పేటెంట్‌కు లేటెందుకు!
అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ సీరియస్‌గా ఇలా అంటాడు...
‘పేటెంట్ అనేది టెక్నాలజీకి కీ లాంటిది. టెక్నాలజీ అనేది ప్రొడక్షన్‌కు కీ లాంటిది’
‘మోస్ట్ సీరియస్ మెన్’గా పేరున్న, మూడువందల పేటెంట్లకు సొంతదారైన సెర్బియన్–అమెరికన్ ఇన్వెంటర్ నికొల టెస్లా చాలా తేలికగా ఇలా అంటాడు... ‘నా ఐడియాను ఎవరో దొంగిలించారు అనే బాధ కంటే, వారికంటూ ఒక ఐడియా ఎందుకు లేదు అనే బాధ నాలో ఎక్కువగా ఉంటుంది’
... ఎవరు ఎలా అన్నా, ప్రస్తుతం పెద్ద పెద్ద కంపెనీలు పేటెంట్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. మెరికల్లాంటి యూత్‌తో ప్రత్యేక సైన్యాన్ని తయారు చేస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ సౌత్ కొరియన్ సాంకేతిక దిగ్గజం శాంసంగ్. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 7,500 పేటెంట్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే అందులో 50 శాతం మన దేశం నుంచే ఉన్నాయి. ఈ పేటెంట్ ఫైలర్స్ ఫస్ట్ టైమ్ ఇన్వెంటర్స్.
మిలీనియల్స్, జెన్ జెడ్‌ను సాంకేతికంగా తీర్చిదిద్దడంలో బెంగళూరు కేంద్రంగా ఏర్పడిన శ్రీ–బి (శాంసంగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్–బెంగళూరు) బాగా ఉపయోగపడుతుంది. శ్రీ–బికి ప్రత్యేకమైన ఐపీ(ఇంటలెక్చువల్ ప్రాపర్టీ) బృందం ఉంది. ఇది యువతరానికి ఇన్వెన్షన్–క్రియేషన్ ట్రైనింగ్, ఇన్వెన్షన్ ప్రాసెస్‌కు ఉపకరించే అడ్వాన్స్డ్ ఇన్వెంటివ్ స్టెప్ ట్రైనింగ్ ఇస్తుంది.
పేటెంట్ ఫైలింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంటర్నల్ పోర్టల్ ఏర్పాటు చేసింది. వీటిద్వారా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎమర్జింగ్ ఏరియాలుగా చెప్పుకునే 5జీ, ఏఐ, ఐవోటి, కెమెరా అండ్ విజన్ టెక్నాలజీస్‌కు సంబంధించి దరఖాస్తులు ఎక్కువగా ఉంటున్నాయి. పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకునే వాటిలో ఎక్కువ భాగం అంకుర సంస్థలుగా మొదలుకావడం విశేషం.
‘యువతరం ఆవిష్కర్తలను చూసి గర్వపడుతున్నాం. ఎదుగుతున్న దశలోనే అద్భుతమైన విజయాలను సాధిస్తున్నారు. వారికి శాంసంగ్ అన్ని విధాల అండగా ఉంటుంది’ అంటున్నారు శ్రీ–బి సీటీవో అలోక్‌నాథ్.
‘కొత్త ఆవిష్కరణల కోసం జరుగుతున్న ఈ ప్రయాణం యువతరం మనస్తత్వానికి తగినట్లుగానే ఆటపాటలతో హుషారుగా సాగుతుంది’ అంటున్నారు శ్రీ–బి డిజైన్ మెనేజర్ స్వాధా జైశ్వాల్.
సాంకేతిక జ్ఞానం మాత్రమే కాకుండా ఇన్స్పైరింగ్ స్టోరీలు వినిపించడం ద్వారా యువతరంలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి సంస్థలు. మచ్చుకు ఒకటి...
పదిహేనేళ్ల వయసులోనే వైద్యరంగం ముక్కున వేలేసుకునేలా చేశాడు జాక్ అండ్రాక (యూఎస్). ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను ముందుగా, తక్కువ ఖర్చుతో గుర్తించే సాధనానికి రూపలకల్పన చేసి ‘ఐకానిక్ ఇన్వెంటర్ ఆఫ్ జెనరేషన్ జెడ్’గా కీర్తి అందుకున్నాడు జాక్. అయితే జాక్ చదువులో అద్భుతాలు సాధిస్తున్న విద్యార్థి ఏమీకాదు. సాధారణ విద్యార్థే. తన ఆవిష్కరణకు మూలం గూగుల్ అనేది ఆశ్చర్యకరమైన వాస్తవం!
తన దగ్గరి బంధువు ఒకరు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో చనిపోయాడు. దీంతో ఆ క్యాన్సర్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఆ క్యాన్సర్‌కు కారణం ఏమిటి? ఏ దశలో గుర్తిస్తున్నారు? పరీక్షలు ఏమిటి? సర్వైవర్ల శాతం ఎంత... మొదలైన విషయాలను గూగుల్ ద్వారా తెలుసుకోగలిగాడు.
‘ఈజీ, చీప్, సింపుల్, సెన్సెటివ్ అండ్ సెలెక్టివ్’ అనే మూలసూత్రంతో రిసెర్చ్ ప్రపోజల్ తయారు చేసుకొని, క్యాన్సర్‌పై పరిశోధిస్తున్న 200 మందికి పంపించాడు. 199 మంది తిరస్కరించారు. ఒక్కరు మాత్రం ‘బహుశా వీలవుతుందేమో!’ అన్నారు. ఇక జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ(మేరిలాండ్)లో ప్రయోగాలు చేయడానికి అనుమతి అనేది చా...లా కష్టంగా దొరికింది. ఎన్నో అవాంతరాలను తట్టుకొని తన కలను సాకారం చేసుకున్న జాక్ ఇప్పుడు మరికొన్ని కలలు కంటున్నాడు. వాటిని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నిస్తున్నాడు. గమనించాల్సిన విషయం ఏమిటంటే జాక్ ది ఒంటరిపోరు. అయితే శ్రీ–బిలాంటి సంస్థల వల్ల కలలు కనే యువతరానికి ఒంటరిపోరు తప్పుతుంది. శక్తిమంతమైన మద్దతు దొరుకుతుంది.