనిశ్చితి, సౌదీ చమురు క్షేత్రాలపై జరిగిన డ్రోన్ దాడుల నేపథ్యంలో భౌగోళికంగా ఉద్రిక్తతలు వంటి అంశాలు పెట్టుబడులకు తక్షణ ఆకర్షణీయ మెటల్‌గా పసిడిని కొనసాగిస్తున్నాయి. శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సేంజ్‌లో 1,524 డాలర్ల వద్ద ముగిసింది. వారంవారీగా చూస్తే, ఇది దాదాపు 20 డాలర్ల పెరుగుదల. శుక్రవారంతో ముగిసిన గడచిన 15 రోజుల్లో రెండుసార్లు పసిడి 1,500 డాలర్ల లోపునకు పడింది. ఇది బంగారానికి పటిష్టస్థాయి. ఈ స్థాయి దిగువనకు పడిపోయినా, వెంటనే పసిడి 1,500 డాలర్లపైకి లేచింది. అమెరికా ఆర్థిక అనిశ్చితి పరిస్థితి, దీనితో ఆ దేశ సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు పావుశాతం తగ్గింపు (ప్రస్తుతం 2 నుంచి 1.75 శ్రేణిలో) వంటి అంశాలు పసిడికి మద్దతునిచ్చేవే కావడం గమనార్హం.
దేశీయంగానూ పటిష్టమే..
దేశీయంగానూ పసిడి ధర సమీప భవిష్యత్తులో పటిష్టంగానే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి బలహీన ధోరణి దీనికి కారణమన్నది వారి విశ్లేషణ. పలు పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం 72–70 శ్రేణిలో కొనసాగుతోంది. చమురు ధర పెరుగుదల భయాల నేపథ్యంలో దీర్ఘకాలంలో రూపాయిది బలహీన ధోరణేనన్నది నిపుణుల అభిప్రాయం. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి ధర శుక్రవారం రూ.37,697 వద్ద ముగిసింది.
1,600 డాలర్ల వరకూ...
ఔన్స్‌కు 1,600 డాలర్ల వరకూ పసిడి ర్యాలీ చేసే అవకాశం ఉంది. అయితే వాణిజ్య చర్చలు, మార్కెట్ అంశాలు వంటివి పసిడిని 1,400 డాలర్ల నుంచి 1,600 డాలర్ల శ్రేణిలో నిలిపే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ధర ఎక్కడ ఉన్నది ముఖ్యం కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి పట్ల ఇన్వెస్టర్ ధోరణి ఎలా ఉంది అన్నది ఇక్కడ కీలకం. ఈ దిశలో పసిడికి సానుకూల అంశాలే కనిపిస్తున్నాయి.
– క్రిస్టినా హూపర్, ఇన్వెస్కో చీఫ్ గ్లోబల్ మార్కెట్ వ్యూహకర్త
పసిడి పరుగు పటిష్టమే
Published Mon, Sep 23 2019 12:40 AM | Last Updated on Mon, Sep 23 2019 1:21 PM
Comments
Please login to add a commentAdd a comment