అమెరికా ఎన్నికల్లో మన ప్రధాని మోదీ! | US election: Donald Trump campaign video featuring Narendra Modi | Sakshi
Sakshi News home page

అమెరికా ఎన్నికల్లో మన ప్రధాని మోదీ!

Published Sun, Sep 13 2020 2:41 PM | Last Updated on Sun, Sep 13 2020 5:20 PM

US election: Donald Trump campaign video featuring Narendra Modi - Sakshi

ఒకరిది విదేశీ మంత్రం, మరొకరిది స్వదేశీ మంత్రం. ఇది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కనిపిస్తున్న తీరు. రెచ్చగొట్టే ప్రకటనలు, ఆకట్టుకునే హామీలు.. కరోనాను పట్టించుకోకుండా ప్రచారాలు.. మొత్తమ్మీద నవంబర్‌ 3 ఎన్నికల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు డొనాల్డ్‌ ట్రంప్‌, జో బైడెన్‌. మరోసారి గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ట్రంప్‌ భావిస్తుంటే.. ఎలాగైనా ట్రంప్‌ను ఓడించి డెమొక్రాట్లను అధికారంలోకి తీసుకురావాలని జో బైడెన్‌ భావిస్తున్నారు. 

అమెరికా ఎన్నికల్లో మన ప్రధాని మోదీని తెర మీదకు తెచ్చారు ట్రంప్‌. తన ప్రచారంలో మోదీ నా బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటూ  భారతీయ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రిపబ్లిక్‌ పార్టీ క్యాంపెయిన్‌లో మోదీ ఫోటోలతో ట్రంప్‌ ప్రచారం చేస్తున్నారు. నిర్ణయాత్మక రాష్ట్రాల్లో కీలకంగా మారిన భారతీయుల ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రంప్‌ మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. గత ఏడాది హూస్టన్‌లో జరిగిన హౌడీ మోడీ వీడియోలను ప్రచారాస్త్రంగా వాడుతున్నారు. (అమెరికా 2020: ఎన్నారైల ఆశ అదే!)
 
అక్కడితో ఆగలేదు. గుజరాత్‌లో జరిగిన నమస్తే ట్రంప్‌ వీడియోలను విపరీతంగా సర్క్యులేట్‌ చేస్తున్నారు. ట్రంప్‌ను మోదీ స్వాగతించిన తీరు, ఇచ్చిన ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రధాని మోదీని ఓన్‌ చేసుకునే ప్రయత్నంలో ట్రంప్‌ ఉన్నారు. భారత్‌ అమెరికాకు అత్యంత ఆప్తమిత్రురాలంటూ వ్యాఖ్యలు చేస్తూ.. అమెరికా విశ్వసించే దేశాల్లో భారత్‌ ముందుంటుందని ట్రంప్‌ చెప్పుకొస్తున్నారు. అక్కడ మోదీ, ఇక్కడ ట్రంప్‌.. ఇదీ రిపబ్లికన్‌ పార్టీ తరచుగా గుర్తు చేస్తోన్న అంశం. భద్రత ఒక్కటే కాదు, విద్య, వైద్యం, వాణిజ్యం అన్ని అంశాల్లో సహకారం అందిస్తున్నామని ట్రంప్‌ గుర్తు చేస్తున్నారు. (ట్రంప్ ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌క్తి: మేరీ ట్రంప్)


మరోవైపు ఇండియాను క్యాష్‌ చేసుకునే ప్రయత్నంలో డెమొక్రాట్లు నిమగ్నమయ్యారు. భారతీయ ఓటర్లకు గాలం వేసేందుకు కమలా హరిస్‌ యత్నిస్తున్నారు. తొలి నుంచి మోదీ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టే కమలా హరిస్‌.. బీజేపీ వ్యతిరేక స్టాండ్‌ తీసుకున్నారు. ఇటీవల ఆర్టికల్‌ 370 రద్దుతో పాటు, ఎన్‌ఆర్‌సీ విషయంలోనూ మోదీ సర్కారు నిర్ణయాన్ని కమలా హరిస్‌ తప్పుబట్టారు. దీన్నే అవకాశంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు రిపబ్లికన్లు. కమలా హారిస్‌ పేరుకే భారతీయ మూలాలన్న మహిళ అని, అంతే తప్ప భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని రిపబ్లికన్లు ప్రచారం చేస్తున్నారు. ట్రంప్‌ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కరోనాను తెరమీదికి తెస్తున్నారు డెమొక్రాట్లు.

కరోనా విషయంలో ట్రంప్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యారంటూ జో బైడెన్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రమాదం అని తెలిసినా ట్రంప్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు బైడెన్. అసత్యాలతో అమెరికన్లను ట్రంప్‌ మోసం చేశారని,  కరోనా కరాళ నృత్యం చేస్తుంటే ట్రంప్‌‌ చేతులెత్తేశారని ఆయన ధ్వజమెత్తారు. కరోనా విషయంలో ట్రంప్‌ అసమర్థంగా పని చేశారని దుయ్యబట్టారు బైడెన్‌. అధ్యక్ష విధుల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని, ప్రజారోగ్యాన్ని పట్టించుకోలేదని ట్రంప్‌పై ధ్వజమెత్తారు బైడెన్‌. ప్రపంచంలోనే అత్యధిక కేసులు అమెరికాలో నమోదు కావడానికి ట్రంప్‌ నిర్ణయాలే కారణమని విమర్శించారు. 

స్వదేశీ మంత్రం పాట పాడుతోన్న జో బైడెన్‌ ...విదేశీ వస్తువులపై భారీ టాక్స్‌ విధిస్తామని, కార్పోరేట్‌ టాక్స్‌ 21 శాతం నుంచి 28శాతానికి పెంచుతామని చెబుతున్నారు. విదేశీ వస్తువులు అమెరికాలో అమ్మితే 30.8% పన్ను విధిస్తామని, అమెరికన్లు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. మరి ఈ భారీ హామీల మధ్య ఓటర్లు ఎవరిని గెలిపిస్తారన్నది తేలడానికి నవంబర్‌ 3 వరకు వెయిట్‌ చేయాల్సిందే.

-శ్రీనాథ్‌ గొల్లపల్లి, సీనియర్‌ ఔట్‌ పుట్‌ ఎడిటర్‌, సాక్షి టీవీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement