
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మాంద్యం భయాలు, ఇన్వెస్టర్ల నుంచి పటిష్టమైన డిమాండ్ ఊతంతో పసిడి రేట్ల పరుగు కొనసాగుతోంది. తాజాగా గురువారం మరో కొత్త గరిష్ట స్థాయిని తాకింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 40,220కి చేరినట్లు ఆలిండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. ఇది పసిడికి జీవిత కాల గరిష్ట స్థాయి. రెండు రోజుల క్రితమే ముంబై మార్కెట్‌లో పసిడి రూ. 40 వేల మార్కును దాటి రూ. 40,100కి చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు, వెండి ధర కూడా క్రమంగా రూ. 50,000 మార్కుకు చేరువవుతోంది. కేజీకి రూ. 200 పెరిగి రూ. 49,050కి చేరింది. అంతర్జాతీయంగా మాంద్యం భయాలు, వాణిజ్య యుద్ధంపై అమెరికా–చైనా మధ్య చర్చల విషయంలో అనిశ్చితి తదితర అంశాలు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారానికి మద్దతుగా నిలుస్తున్నాయని బులియన్ ట్రేడర్స్ తెలిపారు.