వివిధ రకాల సరుకులను రవాణా చేస్తున్న లారీలు
తెలుగుదేశం ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకోవడం.. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన వెంటనే ఎందుకు తొందరపడ్డామా అనే ఆలోచనల చేయడం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఈ–పర్మిట్ విధానాన్ని కొత్తగా ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం రెండు నెలల కిత్రం ప్రకటించింది. ఈ విధానంలో పలు లోపాలు, వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అమలు చేయాలా వద్దా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
నెల్లూరు(సెంట్రల్): ఈ–పర్మిట్ విధానం వల్ల లారీ డ్రైవర్లకు, యజమానులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ–పర్మిట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. దీంతో ఈ–పర్మిట్ విధానంపై అమలుపై టీడీపీ ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు సమాచారం.
యజమానుల నుంచి వ్యతిరేకత
వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వ్యాపారులకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇందు కోసం వీరికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అందజేస్తారు. దీని ద్వారా ఆన్‌లైన్‌లో ఈ రవాణా పర్మిట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు అనుమతులు అడిగినప్పుడు ఈ పర్మిట్‌ను చూపించాల్సి ఉంటుంది. అపరాధ రుసుం చెల్లించాల్సి ఉన్నా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. కాగా ఈ పర్మిట్ తీసుకునే విధంగా ఎంత మందికి అవగాహన ఉందనే అనుమానాలు కలుగమానడం లేదు.
లారీల్లో సరుకు రవాణా చేసే వారు అపరాధ రుసుం చెల్లించాలంటే ఆన్‌లైన్‌లోనే కట్టాలని చెబుతున్నా... ఏ విదంగా , ఎవరి వద్ద ఆన్‌లైన్‌లో కట్టాలనేది స్పష్టత లేదు. ప్రధానంగా లారీ డ్రైవర్ల వద్ద ఏటీఎంలు ఉంటాయా.. అనే అనుమానాలు కూడా కలుగ మానడం లేదు. ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకున్న వాహనం గంటల వ్యవధిలోనే మాత్రమే ఆ అనుమతి ఉంటుంది. ఏదైనా అంతరాయం ఏర్పడి వాహనం వెళ్లలేకుండా ఉంటే తిరిగి మళ్లీ ఆన్‌లైన్‌లోనే అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆన్‌లైన్ వ్యవస్థతో మోటర్ ఫీల్ట్‌లో ఉండే వారికి పెద్దగా అవగాహన లేకపోవడంతోపాటు, ఇబ్బందులు ఉండటంతో లారీ యజమానుల రాష్ట్రంలోని పలు జిల్లాలలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విధంగా వ్యతిరేకత వస్తుండటంతో ఈ–పర్మిట్ విధానంపై ప్రభుత్వం వెనక్కు తగ్గిందని తెలుస్తోంది.
రెండు నెలలుగా..
ఈ పర్మిట్ విధానం అమలు చేస్తామని మే నెలలో వ్యవసాయమార్కెట్ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. జూన్ మొదటి నుంచి అమలులోకి వస్తుందని, తరువాత కొన్ని కారణాల వల్ల జూలై మొదటి నుంచి వస్తుందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ పర్మిట్ విధానాన్ని సీఎం చేతుల మీదుగా ఈనెల 5వ తేదీన ప్రారంభమవుతుందని, రాష్ట్రం మొత్తం ఆ రోజు నుంచే అమలులోకి వస్తుందని సర్కారు పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు. ఇంత వరకు ఆ ఊసే లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రానున్నది ఎన్నికల సమయం కావున, వాహన యజమానుల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.
ఏటా రూ.26 కోట్ల ఆదాయం
జిల్లాలో నెల్లూరు, కోవూరు, కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, వాకాడు, రాపూరు, ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి ప్రాంతాల్లో 11 వ్యవసాయ మార్కెట్ కమీటీలు ఉండగా.. వీటి పరిధిలో 22 మార్కెట్ చెక్‌పోస్టులు ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన కూరగాయలు, పండ్లు, బియ్యం, «ధాన్యం, చిరుధాన్యాలు, ఇతర 130 రకాల వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు సంబంధించి ఆయా వ్యాపారులు ఒక శాతం సెస్సును మార్కెట్‌శాఖకు కట్టాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏటా రూ.24 కోట్ల నుంచి రూ.26 కోట్ల వరకు జిల్లా నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంటుంది. ఆన్‌లైన్ లో ఈ–పర్మిట్ విధానంతో ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ మాత్రం పూర్తి చేయలేమని జిల్లాలోని మార్కెట్‌కమిటీ అధికారులు చెబుతుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment