పాకిస్తాన్పై భారత్ సాయం కావాలి: ట్రంప్
వాషింగ్టన్: పూర్తి స్థాయి న్యూక్లియర్ వ్యవస్థ లేని పాకిస్థాన్ సమస్య గురించి ఇండియా తదితర దేశాల సాయాన్ని కోరుతున్నట్లు అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ ఫ్రంట్ రన్నర్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇండియానా పోలీస్లోని టౌన్హాల్ లో మాట్లాడుతూ... పాకిస్తాన్ వంటి దేశాలతో ఎలా డీల్ చేస్తారనే ప్రశ్న అడగ్గా ట్రంప్ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కు న్యూక్లియర్ ఆయుధాలు ఉండటమే నిజమైన సమస్య అని ఆయన అన్నారు.
మొత్తం తొమ్మిది దేశాలు న్యూక్లియర్ ఆయుధాలను కలిగి ఉన్నాయి. ఇది ఒకే ఒక్క పెద్ద సమస్య అని అన్నారు. పాకిస్తాన్తో కొద్దిపాటి సత్సంబంధాలు ఉన్నాయి. తాను వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. పాకిస్తాన్కు అమెరికా చాలాసార్లు ఆర్ధికంగా సాయం చేసింది. ఆ దేశ ప్రవర్తన మీద తర్వాతి పరిణామాలు, విపరిణామాలు ఆధారపడి ఉంటాయని అన్నారు. భారత్, మరికొన్ని దేశాలు అమెరికాకు సాయం చేస్తున్నాయి. ఇప్పటివరకు అమెరికా చాలా దేశాల నుంచి ఎలాంటి ఫలితాలను ఆశించకుండా సాయం చేసిందని, ఇక ముందు అలా జరగదని ట్రంప్ పేర్కొన్నారు. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఒబామా ప్రభుత్వం బిలియన్ డాలర్ల కొద్దీ పాక్కు సాయం చేయడాన్నిఆయన ప్రశ్నించారు.
పాకిస్తాన్కు 9/11 దాడుల తర్వాత నుంచి ఇప్పటివరకు చేసిన 25 బిలియన్ డాలర్ల సాయాన్ని ఆ దేశం తన మిలటరీ సారథ్యంలో నడుస్తున్న ఉగ్రవాద సంస్థలకు ఊపిరి ఊది భారత్లో ప్రాణాంతక దాడులు చేసిందని అమెరికన్ కాంగ్రెస్కు చెందిన నేత మ్యాట్ సల్మాన్ వాదించారు. 180 మిలియన్ల జనాభా, 100కు పైగా న్యూక్లియర్ ఆయుధాలు, రాజకీయంగా వెనుకబడి టెర్రరిస్టులకు ఆవాసంగా మారిన పాకిస్తాన్ 2016-2017 సంవత్సరానికిగాను 742.2 మిలియన్ల యూఎస్ డాలర్ల సాయాన్ని కోరినట్టు, ఇవన్నీ దేశ భద్రతకే ఉపయోగపడాలని భారత్తో యుధ్దానికి కాదని మరో కాంగ్రెస్ నేత బ్రాడ్ షేర్మ్యాన్ చెప్పారు.