ఉగ్రభూతంపై సమరమే! | Surgical strikes showed world our power: PM Modi | Sakshi
Sakshi News home page

ఉగ్రభూతంపై సమరమే!

Published Wed, Jun 28 2017 1:03 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

ఉగ్రభూతంపై సమరమే! - Sakshi

ఉగ్రభూతంపై సమరమే!

► ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించటమే ధ్యేయం
► సంయుక్త మీడియా ప్రకటనలో మోదీ–ట్రంప్‌


వాషింగ్టన్‌ : ఉగ్రవాదం పీచమణిచేందుకు ఉమ్మడిగా కఠినమైన పోరాటాన్ని చేయనున్నట్లు భారత్‌–అమెరికా వెల్లడించాయి. అమెరికాలో శ్వేతసౌధంలోని రోజ్‌గార్డెన్‌లో చారిత్రక సమావేశం తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంయుక్త మీడియా ప్రకటనను విడుదల చేశారు.

ముంబై దాడులు, పఠాన్‌కోట్‌ ఘటనలో దోషులపై పాకిస్తాన్‌ కఠినంగా వ్యవహరించాలని, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటాన్ని మానుకోవాలని ఈ ప్రకటన ద్వారా హెచ్చరించారు. దీంతోపాటుగా వాణిజ్యం, ఆర్థికాభివృద్ధితోపాటు రక్షణ, భద్రత రంగాల్లో వ్యూహాత్మక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వంతోపాటుగా ఎన్‌ఎస్‌జీ, వాసెనార్, ఆస్ట్రేలియా గ్రూపుల్లో భారత సభ్యత్వానికి తమ సంపూర్ణ మద్దతుంటుందని ట్రంప్‌ స్పష్టం చేశారు.

ఉగ్రవాదంపై పోరులో
ప్రపంచానికే పెనుసవాలుగా మారిన ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించనున్నట్లు ట్రంప్‌–మోదీ తెలిపారు. పాకిస్తాన్‌ తన భూభాగం ద్వారా జరగుతున్న ఉగ్ర కార్యక్రమాలను అడ్డుకోవాలని హెచ్చరించారు. ముంబై (26/11), పఠాన్‌కోట్‌ దాడుల ఘటనల్లో దోషులు, సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న వారిపై పాక్‌ కఠినంగా వ్యవహరించాలన్నారు. తన భూభాగం నుంచి ఉగ్రవాదులు ఇతర దేశాలపై దాడులకు పాల్పడకుండా పాక్‌ సర్కారు చర్యలు తీసుకోవాలన్నారు. వీరికి ఆశ్రయం ఇస్తున్న కేంద్రాలను ధ్వంసం చేయటం ద్వారా ఉగ్రవాదంపై పోరును ముందుకు తీసుకెళ్తాం’అని మోదీ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.

ఇరుదేశాలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయటంపై కృతనిశ్చయంతో ఉన్నాయని ట్రంప్‌ తెలిపారు. ‘భారత్‌–అమెరికా దేశాల మధ్య భద్రత భాగస్వామ్యం చాలా కీలకం. ఇరుదేశాలూ ఉగ్రబాధితులే. అందుకే ఉగ్రవాద సిద్ధాంతాలను, ఇస్లామిక్‌ ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ఉమ్మడిగా నిర్ణయించాం’అని ట్రంప్‌ స్పష్టం చేశారు. భారత్‌–అమెరికా కలిసి పోరాడితే ఇది సాధ్యమేనన్నారు. ఉగ్రవాద కదలికలు, ఉగ్ర నిధుల లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని పరస్పరమార్పిడి చేసుకోవాలని కూడా నిర్ణయించినట్లు సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.

అఫ్గానిస్తాన్‌లో శాంతిస్థాపనకై
ఉగ్రవాదం వల్ల అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న అస్థిరతపైనా వీరిద్దరూ చర్చించారు. ఆ దేశంలో శాంతి, స్థిరత్వం వచ్చేందుకు కలిసి కృషి చేయాలని నిర్ణయించారు. అఫ్గాన్‌లో ప్రజాస్వామ్యం, స్థిరత్వం, భద్రతను పరిరక్షించేందుకు భారత్‌ తీసుకుంటున్న చొరవనూ ట్రంప్‌ ప్రశంసించారు.

