
సాక్షి, న్యూఢిల్లీ: కీలకమైన విదేశాంగ శాఖ మంత్రిగా ఎస్ జైశంకర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు దేశాలతో దౌత్యపరమైన సమస్యలు శంకర్‌కు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా భారత్-చైనా, అమెరికా-భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సి ఉంది. భారత్‌కు పక్కలో బళ్లెంలా తయారైన చైనాతో దశాబ్దాలుగా సరిహద్దు సమస్య వెంటాడుతోంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, డోక్లాం సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు పాల్పడుతోంది. మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ఈ సమస్య పరిష్కారానికి ఎంతో కృషిచేసినప్పటికీ.. సరిహద్దుల్లో రెండు దేశాల మధ్య యుద్ధ వాతవారణం అప్పడప్పుడు కనిపిస్తూనే ఉంది. భారత భూభాగంలో భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌ను తమ దేశ పటంలో చూపిస్తూ.. డ్రాగాన్ అనేక సార్లు దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. వీటన్నింటని జై శంకర్ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా, జపాన్, కొరియాలతో వ్యూహాత్మక ఒప్పందాలు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థ గల దేశాలైన అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలకు తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలు పెంచడమే ఇందుకు కారణం. మరో 200 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై సుంకాలను ట్రంప్ రెట్టింపు చేశారు. దీని ప్రభావం భారత్‌పై కూడా పడే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవల కాలంలో అమెరికాకు ఇండియా దగ్గర కావడం చైనాకు మింగుడుపడడంలేదు. న్యూక్లియర్ ఒప్పందం (అమెరికా-చైనా) చైనాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. భారత్ ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వనికి మద్దతు ఇవ్వడానికి చైనా అభ్యంతరం చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జైశంకర్ ఎంతో వ్యూహత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్ అనుసరిస్తున్న లుక్ ఈస్ట్ పాలసీ చైనాకు చేదుగుళికలా తయారైంది. తన పొరుగు దేశాలైన జపాన్, వియాత్నం దేశాలతో భారత్ మరింత దూకుడుగా వ్యవహరించాల్సి ఉంటుంది. దీంతో చైనాను కొంతమెర అడ్డుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చైనా వ్యతిరేక శక్తులైన అమెరికా, జపాన్, కొరియా, లాంటి దేశాలతో భారత్ వ్యహాత్మక ఒప్పందాలను కుదుర్చుకోవాలి.
భారత్‌కు ట్రంప్ షాక్
ఇదిలావుండగా.. భారత్‌కు వాణిజ్య ప్రాధాన్య హోదా (జీఎస్‌పీ)ను త్వరలో తొలగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఈ పరిణామం భారత్‌ను షాక్‌కు గురిచేసింది. ట్రంప్ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపనుందనే విషయం ఇప్పుడు భారత్‌లో చర్చనీయాంశమైంది. అమెరికాకు మన దేశం ఎలాంటి సుంకం చెల్లించకుండా ఏడాదికి రూ.39 వేల కోట్ల విలువైన వస్తువుల్ని ఎగుమతి చేస్తోంది. జీఎస్‌పీ హోదా తొలగిస్తే మనం ఆ వస్తువుల ఎగుమతికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా వాణిజ్య లోటును తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్ భారత్ వస్తువులపై సుంకాలు విధిస్తామని గతంలో పలుమార్లు హెచ్చరించారు. ఇప్పుడు ఏకంగా వాణిజ్య ప్రాధాన్య హోదాను తొలగించడానికే సిద్ధమయ్యారు. ఇన్ని సవాళ్ల నడుమ జైశంకర్ విదేశాంగశాఖను నడిపించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment