అమెరికా వర్సెస్‌ ఇండియా? కాదు కాదు.. | Usa Trade War Against India Or Its Own People | Sakshi
Sakshi News home page

అమెరికా వర్సెస్‌ ఇండియా? కాదు కాదు..

Published Mon, Jun 24 2019 1:11 PM | Last Updated on Mon, Jun 24 2019 1:19 PM

Usa Trade War Against India Or Its Own People - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్, అమెరికాల ట్రేడ్‌వార్‌పై ఎకనమిక్‌ టైమ్స్‌ ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం.. అమెరికా భారత్‌ ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. దీనికి దీటుగా భారత్‌ కూడా స్పందించి 28 రకాల అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. ఇది జాతీయవాదులకు ఉత్సాహం అనిపించినా ఇరుదేశాల సగటు పౌరునికి నష్టం కలిగిస్తుంది. దీన్ని ఇరు దేశాల ట్రేడ్‌వార్‌ అని భావించవచ్చు. కానీ విశ్లేషకులు మాత్రం దీనిని ట్రంప్‌, మోదీలు తమ సొంత ప్రజలపైనే చేస్తున్న వాణిజ్య యుద్ధంగా పిలుస్తున్నారు. ఇక్కడ ఒక విషయం గమనిద్దాం. ట్రంప్‌ అధికారంలోకి రావడానికి కారణం అతను అమెరికా ప్రజల సమస్యలకు చాలా సరళమైన, తప్పుదోవ పట్టించే వాటిని కారణాలుగా చూపించాడు. 
1.మీ ఉద్యోగాలను విదేశీయులు వచ్చి దోచుకుంటున్నారు.
2.మీ ఉద్యోగాలు విదేశాలకు తరలిపోతున్నాయి.
ఈ రెండు వివరణలు తప్పు కానీ అవి ట్రంప్‌కోసం పనిచేశాయి. వాటిని ట్రంప్‌ ఇంకా నమ్ముతున్నారు. మొదటి కారణంతో అమెరికన్లు వలసదారులను ద్వేషించడం మొదలుపెట్టారు. రెండవ కారణంగా టారిఫ్‌లు పెంచడంతో ఇతరదేశాలతో అమెరికా వాణిజ్యం ప్రభావితం అయింది. టారిఫ్‌ల పెంపుపై  ఓ ఆర్థికవేత్త ఇందిరా జమానా నాటి ‘ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిర’ నినాదం లాగా నేడు ‘ట్రంప్‌ అంటే టారిఫ్‌, టారిఫ్‌ అంటే ట్రంప్‌’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు.

అసలు ట్రేడ్‌వార్‌ ఎందుకంటే? 
ట్రేడ్‌వార్‌ దిశగా దేశాలను నడిపిస్తున్న శక్తులు నిస్సహందేహంగా దేశీయ పారిశ్రామికవేత్తలే. ఉదాహరణకు ఒక వస్తువు ధర రూ.100 ఉందనుకోండి. దాన్ని విదేశీ కంపెనీ రూ.90కే అందిస్తే సహజంగానే కొనుగోలుదారులు అటువైపు అడుగులు వేస్తారు. దీంతో దేశీయ వ్యాపారులు జట్టుకట్టి భయానో, నయానో రాజకీయ నాయకులతో విదేశీ వస్తువుపై సుంకం విధించేలా చేసి దాని ధరను రూ.110కి పెంచారనుకోండి అప్పుడు తిరిగి కొనుగోలుదారులు దేశీయ వస్తువుపై మొగ్గుచూపుతారు. ఇక్కడ నష్టపోయేది వినియోగదారులే. స్థానిక వ్యాపారులకు మిగిలిన ఆ రూ.10తో ఏదైనా ఉద్యోగాలు సృష్టిస్తున్నారా? లేక దేశ సంపదను పెంచుతున్నారా?. కచ్చితంగా అది వారి జోబుల్లోకి, అటునుంచి నల్లధనంగా మారుతుంది.

అదే రూ.10 వినియోగదారునికి మిగిలితే మరొక వస్తువును కొనడానికి ఉపయోగిస్తాడు. అంటే సంపద ఎక్కువ మంది చేతిలో మిగులుతుంది. కాని అక్కడ కేవలం కొద్ది మంది వ్యాపారుల చేతిలోకి వెళ్తుంది. అంటే ఇక్కడ ఒక వస్తువుపై టారిఫ్‌ విధించడం ద్వారా ఆదాయాన్ని కొద్దిమంది చేతుల్లోకి నెడుతున్నాం. మరి టారిఫ్‌ విధించడంలో ఉపయోగాలు ఎక్కడ ఉన్నట్లు?. అందుకే దీన్ని తమ సొంత ప్రజలపై ప్రభుత్వం విదించే పన్నుగానే భావించాలి. అలాగే అమెరికా దిగుమతుల్లో ఎక్కువగా ముడి పదార్థాలే ఉంటాయి. అది ఒక దేశం మీద టారిఫ్‌ విధించినపుడు వాటి ధరలు పెరుగుతాయి. ఆపిల్‌ కంపెనీనే తీసుకుంటే ఒక ఫోన్‌ ఉత్పత్తికి 43 దేశాలనుంచి ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటుంది. వాటి ధరలు పెరిగినపుడు ఆపిల్‌ ధర కూడా పెరుగుతుంది. దీంతో వాటి అమ్మకాలు తగ్గి వాటి ఉద్యోగాల్లో కోత పడుతుంది.

సుంకాలు లేని వ్యాపారం
వాణిజ్యంలో ఎలా గెలవాలి అని ట్రంప్‌ నిరంతర ఆలోచన. కానీ ఈ ఆటలో గెలుపు అంత సులువు కాదు. ఎందుకంటే ట్రంప్‌ను ఆ దిశగా ఆలోచింపచేసిన పదం వాణిజ్యలోటు. దీన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాము. ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువ ఉంటే దానర్థం మనం నష్టపోతున్నామని కాదు, ఎందుకంటే మనం ఇచ్చేదానికన్నాతీసుకునేది ఎక్కువగా ఉంది, అలాగే ఇతర దేశాల వస్తువులు మన మార్కెట్‌ను తక్కువధరలకే నింపుతున్నాయి. ఇవి చిన్న వ్యాపారులకు నష్టం అని భావించేకన్నా మన సంపదలో అధిక వాటా కేవలం మనదేశంలోని కొంత మంది చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది అనేది ఆలోచించాలి. సుంకాలు లేని బడావ్యాపారం అనేది ఇరుదేశాల వాణిజ్య విజయం అవుతుంది. అందుకే టారిఫ్‌లను ప్రజలను దోచుకునే వాటిగానే భావించి, ఇరుదేశాల వాణిజ్యయుద్ధాన్ని ఇరుదేశ ప్రజానీకాలపై తమ నాయకులు చేస్తున్న యుద్ధంగానే చూడాలి.

పోటీపడినా చివరికి మిగిలేది?
చివరగా ఏంటంటే ట్రంప్‌ భారతీయ వస్తువులపై టారిఫ్‌లు పెంచుతారు. అంటే తన ప్రజలపై పన్ను విధిస్తారు. మోదీ దీనికి అనుగుణంగా అమెరికా వస్తువులపై టారిఫ్‌లు పెంచుతారు. ట్రంప్‌ ఇంకా పన్నులు పెంచుతారు. ఇది చూసిన మోదీ మరిన్ని పన్నులు పెంచుతారు. అంతిమంగా ఇరుదేశాల ప్రజలు నష్టపోతారు. ఇదంతా చూ(చే)స్తున్న ఇరుదేశాలలోని లాబీయింగ్‌ మాత్రం లోలోన నవ్వుతుంటుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement