అజాత శత్రువుగా అందరివాడయ్యారు.. | The journey of Tirupati MP Balli Durga Prasad Rao in politics | Sakshi
Sakshi News home page

అజాత శత్రువుగా అందరివాడయ్యారు..

Published Thu, Sep 17 2020 8:53 AM | Last Updated on Thu, Sep 17 2020 11:24 AM

The journey of Tirupati MP Balli Durga Prasad Rao in politics - Sakshi

బల్లి దుర్గాప్రసాద్‌ సామాన్యుడిగా జీవితం ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగారు. నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో ఎవరినీ నొప్పించక మెప్పించి అజాత శత్రువుగా అందరివాడయ్యారు. చిరునవ్వుతో మంచి తనంతో మమతానుబంధాలను పెనవేసుకున్నారు. న్యాయవాదిగా ప్రస్థానం ప్రారంభించి పార్లమెంట్‌ సభ్యుడిగా నిష్క్రమించారు. సాధారణ కుటుంబంలో జన్మించి పార్లమెంట్‌ సభ్యుడి స్థాయికి చేరుకున్నారు. ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. ఎంపీగా ప్రజాసేవకే జీవితం అంకితం చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు అండగా ప్రజాక్షేత్రంలో నిలబడి.. వైరస్‌ బారిన పడ్డారు. కొద్ది రోజులుగా చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ సాక్షి, తిరుపతి : తిరుపతి పార్లమెంట్‌ సభ్యుడు, సీనియర్‌ రాజకీయ నేత బల్లి దుర్గాప్రసాద్‌ బుధవారం సాయంత్రం ప్రజా క్షేత్రం నుంచి నిష్క్రమించారు. రాజకీయంగా వివాద రహితుడిగా పేరున్న దుర్గాప్రసాద్‌ నాలుగు దశాబ్దాల పాటు క్రియాశీల రాజకీయాల్లో మచ్చలేని నేతగా  కొనసాగారు. నాలుగు పర్యాయాలు గూడూరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఏకైక నేతగా ఖ్యాతి గడించారు. స్వస్థలం వెంకటగిరి అయినప్పటికీ రాజకీయ ప్రస్థానమంతా గూడూరులోనే సాగడం గమనార్హం. ఆయన తిరుపతికి వస్తే తన సన్నిహితులను తప్పక కలిసేవారు. ఎస్వీయూ ప్రొఫెసర్‌ దామోదరరెడ్డితో పలువురు అధ్యాపకులతో స్నేహంగా ఉండేవారు.

మిత్రులను చాలా అభిమానంగా చూసేవారు. వారికి ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే స్పందించేవారు. దుర్గాప్రసాద్‌కు ఏర్పేడు మండలం పల్లం గ్రామానికి చెందిన భక్తవత్సలనాయుడు మంచి స్నేహితుడు. ఆయన అనారోగ్యానికి గురై స్విమ్స్‌లో చేరిన విషయం తెలుసుకున్న దుర్గాప్రసాద్‌ వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. ‘‘వాడికి ఆరోగ్యం బాగయ్యే వరకు ఆస్పత్రి నుంచి వెళ్లనివ్వకండి’’ అంటూ చెప్పినట్లు ఆయన స్నేహితులు గుర్తుచేసుకుంటున్నారు. ఆయనకు భార్య సరళమ్మ, కుమారులు బల్లి కళ్యాణ్, కార్తీక్, కుమార్తె హరిత ఉన్నారు. కుమారుడు కల్యాణ్‌ తండ్రికి రాజకీయంగా చేదోడువాదోడుగా ఉంటున్నారు. 

రాజకీయ ప్రస్థానం ఇలా.. 

  • 1985లో గూడూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థిగా 22,224 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.  
  • ఆ తర్వాత 1989లో గూడూరు నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు.  
  • 1994లో గూడూరు నుంచే 28,350 ఓట్ల మెజార్టీతో గెలుపొంది 1996–98 మధ్య కాలంలో రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.  
  • 1999లో 9,770 ఓట్లతో గెలుపొందారు. 2004లో టీడీపీ టికెట్‌ నిరాకరించినప్పటికీ పార్టీలోనే కొనసాగారు.  
  • 2009లో పోటీచేసి 10,638 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో టీడీపీ టికెట్‌ నిరాకరించడంతో మిన్నకుండిపోయారు.  
  • 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున తిరుపతి పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీచేసి రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు.  
  • ఎంపీగా తిరుపతితో పాటు గూడూరు, వెంకటగిరి అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ప్రత్యేక నిధుల కోసం ప్రయత్నించారు.
  • న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తూ దివంగత మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు.  
  • దుర్గాప్రసాద్‌రావు బీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి వెంకటగిరిలోనే న్యాయవాద ప్రాక్టీస్‌ ప్రారంభించారు.   
  • 1985లో గూడూరు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి తొలిసారిగా విజయం సాధించి అసెంబ్లీ అడుగుపెట్టారు. అక్కడి నుంచి గూడూరు కేంద్రంగా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ తుది శ్వాస విడిచే వరకు క్రియాశీలకంగా ఉన్నారు.
  • ఆయన స్వస్థలం వెంకటగిరిలో గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement