భారత్ మా ప్రధాన రక్షణ భాగస్వామి
ప్రధాని మోదీతో అమెరికా భద్రతా సలహాదారు భేటీ
న్యూఢిల్లీ: భారత్ తమ ప్రధాన రక్షణ భాగస్వామి అని అమెరికా పునరుద్ఘాటించింది. మంగళవారం ఢిల్లీలో ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు హెచ్‌ఆర్ మెక్‌మాస్టర్ సమావేశమయ్యారు. ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇరుదేశాలు కలసి ఏ విధంగా పోరాడాలనే దానిపై, ప్రాంతీయ శాంతి భద్రతలు, స్థిరత్వం నెలకొల్పడంపై సమావేశంలో మోదీ, మెక్‌మాస్టర్ చర్చించారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక భారత్ పర్యటనకు వచ్చిన యూఎస్ తొలి ఉన్నతస్థాయి అధికారి మెక్‌మాస్టర్.
ఈ సమావేశంలో పశ్చిమ ఆసియా, అఫ్ఘానిస్తాన్, ఉత్తరకొరియా తదితర దేశాల్లో భద్రత పరిస్థితులపై మెక్‌మాస్టర్ తన అభిప్రాయాన్ని మోదీకి వివరించారు. జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి జయశంకర్‌తోనూ మెక్‌మాస్టర్ చర్చలు జరిపారు. గత డిసెంబర్‌లో ఒబామా ప్రభుత్వం.. భారత్‌కు ప్రధాన రక్షణ భాగస్వామి హోదాను కల్పించిన విషయం తెలిసిందే. భారత పర్యటన కన్నా ముందు పాక్ వెళ్లిన మెక్‌మాస్టర్.. ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో పలు అంశాలపై చర్చలు జరిపారు.