మా పార్టీది తప్పుడు నిర్ణయం: శైలజానాథ్
హైదరాబాద్: తెలంగాణ తీర్మానం రాష్ట్ర అసెంబ్లీకి వస్తుందని మంత్రి శైలజానాథ్ అన్నారు. విభజన బిల్లు ఏ రూపంలో వచ్చినా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. సీఎం కిరణ్తో సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన తీర్మానం అసెంబ్లీకి రావాల్సిందేనని అన్నారు. చరిత్రలో ఏ రాష్ట్ర ఏర్పాటు అసెంబ్లీ తీర్మానం లేకుండా జరగలేదన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని కాదని పార్లమెంట్ ఎలా ముందుకెళ్తుందో చూద్దామన్నారు.
సమైక్యాంధ్ర కోసం శాసనసభను సమావేశపరచాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంతో కూడుకున్నది ఆరోపించారు. చంద్రబాబు ప్రసంగంలో సమైక్యాంధ్ర గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. రాష్ట్ర విభజనపై తమ పార్టీది తప్పుడు నిర్ణయం తీసుకుందని శైలజానాథ్ దుయ్యబట్టారు. విభజన తీర్మానాన్ని ఓడించాలని నిర్ణయించామన్నారు. సమైక్యాంధ్ర కోసం కోట్లాది ప్రజలు పోరాటం చేస్తున్నారని చెప్పారు. తీర్మానం ఓడించాక ప్రజలతో కలిసి ఉద్యమంలోకి వస్తామన్నారు.