సౌదీ అరేబియా X ఇరాన్‌ విద్వేష గీతం: వరుస మారింది | Iran and Saudi Arabia agree to restore relations | Sakshi
Sakshi News home page

సౌదీ అరేబియా X ఇరాన్‌ విద్వేష గీతం: వరుస మారింది

Published Sat, Apr 8 2023 4:36 AM | Last Updated on Sat, Apr 8 2023 4:36 AM

Iran and Saudi Arabia agree to restore relations - Sakshi

బద్ధ విరోధులైన సౌదీ అరేబియా, ఇరాన్‌ క్రమంగా దగ్గరవుతున్నాయి. దశాబ్దాల వైరానికి తెర దించే దిశగా సాగుతున్నాయి. దౌత్య బంధాలను పునరుద్ధరించుకోవడంతో పాటు ఆర్థిక సంబంధాలను కూడా బలోపేతం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాయి. మధ్య ప్రాచ్యంపై పట్టు పెంచుకునే యత్నాల్లో భాగంగా ఈ సయోధ్యకు చైనా మధ్యవర్తిత్వం వహిస్తోంది.

అంతర్జాతీయంగా అత్యంత ఆసక్తి రేపుతున్న ఈ పరిణామాన్ని చైనాకు కీలక దౌత్య విజయంగా భావిస్తున్నారు. రెండు శత్రు దేశాల మధ్య సయోధ్య యత్నాల్లో డ్రాగన్‌ దేశం నేరుగా పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాపై అమెరికా పెత్తనానికి బీటలు వారుతున్నట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలను భారత్‌ నిశితంగా గమనిస్తోంది...

పశ్చిమాసియాలో చిరకాల ప్రత్యర్థులైన సౌదీ అరేబియా, ఇరాన్‌ మధ్య మొగ్గతొడుగుతున్న కొత్త దోస్తీ ఒక రకంగా అనూహ్యమే. ఇది ప్రపంచ దేశాలను కాస్త ఆశ్చర్యపరిచింది కూడా. 2016లో షియా మత పెద్దను సౌదీ చంపేయడం, ప్రతిగా ఇరాన్‌లోని ఆ దేశ దౌత్య కార్యాలయాలపై దాడులతో దశాబ్దాల వైరం తారస్థాయికి చేరింది. దౌత్య తదితర సంబంధాలన్నీ తెగిపోయాయి. మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాలూ దగ్గరయ్యే ప్రయత్నాలు 2021 నుంచీ జరుగుతున్నాయి.

చైనా చొరవతో అవి రెండు నెలలుగా ఊపందుకున్నాయి. నెల రోజులుగా బీజింగ్‌ వేదికగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న మంత్రుల స్థాయి భేటీలు సయోధ్యకు గట్టి పునాదులే వేశాయి. విదేశాంగ మంత్రులు హొస్సైన్‌ అమిరబ్దొల్లాహియాన్‌ (ఇరాన్‌), ఫైజల్‌ బిన్‌ ఫర్హాన్‌ అల్‌ సౌద్‌ (సౌదీ) బీజింగ్‌లో తాజాగా చర్చలు జరిపారు. ఇరు దేశాల్లో పరస్పరం దౌత్య కార్యాలయాలను తిరిగి తెరిచేందుకు Vఅంగీకారానికి వచ్చారు. రెండు దేశాల మధ్య విమాన సర్వీసులతో పాటు వీసా జారీకి అవకాశాలను పరిశీలించనున్నట్టు హొస్సైన్‌ తెలిపారు.

ఈ పరిణామాలు పశ్చిమాసియా ప్రాంతీయ, భౌగోళిక రాజకీయాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చంటున్నారు. ‘‘యెమెన్‌ నుంచి లెబనాన్‌ దాకా వేర్పాటువాద పోరాటాల్లో చెరో వైపుండి ఇరాన్‌–సౌదీ చేస్తున్న ప్రచ్ఛన్న యుద్ధానికి తెర పడుతుంది. ఇది పశ్చిమాసియాలో రాజకీయ స్థిరత్వానికి దారి తీయవచ్చు’’అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇదంతా సౌదీ–ఇరాన్‌ బంధం ఏ మేరకు గట్టిపడుతుందనే దానిపై ఆధారపడి ఉంటుందన్నది వారి అభిప్రాయం.

దశాబ్దాల వైరం
సౌదీ అరేబియా, ఇరాన్‌ వైరం ఈనాటిది కాదు. 1979 విప్లవంతో ఇరాన్‌లో రాచరికానికి తెర పడి మతవాద శక్తుల ఆధిపత్యంతో కూడిన ప్రభు­త్వం ఏర్పడటంతో అది మరింత ముదిరింది.
► ఇరాన్‌ ప్రధానంగా షియా ఆధిపత్య దేశం కాగా సౌదీ అరేబియా సున్నీ ప్రాబల్య దేశం.
► ప్రాంతీయంగా ఆధిపత్య కాంక్ష తదితరాలు వాటి శత్రుత్వానికి మరింత ఆజ్యం పోశాయి.
► 2016లో ప్రముఖ షియా నేత షేక్‌ నిమ్ర్‌ అల్‌ నిమ్ర్‌ను ఉగ్రవాద ఆరోపణలపై సౌదీ తల నరికి చంపడంతో ఇరాన్‌ భగ్గుమంది. భారీ మూల్యం తప్పదని హెచ్చరించింది. మధ్య ప్రాచ్యంలోని పలు దేశాల్లో సౌదీ వ్యతిరేక పోరాట గ్రూపులకు బాసటగా నిలవసాగింది.
► ఇరాక్, సిరియా, యెమన్, లెబనాన్‌ వంటి పలు దేశాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాల్లో సౌదీ, ఇరాన్‌ చెరో వర్గం వైపు నిలిచి ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నాయి. సిరియాలో రెబెల్‌ గ్రూపులకు సౌదీ మద్దతిస్తుండగా అధ్యక్షుడు అల్‌ బషర్‌కు ఇరాన్‌ దన్నుగా నిలిచింది.
►  సరిహద్దు దేశమైన యెమన్‌లో తాము అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్‌ సాయుధ, ఆర్థిక సాయం చేస్తోందని సౌదీ గుర్రుగా ఉంది.
► 2003లో అమెరికా ఇరాక్‌పై దాడి చేసి సద్దాం హుస్సేన్‌ను గద్దె దించడంతో అక్కడ సున్నీల ఆధిపత్యానికి తెర పడింది. అప్పటినుంచీ ఇరాక్‌లోని షియా ప్రాబల్య ప్రభుత్వంపైనా ఇరాన్‌ పట్టు పెరిగింది. తాజా చర్చల అనంతరం యెమెన్‌లోని హౌతీలకు సాయాన్ని నిలిపేసేందుకు ఇరాన్‌ అంగీకరించిందని సమాచారం.
► పశ్చిమాసియాలో ఇటీవల మార్పు పవనాలు వీస్తున్నాయి. వైరి దేశాలు స్పర్ధలను పక్కన పెట్టి ఒక్కటవుతున్నాయి. అరబ్‌ దేశమైన యూఏఈ 2020లో ఇజ్రాయెల్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా ముందడుగు వేసింది.


చైనా.. పశ్చిమాసియాలో పవర్‌ బ్రోకర్‌
అమెరికా స్థానంలో పశ్చిమాసియాలో పెద్దన్న పాత్రను పోషించేందుకు చైనా కొన్నేళ్లుగా గట్టి ప్రయత్నాలే చేస్తోంది.
► 2015లో ఇరాన్‌ అణు ఒప్పందం వంటి బహుపాక్షిక శాంతి చర్చల్లో చైనా చురుగ్గా పాల్గొంది. తొలుత అమెరికా కూడా భాగస్వామిగా ఉన్నా 2018లో ఉన్నట్టుండి వైదొలగింది.
► చైనా ప్రపంచంలో అతి పెద్ద చమురు దిగుమతిదారు. అందుకే చమురు నిల్వలు బాగా ఉన్న పశ్చిమాసియాపై పట్టు కోసం ప్రయత్నిస్తోంది.
► అటు ఇరాన్‌తో, ఇటు సౌదీ అరేబియాతో చైనాకు ముందునుంచీ మంచి సంబంధాలే ఉన్నాయి. మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య ముందునుంచీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి! సౌదీతో కూడా అమెరికా సంబంధాలు కొంతకాలంగా క్షీణిస్తున్నాయి. ముఖ్యంగా బైడెన్‌ హయాంలో అవి మరీ దిగజారాయి.
► పొరుగునున్న యెమెన్‌లోని హౌతీ మూకలతో చిరకాల పోరాటంతో అలసిన సౌదీ శాంతి మంత్రం జపిస్తోంది. అమెరికా ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్‌ కూడా ఆర్థికంగా ఊపిరి పీల్చుకునే అవకాశాల కోసం చూస్తోంది. ఈ పరిస్థితులు చైనాకు కలసి వచ్చాయి.
► చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ గత డిసెంబర్‌లో రియాద్‌ వెళ్లి సౌదీ–ఇరాన్‌ నాయకత్వంతో మంతనాలు జరిపారు. తర్వాత ఫిబ్రవరిలో ఇరా­న్‌ అధ్యక్షునితో బీజింగ్‌లోనూ చర్చలు జరిపి ఇరు దేశాల చర్చలకు రంగం సిద్ధం చేశారు.
► మధ్య ప్రాచ్యంతో అమెరికా వర్తకమూ క్రమంగా క్షీణిస్తోంది. 2019లో 120 బిలియన్‌ డాలర్ల నుంచి 2021లో 80 బిలియన్‌ డాలర్లకు తగ్గింది.
► మరోవైపు మధ్య ప్రాచ్య దేశాలతో వాణిజ్య సంబంధాలను చైనా నానాటికీ పెంచుకుంటూ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈజిప్ట్, ఇరాన్, జోర్డాన్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈలకు అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా చైనా అవతరించింది.  


–సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement