టికెట్ దక్కేనా !
వలస నేతలకు ప్రాధాన్యంపై కినుక దుర్గాప్రసాద్, పరసా
ఆశలన్నీ మూడో జాబితాపైనే
నెల్లూరు : టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా ఓ వెలుగు వెలిగి, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న బల్లి దుర్గాప్రసాద్, పరసా వెంకటరత్నంకు పార్టీలో ప్రాధాన్యం కొరవడినట్టుంది. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్‌లో కొనసాగి వచ్చిన నేతలకు టీడీపీ టికెట్లు ఖరారవగా, పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వీరికి తొలి రెండు జాబితాల్లో చోటు దక్కలేదు. ఈ క్రమంలో వీరిద్దరికీ టికెట్లు లభించేది అనుమానమేనని టీడీపీ సీనియర్ నేతలు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఈ రోజు సమాచారం కాదని, ఆరు నెలలుగా పార్టీలో ఇదే మాట వినిపిస్తోందని చెబుతున్నారు.
అయితే టీడీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్న చంద్రబాబు జిల్లాలోని రెండు ఎస్సీ రిజర్వుడు స్థానాలకు అభ్యర్థులను కేటాయించే విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆయ న ప్రకటించిన తొలి జాబితాలో కావలి శాసనసభ్యుడైన బీద మస్తాన్‌రావుకు చోటు లభించింది. రెండో జాబితాలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో పాటు కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి(ఎంపీ అభ్యర్థి) ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేర్లు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలైన దుర్గా ప్రసాద్, పరసా వెంకటరత్నం పేర్లు రెండు జాబి తాల్లో కనిపించకపోవడంతో వారితో వారి అనుచరులు కూడా ఆందోళన చెందుతున్నారు.