భారత ‘థింక్‌ వెస్ట్‌’ విధానానికి అనుగుణంగా మధ్యప్రాచ్యంలో దౌత్యపరమైన చర్చలు జరిపి ఆయా దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఇటీవల ఉత్తరకొరియా చేపడుతున్న విధ్వంసక క్షిపణుల ప్రయోగాలు సవాలుగా మారా యని ట్రంప్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఉ.కొరియాపై ఆంక్షలు విధించే విషయంలో అమెరికాకు మద్దతు తెలిపిన భారత్‌కు ట్రంప్‌ కృతజ్ఞతలు తెలిపారు.

వ్యూహాత్మక భాగస్వామ్యాలు
భారత్‌కు అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తింపు దిశగా మరింత సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. అత్యాధునిక రక్షణ పరికరాలు, సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉన్న దేశాలతో కలిసి పనిచేయనున్నారు. ఇందులో భాగంగానే సముద్రనిఘా కోసం 20 మానవరహిత వాయు భద్రత వ్యవస్థ (గార్డియన్‌ డ్రోన్స్‌) ను భారత్‌కు అమ్మాలని నిర్ణయించింది. సముద్రతీరంలో భద్రత కోసం ‘వైట్‌ షిప్పింగ్‌’డేటాను మార్పిడి చేసుకోవాలని కూడా మోదీ–ట్రంప్‌ నిర్ణయించారు.

దీని ద్వారా సముద్రతీరంలో సంయుక్తంగా భద్రతను పర్యవేక్షించేందుకు వీలుంటుంది. ‘ఇరుదేశాల భద్రతాదళాలు సహకారాన్ని పెంచుకోవటంపై పనిచేస్తున్నాయి. వచ్చే నెలలో హిందూ మహాసముద్రంలో జపాన్‌ నేవీతో కలసి అతిపెద్ద నౌకాదళ సంయుక్త మిలటరీ విన్యాసాలు చేయనున్నాం’అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇరుదేశాలు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక భాగస్వాములుగా ఉన్నందున.. అణుసరఫరా బృందం (ఎన్‌ఎస్‌జీ), వాసెనార్‌ అరేంజ్‌మెంట్, ఆస్ట్రేలియా గ్రూప్‌ (అణుశక్తి సరఫరాకు సంబంధించిన వేర్వేరు కూటములు)లలో భారత్‌ సభ్యత్వానికి బలమైన మద్దతుంటుంద న్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్య హోదా విషయంలోనూ తమ మద్దతుంటుం దని పునరుద్ఘాటించారు.

పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధితోపాటు పలు అవసరాల్లో హేతుబద్ధమైన విధానంతో ముందుకెళ్లనున్నట్లు తెలిపారు. భారత్‌లో ఆరు అణురియాక్టర్ల నిర్మాణానికి ఇండియన్‌ న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్, వెస్టింగ్‌హౌజ్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ (అమెరికా) మధ్య ఒప్పందాలు తుదిదశకు చేరేలా చొరవతీసుకోనున్నట్లు తెలిపారు. శిలాజ ఇంధనాల సాంకేతికత, స్మార్ట్‌ గ్రిడ్స్, విద్యుత్‌ నిల్వ వంటి అంశాల్లో పరస్పర సహకారాన్ని స్వాగతించారు. ఇండో–పసిఫిక్‌లో బాధ్యతాయుతదేశాలుగా ఉన్న భారత్‌–అమెరికా.. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి మరింత సహకరించుకోవాలని నిర్ణయించాయి.

స్వేచ్ఛా వాణిజ్యం పెంచుకునేందుకు
భారత్‌–అమెరికా దేశాలను ప్రపంచ ఆర్థికాభివృద్ధికి చోదకశక్తిగా పేర్కొన్న మోదీ.. వాణిజ్యం, పెట్టుబడులు ఈ దిశగా ముందుకెళ్లేందుకు ముఖ్యమైన అంశాలని వెల్లడించారు. ఇందుకోసం ఇరుదేశాల ఆర్థిక సహకారం మరింత బలోపేతం కావటంతోపాటుగా ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలు పెరగాలని ఇరువురు నేతలూ పేర్కొన్నారు.

ఇరుదేశాల్లో ఆర్థిక, పన్ను సంస్కరణలవల్ల ఆర్థికావకాశాలు విస్తృతమవుతాయన్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న వాణిజ్య బంధాల్లోని అవరోధాలను తొలగించుకోవటం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పెరుగుతున్న వాణిజ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్వేచ్ఛావాణిజ్యాన్ని పెంచుకునేందుకు మరింత సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నా రు. పారిశ్రామిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సహకారాన్ని బలోపేతం చేసుకునేలా చిత్తశుద్ధితో ముందుకెళ్లాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement